– తండ్రికి తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న కుమారుడు
– తిరిగి ఇవ్వాలని వృద్ధ దంపతుల ఆవేదన
నవతెలంగాణ-చిన్నకోడూరు
పెన్షన్ పేరు చెప్పి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లిన కొడుకు.. ఆ వృద్ధ తల్లిదండ్రులకు తెలియకుండా వారి పేరుపై ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తమను కొడుకు పట్టించుకోడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భూమిని మాకు ఇప్పించాలంటూ తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని గోనెపల్లి గ్రామానికి చెందిన మెర్గు సిద్ధయ్య- గాలవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు మహేందర్, నగేష్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సిద్ధయ్యకు వారసత్వంగా 7 ఎకరాలు భూమి వచ్చింది. మూడున్నర ఎకరాలు రికార్డులో ఉండగా.. మరో మూడున్నర ఎకరాలు రికార్డులో లేదు. చిన్నకుమారుడు నగేష్ పేరున ఎకరా 11 గుంటలు, సిద్ధయ్య పేరున 2 ఎకరాల 5 గుంటలు రికార్డులో ఉన్నది. అయితే, జనవరి 24న చిన్న కుమారుడు నగేష్.. తండ్రికి రూ.4 వేల పింఛన్ ఇప్పిస్తానని తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ అతనితో సంతకాలు చేయించుకున్నాడు. పింఛన్ కోసమే అనుకున్న ఆ తండ్రి సంతకాలు పెట్టాడు. కానీ, తండ్రి పేరున ఉన్న భూమిని చిన్న కుమారుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే, నెల రోజుల తర్వాత ఎరువుల కోసం వెళ్లగా.. భూమి తన కొడుకు పేరున రిజిస్ట్రేషన్ అయిన విషయం సిద్ధయ్యకు తెలిసింది. అదే రోజు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో తనను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న నగేష్‌పై ఫిర్యాదు చేశాడు. నగేష్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని.. పెద్దపల్లిలో నివాసముంటున్నాడు. భూమి తీసుకున్న చిన్న కొడుకు పట్టించుకోక.. భూమి ఆయన తీసుకున్నాడని పెద్ద కొడుకూ చూడకపోవడంతో కొడుకులు ఉన్నా.. దిక్కులేని వారిమయ్యామంటూ ఆ వృద్ధులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కలెక్టర్ స్పందించి తమ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేసి ఆదుకోవాలని కోరారు.
పెన్షన్ ఇప్పిస్తానని..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



