ఈనెల 20 నుంచి కొత్త నిబంధనలు అమలు!
ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు రిఫ్లెక్టివ్ టేపుల ధ్రువీకరణ తప్పనిసరి
అయిదు కంపెనీలకు మాత్రమే అనుమతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాలను తగ్గించడానికి, రవాణా వాహనాలు స్పష్టంగా కనిపించేలా చేయడానికి ‘క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపుల’ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు ఈనెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కేంద్ర మోటార్ వాహనాల నియమాలు-1989లోని రూల్ 104 నుంచి 104(ఈ) ప్రకారం రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి.
అయితే దీనిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు క్యూఆర్ ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను(ఎంఐఎస్) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేవలం ప్రభుత్వం అనుమతించిన సంస్థల (ఓఈఎం) డీలర్ల వద్ద మాత్రమే ఈ టేపులను అమర్చుకోవాల్సి ఉంటుంది. వాహనానికి అమర్చే టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నెంబర్ గల క్యూఆర్ కోడ్ ఉంటుంది. టేపులు వేసిన తర్వాత వాహన యజమానికి ‘అఫిక్సేషన్ సర్టిఫికేట్’ జారీ చేస్తారు. ఇందులో వాహనం ఫోటోలు, వారంటీ (కనీసం 2 ఏండ్లు) వివరాలు ఉంటాయి. అధికారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వాహన సమాచారం మొత్తం తెలుస్తుంది.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు లింక్
ఈ నిబంధనను రవాణా శాఖ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌తో అనుసంధానించింది. ఈనెల 20 తర్వాత క్యూఆర్ కోడ్ ధ్రువీకరణ లేకుండా వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయరని అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా అమలులోకి వచ్చినందున సర్క్యులర్ జారీ అయిన తేదీ నుంచి 3 నెలల వరకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో తప్పనిసరి అవుతుంది.
అనుమతి పొందిన 5 కంపెనీలు ఇవే..
నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం 5 సంస్థలను(ఓఈఎంలు) మాత్రమే ఎంపానెల్ చేసింది. అందులో ఓరాఫోల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, 3ఎం ఇండియా లిమిటెడ్, గ్లోడియన్ రిఫ్లెక్టివ్ ప్రయివేట్ లిమిటెడ్ (రిఫ్లోమాక్స్), డామింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, అవేరి డెన్నిసన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌లకు మాత్రమే వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతి ఉంది.
ధరల నియంత్రణ.. యజమానులకు ఊరట!
వాహన యజమానుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయకుండా ప్రభుత్వం గరిష్ట ధరలను(ఎంఆర్‌పీ) నిర్ణయించింది. అఫిక్సేషన్, సర్టిఫికేట్ చార్జీలతో కలిపి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 20వీవీ టేపు (మీటర్‌కు) రూ. 79.80- రూ.85, 50వీవీ టేపు (మీటర్‌కు) రూ. 145 – రూ.151.80, జ3 (జతకు) రూ. 2500 – రూ. 2650, జ4 (జతకు) రూ. 2800 – రూ. 2900, రిఫ్లెక్టర్లు రూ. 35 (40వీవీ)/ రూ. 60 (80వీవీ). నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే సదరు డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ రద్దు చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది. వాహన యజమానులు అధీకృత డీలర్ల వద్దే టేపులు వేయించుకుని, ప్రమాదాల నివారణలో సహకరించాలని రవాణా శాఖ కోరింది.



