Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండిమాండ్లపై సుదీర్ఘ చర్చలు.. పద్దుల ఆమోదం

డిమాండ్లపై సుదీర్ఘ చర్చలు.. పద్దుల ఆమోదం

- Advertisement -

చివర్లో బీఆర్‌ఎస్‌ వాకౌట్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

శాసనసభ బుధవారం కీలకమైన డిమాండ్లపై సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదం తెలియజేసింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఆయా డిమాండ్లపై చర్చలో ఆయా పార్టీల ఎమ్మెల్యేల చర్చ అనంతరం మంత్రులు సమాధానం చెప్పారు. తర్వాత స్పీకర్‌ పద్దులకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. వాణిజ్యపన్నులు, వ్యవసాయ,మార్కెటింగ్‌, సహాకార, చేనేత, జౌళి శాఖ, మద్యనిషేద, అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్దులు, ట్రాన్స్‌జెండర్‌, సాంఘీక సంక్షేమం, గిరిజన సక్షేమం, పశుసంవర్థక శాఖ, పారి పరిశ్రమాభివృద్ధి శాఖ, మత్స్యపరిశ్రమ శాఖ, క్రీడలు, యువజన సర్వీసులు, మైనార్టీ వర్గాల సంక్షేమానికి సంబంధించి ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పరిస్థితులు, పరిష్కార మార్గాలపై చర్చ చేపట్టారు. వీటికి మంత్రులు సమాధానాలు చెప్పారు. ప్రభుత్వం ఆయా పద్దుల కింద ప్రతిపాదించిన నిధులు, చేపట్టబోయే కార్యకలాపాలను వివరించారు. కాగా ప్రభుత్వం ఎదురుదాడి చేయడం మినహా తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సక్రమంగా ఇవ్వలేదంటూ, చిత్తశుద్ధి ప్రదర్శించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేసింది. ఆయా పద్దులపై చర్చల్లో ఎమ్మెల్యేలు కొత్తప్రభాకర్‌రెడ్డి, కౌసర్‌ మోహియిద్దీన్‌ అనిల్‌జాదవ్‌,అడ్లూరీ లక్ష్మన్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, సూర్యనారాయణ, పాయం వెంకటేశ్వర్లు, ఎడ్మ బొజ్జు పాల్గొన్నారు. వీరి ప్రశ్నలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, అడ్లూరీ లక్ష్మన్‌, వాకిటి శ్రీహరి, సీతక్క, మహ్మద్‌ అజారుద్ధీన్‌ సమాధానం చెప్పారు. ఎలాంటి ఖర్చు తగ్గింపు లేకుండా పద్దులను ఆమోదించా లని మంత్రులు సభ్యులను కోరారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌ అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఆయా ప్రభుత్వ శాఖల పద్దులను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు.

లోటు ఎలా పూడుస్తారు: హరీష్‌
డిమాండ్లపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ హరీష్‌రావు మాట్లాడుతూ వాణిజ్యపన్నుల శాఖలో లోటు కనిపిస్తున్నదనీ, దీన్ని ఎలా పూడుస్తారని ప్రశ్నించారు. ఎక్సైజ్‌ శాఖ అన్నీ మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు వస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కార్పొరేషన్ల ను ఏర్పాటు చేసిందన్నారు. కానీ నయాపైసా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. అన్నీ తరగతుల ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభు త్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. అనంతరం చర్చకు సమాధానం ఇస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధాన మిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో వేసిన పన్నులు ద్వారా ఎక్సైజ్‌ శాఖలో లోటును పూడుస్తామని చెప్పారు. అలాగే మద్యం బ్రాండ్ల అమ్మకాల ద్వారా మూడు నుంచి నాలుగు శాతం మేర మాత్రమే ఆదాయం పెరుగుతుందన్నారు. కేవలం మద్యం సేవించడం ద్వారానే పూర్తి ఆదాయం రాదని గుర్తుచేశారు. బెల్టులు షాపులు మేము తెచ్చినవి కాదన్నారు. ఇదిలా వుండగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు స్పందిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లల్లో రూ.లక్షల కోట్లను రైతుల జేబుల్లోవేసిన ఘనత మాకే దక్కుతుంద న్నారు. రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. బీజేపీ విధానాలతో రైతులకు కష్టం,నష్టం కలుగుతున్నద న్నారు. కాగా ఉదయం 10 గంటలకు ప్రారంభైన సభ రాత్రి 10:20 గంటలకు ముగిసింది. మైనార్టీ సంక్షేమ శాఖ చర్చకు మంత్రి అజారుద్దీన్‌ సమాధాన మిస్తూ ‘ ఈరోజు అసెంబ్లీలో తొలి రోజు..సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాను.ఇంకా సలహాలు, సూచనలు ఆహ్వానిస్తాను..తన శాఖకు ఆర్థిక శాఖ మంత్రి నిధులు మంజూరు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -