Magazines

పాటమ్మకు కన్నీటి పబ్బతి దేవరకొండ భిక్షపతి

1 గంట క్రితం

Tears for Mother Song – Devarakonda Bhikshapathi
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 5 నిమిషాల చదవడం

ప్రజా ఉద్యమాలుసాహిత్యానికి సజీవ చైతన్యాన్ని అందిస్తాయి. వినూత్నసృజనకు పురుడు పోస్తాయి. ఉద్యమతత్త్వాన్ని సాహిత్యం మరింత విస్తృత పరుస్తుంది. ఉన్నతీకరిస్తుంది. మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సుప్రసిద్ధ ప్రజా వాగ్గేయ కారులతో పాటు ఎంతోమంది కొత్తతరం కవులు కూడా తమ పాటలతో ప్రజా చైతన్యానికి బాటలువేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను, ఆవశ్యకతను ఊరూవాడా చాటి చెప్పారు. మూడుపదుల వయసు దాటకుండానే మహా కావ్య స్ఫూర్తిని వాగ్దానం చేసే అపురూపమైన పాటలు రాశారు. ప్రతిభ తప్ప వ్యుత్పత్తి, అభ్యాసం అంతగా లేకుండానే బతుకు పోరాటాన్నిపాటలుగా మలిచారు. ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్, నేర్నాల కిశోర్, మానుకోట ప్రసాద్, సాయిచంద్, యోచన్, దరువు ఎల్లన్న, కోదారి శ్రీను, అభినయ శ్రీనివాస్ లాంటి ‘నెత్తురుమండే శక్తులు నిండే’ అనేక మంది కవులు, గాయకులు తమ సృజనతో వర్తమాన సాహిత్యానికి అసాధారణ స్ఫూర్తిని అందించారు. వీరిలో దేవరకొండ భిక్షపతి అరుదైన ప్రజా కవి, గాయకుడు, ప్రతిభావంతమైన ప్రజా వాగ్గేయ కారుడు.


భిక్షపతి పాటలు నిత్యం నీడలా వెంటాడుతుంటాయి. అమ్మయాదిలా, పల్లె మనాదిలా, అమర వీరుల సమరనాదంలా హృదయాన్నికదిపి, కుదిపివేస్తాయి. తెలంగాణ ధూమ్ ధాం సభల్లో దేవరకొండ భిక్షపతి పాట ఆలపించంగానే అశేష జన వాహిని ఉప్పొంగిపోయిన ముచ్చట కాలం ఎప్పటికీ మరిచిపోదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం గ్రామంలో నిరుపేద మాదిగ కుటుంబంలో వెంకటయ్య, సత్తెమ్మ దంపతులకు 1977 సంవత్సరం జనవరి 13 భిక్షపతి జన్మించాడు. ఇంటర్ మీడియట్ వరకు చదివిన భిక్షపతి, బాటుకు పోరాటంలో అనేక కష్టాలు అనుభవించాడు. రచయిత సీతారాములు సహకారంతో సాంఘీక సంక్షేమ వసతిగృహంలో వాచ్‌‌మెన్‌‌గా కొన్నాళ్లు సేవలందించాడు. బాల్యం నుండి గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, జయరాజు, అందెశ్రీ, యస్ పాల్ తదితర కవులపాటల స్ఫూర్తి, ఉద్యమాల పోరు జాడ ఇల్లెందు, బయ్యారం అందించిన సాంస్కృతిక ఉత్తేజం, విప్లవ, దళిత, తెలంగాణ ఉద్యమాల చైతన్య స్పృహ, అరుణోదయ సాస్కృతిక సమాఖ్య ఇచ్చిన ప్రేరణ వీటన్నింటి నేపథ్యంతో భిక్షపతి హృదయంలో సృజన చిగురించింది. స్వరంలో రాగం పల్లవించింది. 'జయరాజన్నవేలు పట్టుకొని పాట నేర్చుకున్నాను' అని స్వయంగా భిక్షపతి చెప్పినట్లుగానే పాటకు అవసరమైన వస్తు, రూపాలను, బాణీలను ప్రజా పోరాటాల నుండి, పీడిత వర్గాలనుండి అందిపుచ్చుకోవాలని ఈ కవి కి జయరాజు దిశానిర్దేశం చేశాడు. తక్కువ రాసినప్పటికీ భిక్షపతి పాటలు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ప్రభావితం చేశాయి. వందలాది ఉద్యమ సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేవలం దశాబ్ది కాలంలోనే కవిగా, గాయకునిగా, ప్రజా వాగ్గేయకారునిగా ప్రఖ్యాతిగాంచిన భిక్షపతి 2015 సవత్సరం సెప్టెంబర్ 3 వతేదీ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు.

కరుణవీరంతో సాగే భిక్షపతి పాటల్లో అనుక్షణం పాఠకుల్ని, శ్రోతల్ని వెంటాడే గుణం ఉంటుంది. మనసును ఆవహించే (lingering effect) లక్షణం నిబిడీకృతమై ఉంటుంది. ''కొడుకు నా ముద్దు కొడుకా! కొడుకా! ఓచిన్నికొడుకా! ‌ఎక్కడ బోతివిరా''  భిక్షపతి రాసిన ఈపాట అత్యంత ప్రజాదరణ పొందింది. ఎదిగే వయస్సులో విప్లవారణ్యంలోకి వెళ్ళిపోయిన కన్నకొడుకును యాది జేసుకొని ఒక తల్లి అనుభవించే మనోవేదనని భిక్షపతి అద్భుతమైన పాటగా మలిచాడు. ఒక కథా కావ్యంలాసాగే ఈ పాట, ప్రజా యుద్ధ నౌక గద్దర్ నుండి నేటి సినీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వరకూ కోట్లాదిమందిని కదిలించింది. ''ఇంటి ముందు చింత చెట్టు మీద/ కాకమ్మ కావు కావు మంటే /నా కొడుకే వస్తాడనుకొని /పాలు దెచ్చి పాసమొండుకుంటే/ ఏ దారి చూసినా.. ఎవ్వరూ రా రాయే / ఆ పాసమన్నం పాసి పాయే/ పాల బాకీ ఇంక తీరదాయే'' అంటూ పేగుబంధంకోసం విలపించే పేదతల్లి ప్రేమతత్త్వాన్ని ఈ పాటలో భిక్షపతి పరమ ఆర్ద్రంగా ఆవిష్కరించాడు. ఈ చరణంలో చివరి వాక్యాలు మనసును కలిచివేస్తాయి

చివరికి ఆ తల్లి, బిడ్డ పట్ల తనకున్న బెంగను లోలోపల దాచుకొని, లోకం బెంగ తీర్చడానికి విప్లవ పథంలో ముందుకు సాగమని బిడ్డకు ప్రబోధించే భావాన్ని కవి ఉదాత్తంగా చిత్రించాడు. ''అన్యాయాన్నెదిరించిన అమరుల బాటలో నడువు... అమరుడు పెద్దన్న బందూకు/ అందుకొని ముందు నడువు /నీకు బరువైతే చెప్పు కొడుకా/ నా బలమిస్తా పట్టు  కొడుకా'' ఒక వీరమాత ధీర చిత్తాన్నికవి అసాధారణ అభివ్యక్తితో పాటలో నిక్షిప్తం చేశాడు. పాటలోని భావ గాఢతను (emotional resonance) పరాకాష్టకు తీసుకెళ్ళాడు కవి. ''ఓ వెలిగే వెన్నెలమ్మ! చల్లని జాబిలమ్మ!/ నా కొడుకు యాడన్న కనిపించిండా! నేననుకొని నీ ఒడిలో నిదరోయుండా'' అంటూ మరొక పాటలో (poignant expression) శ్రోతల హృదయాలను ద్రవింపజేసే అపూర్వరచనాశైలి వ్యక్తమవుతుంది.

‘‘నిన్ను విడిచి ఉండలేనమ్మా! ఓపాటమ్మా/ ఎన్నడూ మరచిపోనమ్మా! నాపాటమ్మా’’ అనే పాట తెలంగాణ ధూమ్ ధాం సభల్లో లక్షలాది ప్రజల్ని ఉర్రూతలూగించింది. మిగతా కవులు, లోకంలోని అనేక వస్తువులను గురించి పాటలురాస్తుంటే, భిక్షపతి పాటనే వస్తువుగా తీసుకొని పాట ప్రయోజనాన్ని శక్తిమంతంగా చాటి చెప్పాడు. పాటకున్న భిన్న పార్శ్వాలను, సమాజంలో పాట పోషించిన బహుముఖీనమైన పాత్రను, దాని ఔన్నత్యాన్ని అభివర్ణిస్తూ పదికాలాలు నిలిచిపోయేవిధంగా ఈ పాట రాశాడు. ప్రజాకవులను వాగ్గేయకారులను, వారి గానశైలిని పాటలో ప్రస్తావించాడు. అమరవీరులకు, రైతులకు , ప్రేమికులకు,సైనికులకు చివరకు దేవుళ్ళకు కూడా పాటతో ఉన్నఅవినాభావ సంబంధాన్ని ప్రతిభావంతంగా ఈ కవి విశ్లేషించాడు. ''వెలివాడలో పురుడు బోసుకొని పల్లెతల్లి కడుపు పంటవైతవు/ తెలంగాణకు తోబుట్టువైతవ్ /అందరికీ ఆడబిడ్డవైతవ్'' అంటూ అణగారిన వర్గాల గుండెగొంతుల్లో నుండి పల్లెతల్లి పచ్చని నీడలో నుండి ఆవిర్భవించి ప్రక్రియ పాట అని భిక్షపతి శాస్త్రీయంగా ఆమోదయోగ్యంగా విశ్లేషించాడు. పాటను  అమ్మగా, తెలంగాణకు తోబుట్టువుగా, అందరికీ ఆడబిడ్డగా భావించడంలోకవి గొప్పఔచిత్యాన్ని ప్రదర్శించాడు.

ప్రపంచీకరణ ప్రభావంతో సంపన్నదేశాల సాంస్కృతిక ప్రభంజనంలో జనజీవితం విధ్వంసమవుతున్నసందర్భంలో గ్రామీణ సాంస్కృతిక వైశిష్ట్యాన్ని తెలంగాణ ప్రజా కవులు అత్యంత సహజంగా, సౌందర్య భరితంగావర్ణించారు. ''నా పల్లె తల్లిని మరిచి ఉండలేక పోతినన్నా/ నేనెక్కడున్నా మా పల్లె చల్లగుండాలిరన్న''అంటూ భిక్షపతి తెలంగాణ పల్లెల్లోని సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని సముచితంగా పాట బద్ధం చేశాడు. సబ్బండ వృత్తుల విభిన్నకులాలకు చెందిన ప్రజల పరస్పరాధార జీవన విధానాన్ని పాటలో మనోహరంగా దృశ్యమానం చేశాడు. ''మేం కళాకారులం ఓ యమ్మా/ ప్రజాకళాకారులం ఓ యమ్మ''అనే పాటలో సంచార కళాకారులు ఎదుర్కొనే కష్టనష్టాలను, వారి సాంస్కృతిక నిబద్ధతను తేటతెల్లం చేశాడు. 'బుద్ధి మాటలు చెప్పే బుడ బుక్కలోల్లం/ పోరు మాటలు చెప్పే పొడ పోత్ర పోల్లాం/ జనం పాటలు పాడే జంగాలము మేము/ అంటూ దుర్భరమైన పేదరిక వేదనలో కుమిలి పోతూ కూడా సమాజానికి కళానందం పంచిపెట్టే కవి, గాయక, వైతాళికుల త్యాగ నిరతిని ఈ పాటలో భిక్షపతి చిత్రించాడు.

భిక్షపతి కవి, గాయకునిగా, వాగ్గేయకారుడిగా సమాజంలో రాణించాడు కానీ, భర్తగా, తండ్రిగా జీవితంలో ఓడిపోయాడు. చాలా మంది కవులు కళాకారుల జీవితాల్లో ఇది సహజమే. ఉద్యమ సందర్భంలో, సభలు సమావేశాల ఉరుకులాటలో కుటుంబానికి దూరం కావటం అనివార్యం. 'స్వీయలోపమ్ములెరిగినవాడే పరిపూర్ణుడగు నరుడు' అని గాలిబ్ అన్నట్లుగానే, దేవరకొండ భిక్షపతి తన లోపాలను ఎత్తిచూపుతూ ఆత్మవిమర్శతో పాట రాయటం కూడా ఒక సాహసమే. ''ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య/ముద్దుగా నను చూస్తానంటివిరో బిచ్చయ్య/ అనే పాట ఇందుకు నిదర్శనం తన భార్య గుండెలోని ఆవేదనను ఈ పాటలో యధాతథంగా పొందు పరిచాడు.' ఆట అంటావ్/ పాట అంటూ అసలే నను మరిచిపోతివిరో బిచ్చయ్య/ ఎదుటి వాళ్ల బాధలు పోనీకి /తీయనైన పాటలు పాడతావురో బిచ్చయ్యా/నీ కడుపులో బాధ ఎవరికి ఎరికా/ అంటూ తనసహచరి ప్రశ్నించినట్లుగా భిక్షపతి పాట రాయడం విశేషంగా భావించవచ్చు. భిక్షపతి మేనకోడలు అశ్విని తన మధుర గాత్రంతో ఈ పాటలకు ప్రాణం పోసింది. భిక్షపతి పాటల్లోని ఆర్ద్రతను, భావోద్వేగాన్ని, తన గాత్రంలో ప్రతిభావంతగా పలికించి, ప్రజాహృదయాలను రంజింపజేసింది. యూట్యూబ్ లో అశ్విని పాడిన 'కొడుకా నా చిన్నికొడుకా' పాటవిని చలించిన సినీదర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సినీ గీత రచయిత కాసర్ల శ్యామ్ సహకారంతో ​ప్యారడైజ్‌ సినిమాలో ఆ పాటను స్వల్ప మార్పులతో ఉపయోగించుకున్నాడు. కమర్షియల్ సినిమాలో ఉద్యమ పాటలను ఎలా ఉపయోగించుకుంటారని కవి, గాయకుడు చుక్క రామ నర్సయ్య ప్రశ్నించాడు. ఏది ఏమైనప్పటికీ భిక్షపతి పాట వెండితెర ద్వారా మరింత మందికి చేరువయింది. భిక్షపతి పాటలను ఒక సమగ్ర సంకలనంగా ప్రచురించాల్సిన అవసరముంది. భిక్షపతి లాంటి ఎంతో మంది ప్రజా కవుల గురించి విస్తృతంగా చర్చ జరిగితే సమకాలీన సాహిత్య విమర్శ మరింత పరిపుష్టమవుతుంది.


- కె. కోటేశ్వర రావు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్