క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక పాత్రికేయుడు, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తుల తరఫున పోరులో అమరుడైనాడు.ఆయన రచనల్లో ‘ది క్రైసిస్ ఆఫ్ ఫిజిక్స్, ఇల్యూజన్ అండ్ రియాలిటీ, స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్చర్, ఫర్థర్ స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్చర్’ ముఖ్యమైనవి. ఈ వ్యాసం ఆయన ‘ఇల్యూజన్ అండ్ రియాలిటీ’ లోని ‘ది ఫ్యూచర్ ఆఫ్ పోయెట్రీ’లో ముఖ్య భావాలను సమకాలీన వెలుగులో చూస్తుంది.
క్రిస్టోఫర్ కాడ్వెల్ దృష్టిలో కల భావివాణిని గురించి చెబుతుంది. కల యొక్క సృజనాత్మక శక్తి సామాజిక ఆచరణ నుంచే వస్తుంది. ఒక పూర్తి వర్గ సృజనాత్మకత ఒక వ్యక్తి చైతన్యంలో ప్రతిఫలిస్తుంది. సామాజిక వాస్తవికతను మార్చేది విప్లవ ఆచరణ. ఇది మన చైతన్యం పరిధిని పెంచుతుంది. కొత్త విలువలను ఇస్తుంది. పెట్టుబడిదారీ విధానంలో పాత సంబంధాల్లో మార్పు దానంతట అదే కాక మానవ చర్యల వల్లనే వస్తుంది. కొత్త వ్యవస్థ సామాజిక సంబంధాలు పాత దాని గర్భంలోంచి పుడుతున్నాయి.
బూర్జువా వర్గ స్వేచ్ఛ సారాంశంలో ఎక్కువమంది ఆస్తిని హరించి కొద్ది మంది వ్యక్తిగత ఆస్తిని కాపాడటమే. నేడు బూర్జువా సంస్కృతి చివరి సంక్షోభం కోరల్లో ఉంది. లాభాల కోసం ఫ్యాక్టరీల మధ్య పెరిగే పోటీ, సంక్షోభాలు, ఉత్పత్తిని పరిమితం చేసే వ్యవస్థ, జాతీయవాదం, శత్రుత్వం, యుద్ధ సన్నద్ధాలు, ఖాళీ పెట్టుబడి విదేశాల్లో లాభాల కోసం అన్వేషణ, స్వదేశంలో నిరుద్యోగం పెరుగుతున్నాయి.
ఉత్పత్తి సాధనాలపై గుత్తాధిపత్యం తెచ్చుకున్న మైనారిటీకి వ్యతిరేకంగా మెజార్టీ ప్రజ నిలబడుతుంది. బూర్జువా వర్గం తన సొంత రక్షణకు మరింత పాశవికమైన, కుట్ర పూరిత విధానాలు అనుసరిస్తుంది. పైకి వర్గాతీతంగా కనిపించే రాజ్యం నిజానికి మెజారిటీపై అల్ప సంఖ్యక పాలకవర్గ దోపిడీని కొనసాగించే బలప్రయోగ సాధనమే. పీడిత వర్గం ఊహాజనిత సమస్యలపై కాక తమ బాధలను ఉత్పత్తి చేసే భౌతిక పరిస్థితులను వ్యతిరేకించాలి. ఈ పోరులో పార్టీ ప్రజలతో నిరంతర సంబంధాల్లో ఉండి సైద్ధాంతికంగా, రాజకీయ ఇచ్ఛా కల్పనలో నాయకత్వం వహించాలి అని విమర్శకుడు క్రిస్టోఫర్ కాడ్వెల్ మార్క్సిస్టు దృక్పథాన్ని వెల్లడించాడు.
కాడ్వెల్ ఆలోచనలో బూర్జువా వర్గ దృష్టి అసంపూర్ణత, వర్గ భేదాలకు హేతువైన భౌతిక వైరుధ్యం పెరిగే కొద్దీ, ఆలోచన-ఆచరణల మధ్య తేడా వల్ల భరించలేని బాధలు కలుగుతాయి. పాలకవర్గ చైతన్యం సంకుచితమై అకడమిక్ గా, ప్రతీఘాతుకంగా, ఫాసిస్టుగా మారుతుంది. బూర్జువా వర్గానికి, కార్మిక వర్గానికి గల ఈ సంబంధంలో మూడు సాధ్యమైన పాత్రలు ఉన్నాయి. వ్యతిరేకత, ఐక్యత లేదా మిళితమైపోవడం. వ్యతిరేకత అంటే వెనక్కి దాదాపు పురాణ వస్తువులకు తిరిగిపోవటం.
చరిత్రను వెనక్కి మళ్లించే ఈ ప్రయత్నం ‘ఆర్యన్’ ఫాసిస్టు కళను ఇస్తుంది.
క్రిస్టోఫర్ కాడ్వెల్ రాసినట్లు కార్మిక వర్గ కర్తవ్యం ఏమిటంటే ఆర్థిక, సైద్ధాంతిక గందరగోళాన్ని సమన్వయం చేసి సమాజాన్ని కొత్త ఉత్పత్తి స్థాయికి, చైతన్య స్థాయికి తీసుకుని వెళ్ళటం. దీని ఉద్దేశం మానవాళికి మరింత స్వేచ్ఛ మాత్రమే. కమ్యూనిస్టు కళ తప్ప వర్గ రహిత కళ లేదు. వర్గ కళ అనేది శ్రామిక వర్గాలది కానిదే నశించే వర్గ కళగా మాత్రమే ఉండగలదు. ఇదే సందేశాన్ని శాస్త్రవేత్త, ఇంజనీర్, చరిత్రకారుడు, ఆర్థికవేత్తలకు కూడా శ్రామిక వర్గం ఇస్తుంది.
ఏ వర్గం మనుగడ పరిస్థితులు సదా విప్లవీకరణం కావాలో ఆ బూర్జువా వర్గం పాలన నిర్దిష్ట బూర్జువా వర్గ పరిస్థితులనే పుట్టించే కవితా ప్రపంచానికి దారితీస్తుంది. జీవితం నుంచి కవిత్వం శుద్ధ కళా స్వర్గానికి ఎగిరి పోతుంది. ఎక్కువ మంది కవిత్వం చదవక, దాని అవసరం అనుభూతి చెందక అర్థం చేసుకోరు. కవి తన కవిత్వం సమాజానికి అవసర విధి (ఆదిమ జాతులులో లాగా) నుంచి దూరం చేసే కొద్దిమందికి విలాస వస్తువు అయ్యేదాకా కేంద్రీకరిస్తాడు. కమ్యూనిస్టు కవి అయితే వాస్తవ ప్రపంచంలో అన్ని మానవ విలువల ఆచరణకు అపూర్వమైన ఆసక్తితో ఉంటాడు. కళావస్తువు మానవ మనుగడ ఉన్నంత ఉంటుంది. శాశ్వతత్వం, మార్పుతత్వం తమలో కలిగిన కళ మనిషి ఆత్మ సాక్షాత్కారంలో భాగంగా, మానవ వాస్తవికతలలో ఒకటిగా ఉంటుంది.
క్రిస్టోఫర్ కాడ్వెల్ భావాలను నేడు పరిశీలించినప్పుడు అర్థమయ్యేది ఏమిటంటే సమ సమాజ స్వప్నం అంతర్థానం కాలేదు. కాబోదు. ప్రపంచీకరణ, ప్రవేటీకరణలు అసమానతలను ఎన్నో రెట్లు పెంచాయి. కార్మిక వర్గం ఆర్థిక వాదం వదిలి బయటపడాలి. ఉత్పత్తి శక్తులు సాంకేతిక జ్ఞానంతో అప్రతిహతంగా పెరుగుతున్నట్లు భావిస్తున్నా వేతన బానిసత్వానికి, కాంట్రాక్ట్ వేతన బానిసత్వానకి కాలం దగ్గర పడింది. ఆత్మ గౌరవం కోసం ప్రజల్లో తమ భవిషత్తు తామే నిర్ణయించాలనే కోరిక బలంగా ఉంది.
ఈ నాడు దేశంలోని ఆశ్రిత పెట్టుబడిదారి వర్గం అసమానతలను, ప్రకృతి విధ్వంసాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించలేక చేతులు ఎత్తేసింది. మరో వంక సంఘటిత కార్మిక వర్గం రాజకీయ పునర్నిర్మాణ చైతన్యంలో వెనుక బడింది. అసంఘటిత కార్మికులు కనీస హక్కులు కోసం కలవరంలో, ఆశాలు, గిగ్ వర్కర్లు, కాంట్రాక్టు కార్మికులు అప్పుడప్పుడు పోరాటాల్లో ఉన్నారు.
ఇప్పుడు, ప్రివిలేజ్డ్ కులాల, వర్గాల వినిమయవాద సాంస్కృతిక విలువలు ఒక వైపు, ఇహ లోకం సమస్యల నుంచి దృషి మళ్లించే మత విలువల ప్రాబల్యం పెరిగింది. ఇది ఎక్కువ కాలం భ్రాంతిలో జనాన్ని ఉంచలేదు. రాజ్యం తటస్థ ముసుగు చెరిగి ఉన్నవారికి ఊడిగం చేస్తుందనేది అందరికీ తెలుస్తోంది. న్యాయం గగన కుసుమం అయింది. వ్యవస్థ బాగుపడాలని యువత కోరుతోంది. అదే యువత సమూల మార్పుకు సైతం సిద్ధమవుతోంది.
ప్రజా సంస్కృతిని అదృశ్యం చేయాలని ఎలైట్ ఎంత యత్నించినా రచయితలు, కళాకారులు ఉదయ గీతం పాడుతున్నారు. శాంతియుత మార్పు అసాధ్యం అనుకుంటే వ్యవస్థ పునాది కదిలే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న, కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలపై నయా సామ్రాజ్యవాదుల ఆర్థిక, సైనిక చర్యలు శాంతియుత సోషలిస్టు మార్గాన్ని ఒప్పుకుంటాయా అనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు దెబ్బతింటే దురాక్రమణ, జాతీయ దురహంకార ప్రదర్శన చేయటం చూశాం. అవి ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా, ఇరాన్ పట్ల వ్యవహరించిన తీరు ఇదే వాస్తవాన్ని తెలియజేస్తుంది.
పాలక వర్గాలు ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా ఇనుప ఆటంకాలు జన వాహినిని ఆపలేవు. గత శతాబ్దిలో జరిగిన సోషలిస్టు సమాజ ప్రయోగాలు ఉత్సాహాన్ని ఇవ్వవు అని భావించేవారు పాశ్చాత్య సామ్రాజ్యవాద అనుభవాలు అసలు పనికి రావని గుర్తించాలి. గత రెండు శతాబ్దాలలో బూర్జువా ప్రజాస్వామ్యం ఎలా పరిణామంలో మారిందో, సోషలిజం కూడా మరింత మెరుగైన రీతిలో మారుతుంది. శ్రామిక వర్గాల, వాటి సంస్కృతి ఆధిపత్యం పెరిగే కొద్దీ, దోపిడీ వర్గ రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యం, చాణక్య ఎత్తుగడలు తరిగే కొద్దీ సోషలిజం మరింత ప్రజాస్వామ్య సారాన్ని సంతరించుకుంటుంది.
లాభాల వాణిజ్యం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం సాగే యుద్ధాలు పోవాలి.
మనకు కావలిసింది కూలుతున్న సౌధానికి రంగులు వేయటం కాదు. సమస్యల శాశ్వత పరిష్కారానికి మార్గం యధా తథవాదులు, తటస్థవాదులు పార్టీల మ్యూజికల్ కుర్సీ ఆటలో కాక దేశ భావి సోషలిస్టు కల సాకారంలోనే ఉందని గుర్తించాలి. కుల, మత, ప్రాంతీయ, లైంగిక, జాతి అసమానతలు పోయి సోషలిస్టు ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పోరాటమే మార్గమని ఎరుక పెరగాలి. అన్ని కళలు కొత్త లోకానికి బాటలు వేయాలి. ప్రజలు సోషలిస్టు విధానాలు పాటించే ప్రభుత్వాలను సదా ఎన్నుకున్నపుడు, అరాచక ఉత్పత్తి, వనరుల నాశనం, వస్తువుల కొరత పోయినపుడు, ప్రజలకు స్వేచ్ఛగా కొనుగోలు శక్తి పెరిగినపుడు నిజమైన మార్పు వస్తుంది. ఆ సమాజంలో నియంత కోటీశ్వరులు, బ్రతుకు లేని, తమ అంతర్గత శక్తుల వికాసం లేని సామాన్యులు ఉండరు. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు సేవకునిగా, జవాబుదారిగా ఉండాలి. ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, సమస్యల పరిష్కారం కోరినప్పుడు నిజమైన సామాజిక సంభాషణా స్ఫూర్తిని చూపాలి. కవిత్వం, పాట ప్రజకు దగ్గర అయ్యే సంస్కృతి పెరుగుతోంది. కొత్త భాష కావాలంటే, మాండలికం గౌరవానికి, ప్రజలతో దగ్గర అవటం తప్ప కళాకారులకు వేరే మార్గం లేదు.
ప్రతి కవి నిజాయితీతో తన కళను స్వప్నించి, సృష్టించి, మిగతా సమాజంతో పంచుకోవాలి.
డా.జె.రవీంద్రనాథ్ విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు






కామెంట్లు (0)