Magazines

అద్దం మీద పొగమంచు

1 గంట క్రితం

ప్రజాస్వామ్యం
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రజాస్వామ్యం ఒక పారదర్శక అద్దమైతే

అందులో ప్రజల ముఖమే కనిపించాలి...

కానీ...ఇప్పుడు

అద్దం మీదే పొగమంచు పరచి

ప్రతిబింబాల్ని లెక్కించే కాల విపత్తు

ఓటు ఒక విత్తనం... అది

భూమిలో పడి

అధికారపు చెట్టుగా ఎదగాలి..

కంచె కాపలాదారే

విత్తనాల లెక్క మార్చే వికృత జీవి

ప్రశ్నించే గొంతుకకు

మౌనపు ముసుగు తొడిగిన క్షణం

నిశ్శబ్దం కూడా.. నిప్పుల అక్షరమవుతుంది

రాజ్యాంగం గోడపై వేళ్ళాడే

పవిత్ర చిత్రపటం అనుకుంటే పొరపాటు

అది ప్రతీ పౌరుడి ఊపిరిలో

ఉచ్చ్వాస నిశ్చ్వాసల హక్కుల గుండె

తూకం పట్టిన చేయి ఒక వైపే వాలితే,

అది న్యాయమెట్లా అవుద్దీ..

ఇప్పుడు

భ్రమల్ని కల్పించే నీడల అస్తిత్వం దొరికింది

సర్వసత్తాక ప్రజాతంత్రమై

మహోజ్వల చరిత్ర రాసిన నేలపై

పాదముద్రల్నే చెరిపే ముసుగు చర్యకు

నేటి తిరుగుబాటు స్వరమే ప్రతిచర్య

నిశ్శబ్దం ఎప్పుడు పగిలిపోతుందో

ఏ అన్యాయ నాడీ వ్యవస్థకు

అంత తేలిగ్గా అంతుచిక్కదు

సమయాలు.. సందర్భాలు కూడికైనప్పుడు

కొన్ని అసంకల్పితంగానే కూలిపోతాయి

ప్రజల భయాలు కూలిపోవడమే

అసలు సిసలైన విప్లవ పతాకం

కాలపు ఘీంకారం చెవినెక్కక పోయినా...

బొటనవేలు నిఖార్సుగా తలెత్తి

ముద్ర వేసే రోజొకటి ముందుంది...

అప్పుడు సింహాసనాల కింద

భూమి తన తీర్పును గట్టిగా రాస్తుంది.

డా.కటుకోఝ్వల రమేష్, 9949083327

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్