ఈనెల 3న 4,421 మెగావాట్ల వినియోగం
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత
వినియోగంలోకి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు
ఒత్తిడి తట్టుకోలేక ట్రిప్పవుతున్న ఫీడర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరికి లోనవుతున్నారు. మార్చి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఫలితంగా విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగి.. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఒత్తిడితో ట్రిప్పవుతున్నాయి. అనధికారిక ‘కోత’లకు కారణమవుతున్నాయి. ఉదయం ఇంట్లోని కరెంట్ మోటార్లు, వాటర్ గీజర్లు, మిక్సీలు, ఎలక్ట్రిక్ స్టవ్‌లు అన్నీ ఒకే సమయంలో పని చేస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పైపైకి చేరుతోంది.
5 వేల మెగావాట్లకు చేరుకునే ఛాన్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం గతేడాది ఎండాకాలంతో పోల్చుకుంటే ఈసారి గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్టు డిస్కం అంచనా వేసింది. ప్రతి ఏడాదీ సగటున 15శాతం వృద్ధితో విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఇదే తరహాలో ఈసారి వేసవిలోనూ విద్యుత్ డిమాండ్ గతం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో నమోదవుతుందని అంచనా వేసింది. అనుకున్నట్టుగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. ఈ నెల 3న ఒక్క రోజే గరిష్ట విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇదే. గతేడాది మే 6న అత్యధికంగా 4,352 మెగావాట్ల రికార్డును ఈసారి మార్చిలోనే అధిగమించడం విశేషం.
కాగా గతేడాది ఫిబ్రవరిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,512 మెగావాట్ల వినియోగం నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 6న 3,509 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. 2025 ఏప్రిల్ 24న రికార్డు స్థాయిలో 4,190 మెగావాట్లు (89.54 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 5వేల మెగావాట్లకు చేరుకోనున్నట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈసారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ప్రధానంగా ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ భారీగా నమోదవుతుంది.
సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఇలా..
గ్రేటర్ పరిధిలోని మూడు జోన్లలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా వేసవి డిస్కం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే 80 శాతానికి మించి లోడును ఎదుర్కొంటున్న 11కేవీ, 33 కేవీ ఫీడర్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్‌స్టేషన్లు / ఫీడర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, ఆ మేరకు వాటి సామర్థ్యాన్ని పెంచారు. గ్రేటర్‌లోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధి, గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో కొత్తగా 3,357, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్)ను ఏర్పాటు చేశారు. 163 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో సబ్ స్టేషన్లలో అనూహ్యంగా పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 163 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్), కొత్తగా 11 కేవీ ఫీడర్లు 527, 33 కేవీ ఫీడర్లు 118 అందుబాటులోకి తీసుకొచ్చారు.
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా
గ్రేటర్ జిల్లాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాం. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, 33 కేవీ/11 కేవీ ఫీడర్లపై, సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్‌ను పర్యవేక్షించాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి అధికారులను, సిబ్బందిని ఆదేశించాం. ఈ సమ్మర్‌లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం. అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం. -జితేష్ వి పాటిల్, సీఎండీ, టీజీ-ఎస్పీడీసీఎల్



