కవితలో శిల్పానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సృజన కారుని వ్యక్తిత్వానికి కూడా అంతే ప్రాధాన్యత వుంటుంది. కాలం మార్పును కోరుకుంటుంది. కవిత్వం ఆధునికతను (Modernity in Poetry) కోరుకుంటుంది. ఆధునికతలో భిన్న వస్తువులతో పాటూ విభిన్న ఆలోచనలను అప్పటి సమయానికి తగిన చర్యలు రచనలో చోటుచేసుకుంటాయి.
కవిలో విభిన్నతను ఎలా గుర్తించాలంటే రచనలో అతని దృక్పథం పరిశోధించాలి. ఇలా తత్కాలాన్ని విభిన్న వస్తువుగా నిర్ధారణ చేసుకొని వ్యక్తిత్వం నుంచి విలక్షణ సృజన చేయడం కొద్దిమంది సాహితీకారులకే చెల్లుతుంది. ఆ వరుసలో ముందు నిలిచే విలక్షణ కవి, కవిత్వాన్ని ఊరూరా పంచి, పెంచి పోషించిన ఆధునిక విమర్శకులు కవి యాకూబ్.
Genuine poetry can communicate before it is understood.(T.S.Eliot)
నిజమైన కవిత్వం అర్థం కాకముందే మనస్సును తాకగలదు, సంభాషించగలదు. ఇదే తీరు కవి యాకూబ్ వెలువరించిన ‘మనుషుల్రా మనుషులు!’ కవితా సంపుటి. ఆయన దృష్టిలో కవిత్వం అంటే ఉచ్వాస నిశ్వాస. ఈ ఒక్క వాక్యం కవిత్వ ప్రవేశికలో ఆయనకున్న వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుంది.
కవి యాకూబ్‌కు వ్యక్తిత్వంతో పాటు వ్యాప్తి గుణం కూడా అధికంగా ఉంటుంది.
కవి సంగమం పేరున సృజనను, సృజన శక్తులను వెలికి తీసే పోయెట్రీ గ్యారేజ్ అని ఆధునికులు పిలుచుకునేలా పేరు తెచ్చుకున్నారు. ఈ సంపుటిలో ‘అమరిక’ అనే చిన్న కవితను పరిశోధిస్తే ఆయన వ్యాప్తి గుణం ప్రస్ఫుటమవుతుంది.
‘‘కొన్ని పూలరేకుల్ని/ అరచేతి మధ్యలో పేర్చాను/ కొన్ని ఆకుల్ని వాటి చుట్టూ అమర్చాను/ ఇప్పుడు అరచేయి/ పూపరిమళపు కొమ్మ’’
ఇది కేవలం ఐదు పాదాల కవిత కాదు. మానవత్వం మాట్లాడడమంటే ఇదే. మనిషి వ్యక్తిత్వం ఎక్కడినుండి ఎక్కడికి పయనిస్తుంది? దాని వ్యాప్తి గుణం ఎలా ముందుకు జరుగుతుంది? చేసే పనులా? కలిసే వ్యక్తులనా? నడిచే కాలాన్నా? ఇలా చోటు దొరకని స్థితికి కూడా తను కేరాఫ్ కావాలనుకున్నాడో! ఏమో? కానీ పూల పరిమళంలా ప్రతీకల స్వప్నం మాట్లాడాలనేదే కవి యాకూబ్ కవిత్వ ఉద్దేశం. అదే అతని వ్యక్తిత్వ వ్యాప్తి గుణం కూడాను.
మనుషుల్రా మనుషులు! శీర్షిక డిక్షన్‌ను చూస్తే కవి తన భావాన్ని పాఠకుని గుండెల్లోకి నేరుగా తీసుకెళ్లడానికి వాడిన పదాల శిల్పమే (Wordcraft)డిక్షన్. ఈ శీర్షికను పర్యాయపదంగా కాకుండా చూసినప్పుడు రెండు అర్థాలు గోచరిస్తాయి. 1.గౌరవప్రదమైన మనుషులు, 2.వీళ్లు మనుషులేనా? అనే వాచ్యార్థం పాఠకులను ఆలోచింపచేస్తాయి.
ఈ భావాల లోతును తూకం వేయడానికి మొత్తం సంపుటిని అంచనా వేయాలి.
లోపలి శబ్దానికి రూపం వెతికే పనిలో కవి యాకూబ్ లోకంతో సంభాషిస్తున్నట్లు ఈ సంపుటిలో కొన్ని కవితల్లో కనిపిస్తాడు.
‘‘ఏమీ పట్టని లోపలి ఉదాసీన నిశ్శబ్దం../ వింత నిశ్శబ్దం వికృత మృత్యు నిశ్శబ్దం/ పగిలిపోతున్న మనిషి పక్కన/ కదలక మెదలక కూర్చున్న/ కుక్క పిల్లలాంటి నిశ్శబ్దం’’ (నిశ్శబ్దం)
ఈ నిశ్శబ్ద సంభాషణలో భాషణం ఉండదు. పాఠకుడే గ్రహించాలి. ఒంటరితనపు జాడలో చిక్కిన నీటి చుక్క లాంటి మనిషితనం అప్పుడప్పుడు దేనికో భయపడుతుంది. భయం నుండి నిర్భయం పురుడోసుకున్నట్లు నిశ్శబ్దం నుండి శబ్దం పుట్టుకొస్తుందంటూ.. ఈ నిశ్శబ్దపు లోయలోంచి బయటకి లాగండి ఎవరైనా అంటూ తాత్విక సంభాషణ చేస్తాడు.
‘ఎలాగోలా..’ కవితలో ‘‘ఇంకెన్నాళ్లు... ఇలా రాయిలా మారి/ అన్నీ తెలిసి, అన్నీ తెలవనట్లు/ ఆల్ ఈజ్ వెల్లా/ ఇలానే ఎంతసేపు జీవించను’’ (ఎలాగోలా..)
ఇందులో కూడా జీవితం నటన. పరీక్షలు పెట్టి రంగులు విప్పేదాక వెంటాడుతది. భయపెట్టుతది భయపడినంతసేపు భయమే! అనే తాత్విక సందేహాల సమాధానం కోసం కవి తనకు తానే తాత్విక భాషణంలో వెతుకులాట ఆడడం మనకు కనిపిస్తుంది. నీడలు వీడిపోయే కాలం అనే కవితలో ఇలాంటి భాషణమే చేస్తాడు.
విశ్వాసం నమ్మకం ఈ రెండుపదాల పెదాలను కలిపి, చీకటి తర్వాత వెలుగు అనేదారికి నెలవుగా మారి కవితత్వ బోధన చేసినట్లు సాగిన కవితలో నమ్మకం కావాలి అంటాడు.
‘‘అడుగుల్లో అలసట ఆవరించిన నమ్మకం/ ఆలోచనలు ఒట్టిపోకుండా/ సతతం పరవళ్ళు తొక్కే నమ్మకం/ ఉదాసీన నిర్లిప్త నిరాసక్త గాలులు సోకని/రోజుల్ని ప్రాణవంతంగా ప్రవహింపజేసే నమ్మకం’’ (నమ్మకం కావాలి)’
ఈ కవిత ముగింపులో పొద్దుపొడుపు లాంటి చిరునవ్వు అనే సంకేతార్థం ఒక విశ్వాసంతో కూడిన క్రతువులా బతుకు మార్గంపై నమ్మకం ఉండాలంటాడు. ఇందులోని తత్వబోధన తనలోని బోధనానుభవం నుంచి వచ్చిందనుకోవచ్చును.
‘జీవితం బతకడం కాదు రోజుల్ని దొర్లించడం’ గుఫ్తగూ అనే కవిత నుండి తీసుకున్న వాక్యంలో సంప్రదాయ సామెతలు విలువలను నేటి మానవత్వం ఎప్పుడో మరిచాయని ఈ సాంకేతిక యుగంలో మనిషిని మనిషి కనుక్కొని సెర్చ్ బటన్ కనిపెడితే బాగుండని లోకం పోకడపై ఆవేదన వ్యక్తం చేస్తాడు.
‘అల్లాడి అల్లాడి...’ అనే కవితలో ‘రేపొకటుందని’ ఈ చిన్న పదం యాకూబ్ మైక్రోస్కోప్‌తో చూపెట్టిన తీరు అద్భుతం. నేటి అసంతృప్తికి ఒక ఊరట మార్గం ఇచ్చాడు. ఆశకు నిరాశ చోటు కల్పించడం లేదట. సముద్రతీరం రేపటి ఉషోదయాన్ని కలగన్నట్లు, ముంచుకొచ్చే అలల తాకిడిని ఆపేయగల ఆత్మవిశ్వాసం మనిషికి ఉండాలనీ, ఓర్పు గొప్పతనంపై హితబోధ చేస్తాడు.
ఇక్కడ కవి యాకూబ్ జీవితమే ఒక నిదర్శన సూత్రంగా విమర్శకులకు చిక్కుతాడు.
యాకూబ్ కవిత్వ భాషలో గాఢత కనిపించదు కానీ ఎంచుకున్న వస్తువులో భావాన్ని సూది మొన తాకినట్టు కలుక్కుమనిపించే హృదయ స్పర్శ పాఠకులను చాలాసేపు ఆ కవిత వైపు పరిభ్రమించేలా చేస్తుంది. ఇది ఆయన రచనా శైలిలో స్థిరమైన పోకడ. అలిశెట్టి ప్రభాకర్ వలె మినీ కవితల తీరు ఈ సంపుటిలో అక్కడక్కడ చాలానే కనిపిస్తాయి. కొన్ని మనల్ని అక్కడే కట్టిపడేస్తాయి.
‘‘మాటిమాటికి బయటి గేటు వైపుకు చూస్తుంటాను/ చిన్న చప్పుడుకు దిగ్గున లేస్తాను/ ఇలా ఎందుకని ప్రశ్నించుకుంటాను/ బహుశా ఈ ఎదురుచూపులు/ ఈ తీరు లోపలి ఖాళీకి సంకేతాలు కదూ!’’(ఖాళీ)
ఇష్టమైన పదార్థమో, వస్తువో, వ్యక్తో ఏదైనా కావచ్చు. అది అందుకోలేని, పొందలేని, ప్రస్తుతం దగ్గర లేని స్థితిని చెప్పడానికి దానిలో దాగిన పూడ్చలేని అనుభూతిని, భావ శిల్పంలో ఆరాటపడే తీరును కవి అంతా ఖాళీ అనే చమత్కారంతో చెప్పడం, ఆ ఖాళీని ఇప్పటి పరిస్థితుల్లో కవిత్వంలో వెతుక్కునే పని చేశాడనే బహిరంగ సత్యాన్ని పాఠకుడు గ్రహించాలి. ఇలాంటి కొనసాగింపుగా ‘ఎరుకలో తనను తాను కోల్పోవడం గురించి, దిశ అనే కవితలో చీకటిని ప్రతీకగా తీసుకొని ప్రయోగాలు చేశాడు.
‘‘వస్తువులు కాదు మనుషుల్రా మనుషులు/ కాపాడుకోవాల్సిన మనుషులు/ మనసులు మమతలు ఉన్న మనుషులు/ కరిగిపోయే కన్నీటి మనుషులు/ కదిలిపోయే చలనమున్న మనుషులు’’ (మనుషుల్రా మనుషులు)
ఎవరు మనుషులు? ఏ మనిషితనం గురించి ఈ ఆరాటం? ఒక్క మనిషి గురించి కాదు ఒక్క మనస్తత్వం గురించి కాదు. కవి యాకూబ్ ఇచ్చే మనుషుల నిర్వచనం ఆరు చరణాల్లో 60 ఉపశమన సూచికలుగా అందిస్తాడు. చుట్టూ ఉన్న మనుషుల తీరును తాత్విక చింతనతో లెక్కిస్తాడు. ఉన్నోళ్లను లేనోడ్ని ముడికట్టి సాగిన ప్రయాణంలో ఆకలికి హోటల్‌కు విరామ చిహ్నం లేని వింత మనుషుల గురించి, కులాలు మతాలు అని చంపుకుని బతుకే లోకుల గురించి, మనిషికి మానవత్వానికి మధ్య ఉన్న దూరం గురించి, మానవత్వంలో చిగురించని ఆత్మగౌరవం గురించి, అమాయక జనం గురించి ప్రేమ వాక్యాలు కురిపిస్తూనే, హ్యాండిల్ విత్ కేర్ అంటూ ఓ నిట్టూర్పు కూనిరాగం అందుకుంటాడు. ఇక్కడ మనుషుల రకాల గురించి చర్చించలేదు. వారు బతుకుతున్న తీరును వర్గీకరణ చేసి తనకు తెలియకుండానే తనోవర్గం వైపు గొంతుకను వినిపిస్తాడు.
‘మనిషి’ అనే పదం విస్తృతార్థంలో వాడబడింది. ఎన్నెన్ని కవితలు ఉదహరించినా దేని ప్రత్యేకత దానిదే అన్నట్లు సాగింది. ‘తాత్పర్యం’ అనే కవిత ఇది అక్షరాల కూర్పు మాత్రమే కాదు. దాని వెనక నిత్యజీవిత సంఘర్షణ దాగి ఉందనే చేదు నిజాన్ని చెప్పే ప్రయత్నంలో, మనిషిని ప్రతిపదార్థ తాత్పర్యం చేసి గురువుగా కవి ఉద్భోధన చేస్తాడు.
ఇద్దరు కార్మికుల బలహీనమైన నిట్టూర్పును బలవంతం చేస్తూ ‘చెత్త’ అనే కవిత మనుషుల్రా మనుషులు కవితకు కొనసాగింపు కవిత్వంగా కవి నేర్పుతో మానవ హృదయం చెత్తబుట్ట. ఈ డస్ట్ బిన్ కల్చర్‌ను దూరం చేసుకోవాలని మనుషులకు మనసై హెచ్చరిస్తాడు.
ఈ సంపుటిలో కవి యాకూబ్ అస్తిత్వ చింతన కూడా కనిపిస్తుంది. తను పుట్టి పెరిగిన రొట్టెమాకురేవు, అమ్మ అక్కడే ఉంది, రైలు కట్ట, తునికొర్రె, బుగ్గవాగు వంటి కవితల్లో తానొక ప్రవాహ దిక్సూచిగా సాగిన జీవనశైలి అంతా ఈ కవితా సంపుటి నిండుగా ప్రవహిస్తుంది. ‘నేనే?’ అనే స్టేజీలో మనం ఆగితే...
‘‘ఇప్పుడీ వాగును చూడండి/ నేను కనిపిస్తాను/ నన్ను ఈ నగరంలో వెతకండి/ వాగులా ప్రవహిస్తూ మీ మధ్య నుంచే/ అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తాను’’
ఇక్కడ నేను అనేది శ్రీశ్రీ నేను సైతం... అనే వాక్య స్ఫురణ వెంటనే మెరుపులా కళ్ళను జిగేలుమనిపిస్తుంది. అక్కడ శ్రీశ్రీ నేను అనే పదం చైతన్య పద సూక్తి. ఇక్కడ యాకూబ్ కూడా తెలియకుండానే శ్రీశ్రీ తోవలో బాటసారిగా కనిపిస్తాడు. ఈ కవితలో వాగు అనే ప్రతీక కదలికకు తొలిమెట్టు. కవి పుట్టి పెరిగిన వాతావరణ పీడనంను శాస్త్రవేత్త టారిసెల్లి భారమితిలో లెక్కించడం లేదు. తాను ఎక్కడున్నా తన చుట్టూరా మనము అనే బంధాన్ని ఎత్తుకోవడమే ఆయనకు ఊరు నేర్పిన సిద్ధాంతం అనీ కవి సంగమం స్ఫూర్తిని కొనసాగిస్తాడు. ఆయనకు పల్లె, నగరం ఊహాతీత శక్తులు.వీటి నడుమ కేవలం కవి ఆత్మ పరిగెత్తడం ఒక భ్రమ. అందుకే ఉన్న చోటునే గతం తాలూకు చిరునామాను రాసి పెట్టుకోవడంలో తాత్విక శిల్పిగా కవి యాకూబ్ పాఠకులకు దర్శనం ఇస్తాడు.
గన్నోజు ప్రసాద్ 9491617161






కామెంట్లు (0)