Magazines

మా గొంతుకకు మీరు భయపడుతున్నారు

1 గంట క్రితం

avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

మా నోళ్లలో బూతులు కుక్కి,

మా చేతుల్లో జెండాలు పెట్టి,

మా మెదళ్లకు మతపు మత్తు పూసి

మీరు మాత్రం అధికారపు అద్దాల ముందు

నాగరికతకు నగ్నంగా నిలబడుతున్నారు.

మాది మీ తరం కాదు

మేమూ Gen Z

మీరు రాసిన చరిత్రను బట్టీయం వేయడానికి కాదు,

మీ చరిత్ర పుస్తకాల మధ్య

ఊపిరాడక సమాధి అయిన మనుషుల్ని

మళ్లీ వెలికితీయడానికి వచ్చాం.

మా చేతిలో ఫోన్ కనిపిస్తోంది మీకు

అందులో పేరుకుపోయిన నిరుద్యోగం కనిపించదా?

మా కళ్లలో కోపం కనిపిస్తోంది

మా భవిష్యత్తు గొంతు నొక్కుతున్న

మీ విధానాల వేళ్లు కనిపించవా?

మా ఆకలికి మతం అడుగుతారు,

మా కన్నీటికి కులం వెతుకుతారు,

మా సోదరికి జరిగిన అన్యాయంలోనూ

న్యాయం చూడరు

ఆమె పేరులోని మతాన్ని తూకం వేస్తారు.

ఏమిటి మీ ప్రజాస్వామ్యం?

ఓటు వేసేవరకు పౌరుడు,

ప్రశ్నించగానే దేశద్రోహి!

మీరు కత్తులకు పదును పెట్టండి,

మేం ప్రశ్నలకు పదును పెడతాం.

మీరు వీధుల్లో విద్వేషాన్ని ఊరేగించండి,

మేం అదే వీధుల్లో

మనిషి పక్కన మనిషి నిలబడే

చిన్నచిన్న చోట్లను నిర్మిస్తాం.

మీకు దేశమంటే

మీ బొమ్మ ముద్రించిన జెండా,

మీ గొంతు ప్రతిధ్వనించే మైకు,

మీ నీడకే సలాం చేసే సింహాసనం.

మాకు దేశమంటే

పొయ్యి మీద ఖాళీ గిన్నెతో

తండ్రి తిరిగొచ్చే దారి చూస్తున్న బిడ్డ

చదువు పూర్తయినా ఉద్యోగం రాక

సర్టిఫికెట్లలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్న యువకుడు

న్యాయం కోసం తలుపు తట్టి

సమాధానంగా శవాన్ని అందుకున్న కుటుంబం.

చెప్పండి మిత్రోం !?

మీ ప్రసంగాల్లో దేశం ఇంత గొప్పగా ఉంటే,

దేశపు మనుషులు

ఇంత చిన్నగా ఎందుకు బతుకుతున్నారు?

దేశాన్ని ప్రేమించమంటారు

దేశాన్ని పాలించేవారిని ప్రేమించడమే

దేశభక్తి అయితే,

అన్యాయాన్ని ప్రశ్నించడాన్ని

ఏ దేశభక్తితో కొలవాలి?

మీకు మా మౌనం కావాలి.

మాకు మా గొంతు కావాలి.

మీకు మా తలలు వంగాలి.

మాకు మా భవిష్యత్తు నిలబడాలి.

ఒక్కటి గుర్తుంచుకోండి.

మా ప్రశ్నలకు దేశద్రోహం అని ముద్ర వేయగలరు,

మా గొంతుల చుట్టూ నిశ్శబ్దపు కంచెలు కట్టగలరు

కానీ చరిత్ర తలుపు తెరిచినప్పుడు

అది మీ అధికారపు ఎత్తును కొలవదు

మీ ముందు తలవంచని మనుషుల్ని చూసి

మీరు ఎంతగా భయపడ్డారో

మీ ముఖాల మీదే రాసి వెళ్తుంది!

- ఇబ్రహీం నిర్గుణ్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్