అప్రమత్తంగా ఉండాలి

Be alert– మతోన్మాదులకు అవకాశం ఇవ్వొద్దు
– యువత సన్మార్గంలో నడిచేలా అవగాహన కల్పించండి
– ఆదివాసీ చట్టాలను గౌరవించాలి : మంత్రి సీతక్క
– త్వరలో ఆదివాసీ, ముస్లింల మధ్య ఉమ్మడి సమావేశం : షబ్బీర్‌ అలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రతి విషయానికీ మతం రంగు పులిమి రాజకీయ లబ్ది పొందే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ (సీతక్క) సూచించారు. దుష్టశక్తులు పేట్రేగే అవకాశాలివ్వొద్దన్నారు. అన్ని మతాలు, సామాజిక తరగతులకు చెందిన పెద్దలు యువత సన్మార్గంలో నడిచేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆదివాసీ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. జైనూరు ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజల మధ్య ఐక్యత పెంచేందుకు త్వరలో ఆదివాసీలు, ముస్లిం పెద్దలతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. జైనూరులోని ఆదివాసీలు, మైనార్టీల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. రెండు రోజుల క్రితం ఉట్నూర్‌లో ఆదివాసీ సంఘాలతో ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మైనార్టీ పెద్దలతో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి సమావేశమయ్యారు. సమస్య మూలాలతో పాటు పరిష్కార మార్గాలను సూచించాలని కోరగా మైనార్టీ పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలకు మతం రంగు పూస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని వాపోయారు. అలాంటి శక్తులను కట్టడి చేసేలా బందోబస్తు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంతో కాలంగా సఖ్యతతో నివసిస్తున్న ముస్లిం, ఆదివాసీ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే మూకలపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..ఆదివాసీ, మైనార్టీ ప్రజల మధ్య విభేదాలు తలెత్తడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సమస్య మూలాల గుర్తించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలున్నందున వాటిని మైనార్టీలు గౌరవించాలని సూచించారు. కొంత మంది యువకులు చేస్తున్న చేష్టలను చూపి మైనార్టీల పట్ల వ్యతిరేక భావనను కలిగించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్న తీరును ఎండగట్టారు. ఇలాంటి విషయాలపై మైనార్టీ యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆదివాసీ చట్టాలను, మహిళలను గౌరవించేలా ప్రార్ధనా మందిరాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో పదేండ్లుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిరుద్యోగ సమస్యను అడ్డంపెట్టుకుని యువతను కొన్ని శక్తులు తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్న తీరును వివరించారు. వాటి పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఏదైనా సమస్య తలెత్తితే శాంతియుతంగా నిరసన తెలపాలి తప్ప చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు. స్థానిక ప్రజల మధ్య సఖ్యతతో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవు తుందన్నారు. షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. ఆదివాసీలు, ముస్లింల మధ్య నెలకొన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా ఇరుపక్షాల పెద్దలతో త్వరలో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో సీఎంతో ఇరు పక్షాలను సమావేశ పరుస్తా మన్నారు. మత రాజకీయాల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌ మాట్లాడుతూ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆదివాసీ ఏరియాభివృద్ధిలో, శాంతిని నెలకొల్పడంలో మైనార్టీ సోదరులు సహకరించాలని కోరారు.

Spread the love