ఉమ్మడి ఆదిలాబాద్‌లో కుంభవృష్టి
ప్రమాదకర స్థాయికి ప్రాజెక్టులు
క్రమంగా పెరుగుతున్న గోదావరి
ఆయకట్టుల్లో నీట మునిగిన పంట పొలాలు
ఏజెన్సీలో అప్రమత్తంగా ఉండాలి : అధికారులకు కలెక్టర్ల ఆదేశాలు
కడెం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత
పొంగిపొర్లిన వాగులు, వంకలు
నీట మునిగిన పలు కాలనీలు
సహాయక చర్యల్లో కలెక్టర్లు, ఎస్పీలు
రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వానలతో వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. మరోపక్క రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునగటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నష్టాలపై అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు స్థానికంగానూ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పెద్దఎత్తున వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిలాల్లో శనివారం నాలుగ్గంటలపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. కాలనీలు నీట మునిగాయి. కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రాజెక్టులు దాదాపు నిండి ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. కొన్ని చోట్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఖమ్మంలో గోదావరి క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తేశారు. ఆయకట్టు పరిధిలో పంట పొలాలు వరదతో నిండిపోయాయి.
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు- సిద్ధిక్‌నగర్ గ్రామాలకు మధ్య ఉన్న రోడ్డుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగు ఉధృతి పెరిగింది. ఖమ్మం జిల్లాతోపాటు ఎగువన ఉన్న మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వరద నీరు వచ్చి వాగులో చేరడంతో శనివారం సాయంత్రం నాటికి 11 అడుగులకు చేరింది. కామేపల్లి మండలం ముచ్చర్ల ఉన్నత పాఠశాలలో వర్షపు నీరు చేరడంతో చెరువులా మారింది. ఆ వర్షపు నీటిలోనే శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బోనకల్ మండలం జానకిపురంలోని ముజఫర్‌నగర్ సమీపంలో భారీ వృక్షం వైరా -జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై కూలింది. దీంతో మూడు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ పొదిలి వెంకన్న తన సిబ్బం దితో సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ ద్వారా చెట్టు కొమ్మలను తొలగించారు. కామేపల్లి మండలం కొత్త లింగాల నుంచి డోర్నకల్ వెళ్లే రహదారికి మార్గ మధ్యలో బుగ్గు వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ముందస్తుగా పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టి కాపాలా కాస్తున్నారు.
20 అడుగులకు వైరా రిజర్వాయర్
వైరా రిజర్వాయర్ శనివారం ఉదయానికి 20 అడుగులకు చేరుకొని అలుగు పడుతోంది. నీటి మట్టం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతం రాజీవ్ కాలనీలోని ఆరు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉంచారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ అలుగుపడుతోంది.
పెరుగుతున్న గోదావరి
నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పడుతున్న వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ శనివారం రాత్రికి 32 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి మరో రెండు రోజులపాటు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరి స్నానాల ఘాట్ ముంపునకు గురవడంతో స్నానాలకు సందర్శకులను బంద్ చేశారు. కరకట్ట పరిసర ప్రాంతాలకు రావద్దని హెచ్చ రికలు జారీచేశారు. మరోపక్క దండకారణ్యంలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో తాలి పేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వస్తోంది. శబరి, గోదావరి సంగమ స్థానమైన ఏపీలోని విఆర్ పురం, కూనవరం మండలాల్లోనూ గోదావరి అంతకంతకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
భారీ వర్షాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరో 48 గంటలపాటు ఏజెన్సీ వ్యాప్తంగా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ప్రజలను వాగులు, కాలువలు దాటకుండా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. గర్భిణులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్యుల పర్యవేక్షణకు తరలించాలని సూచించారు. పశువుల కాపరులు 48 గంటల పాటు పశువులను ఇంటి వద్దె మేపుకోవాలని, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08743 232344, వాట్సాప్‌నకు 93479 10737 నెంబర్లను సంప్రదించాలన్నారు. అదేవిధంగా పీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 79952 68352 నెంబర్లు 24 గంటలపాటు పనిచేస్తాయని చెప్పారు.
జూరాల ఆరు గేట్లు ఎత్తివేత
మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతు న్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 95వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జూరాల ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఐదు యూనిట్లలో ఉత్పత్తి ద్వారా 37,419 క్యూసెకుల నీటిని బయటకు పంపుతు న్నారు. జూరాల ప్రాజెక్టులో ఆరు గేట్లు ఎత్తి 40,836 క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు.
జంట జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద
హైదరాబాద్‌లోని జంట జలాశయాలతోపాటు హుస్సేన్ సాగర్(ట్యాంక్‌బండ్)లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1786.45 అడుగులకు చేరింది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులుకాగా, ప్రస్తుతం 1761.65 అడుగుల వరకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 1400 క్యుసెక్కులుండటంతో 1927 క్యుసెక్కుల నీటిని రెండు గేట్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయినీటి మట్టం 514.75అడుగులు కాగా, ప్రస్తుతం 513.58కు నీరు చేరింది. వాటర్‌బోర్డు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగూర్, పోచారం, ఘనపూర్ పాజెక్టుల్లో జలకళ సంతరించుకొని డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. సింగూర్ ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఘనపూర్ ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదలను మరింత పెంచనున్నారని, దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరగడంతో అవుట్ ఫ్లో కూడా రెట్టింపు స్థాయిలో కొనసాగుతోంది. అందోల్ మండలంలో పలు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. అన్నాసాగర్ పెద్ద చెరువు, కొండారెడ్డిపల్లి తండా, అక్సాన్పల్లి చెరువు అలుగు పారుతున్నాయి. పుల్కల్ మండలంలోని సింగూర్ కెనాల్ పగలడంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇసోజిపేట, లక్ష్మీ సాగర్, మిన్పూర్ గ్రామాల్లో సింగూర్ ఎడమ కాలువకు ఉన్న పిల్ల కాల్వ తెగిపోవడంతో వరద నీరు పంట పొలా లను ముంచివేసింది. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం కాలువ మరమ్మతులు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో జిన్నారంలో అక్కమ్మ చెరువు నిండుకుండలా మారింది. మంజీరా నదికి భారీ వరద నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది.
పొంగిపొర్లుతున్న పోచారం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. శుక్రవారం నాటికి ప్రాజెక్టులో 21 అడుగులకు చేరడంతో కెనాల్ ద్వారా 100 క్యూసెక్కులు పంట పొలాలకు వదిలారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 31,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ తెలిపారు.
ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద..
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ వద్ద గల శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. క్రమంగా వరద ప్రవాహం చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1083 అడుగులు, 53.62 టీఎంసీలకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టులో నుంచి 541 క్యూసెక్కుల నీరు వృథాగా ఆవిరి అవుతుండగా.. వానాకాలం పంటలకు కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతలకు 108 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ.. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల తాగునీరు సరఫరా చేస్తుండగా 4952 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి బయటికి వెళ్తోంది. రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం జలకళతో ఉట్టిపడుతోంది. గోదావరి నీటి ప్రవాహం పెరగడంతో బ్రిడ్జి వరకు నీరు చేరింది. కందకుర్తి గోదావరిలోని రాతి శివాలయం పూర్తిగా మునిగిపోయింది. శ్రీరాంసాగర్‌లోకీ నీటి ప్రవాహం కొనసాగుతోంది.
ఆదిలాబాద్‌లో భారీ వర్షం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షం ఉదయం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. నాలుగు గంటలపాటు భారీ వర్షం కురవడంతో జిల్లా అతలాకుతలమైంది. పలు కాలనీల్లో ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గుడిహత్నూర్ మండలంలోని సీతాగోందిలో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులను కాపాడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్, టైలర్స్ కాలనీ, భుక్తాపూర్, మణిపూర్, ఖానాపూర్, మహాలక్ష్మివాడ, జీఎస్‌ఎస్టేట్, దుర్గానగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వెంటనే స్పందించిన కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జైనథ్ మండలం తరోడ లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు పారడంతో రెండు లారీలు నీటిలో చిక్కుకున్నాయి. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తలమడుగు మండలం ఖోడద్ వాగు ఉప్పొంగడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి, తంతోలి, లోకారి, పప్పల్‌ధరి, మామిడిగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తంతోలి సమీపంలో గల వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. తాంసి మండలంలో అత్యధికంగా 17సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా జైనూర్, దహెగాం మండలాల్లో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 16సెం.మీ వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. సాయంత్రం 5 గంటలకు 10 గేట్లు అర మీటర్ పైకెత్తి 26వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదిలారు. 6 గంటలకు మరిన్ని గేట్లు ఎత్తి 54 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 7 గంటలు 80 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి మించి వరద చేరడంతో గేట్లు ఎత్తేశారు. ఆసిఫాబాద్ జిల్లా అడ ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగి సామర్థ్యానికి మించి చేరింది. దీంతో 19700 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
వానొచ్చే వరదొచ్చే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES