కేంద్రానికి ఎంఏ బేబీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : దేశ సాయుధ దళాలకు వికలాంగ పెన్షన్‌పై పన్ను విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విజ్ఞప్తి చేశారు. ఈ పెన్షన్‌పై వందల సంవత్సరాలుగా అమల్లో ఉన్న పన్ను మినహాయింపును ఆర్ధిక బిల్లు 2026లోని ఆదాయపన్ను చట్టానికి ప్రాతిపాదించిన సవరణల ద్వారా కేంద్రం తొలగించడాన్ని బేబీ ఖండించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ ఖాతాలో బేబీ ఒక పోస్టు చేశారు. సాయుధ విభాగంలో చేరడం వలన శాశ్వత గాయాలు, వైకల్యం సంభవించే అవకాశం ఉన్నా దేశ సేవచేయడానికి ముందుకొచ్చిన సైనికుల వికలాంగ పరిహారంపై పన్ను విధించడం ద్వారా కొన్ని ఏండ్లు రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారి సేవను అపహాస్యం చేస్తున్నారని, వైకల్యం చెందిన సైనికులను సైన్యం నుంచి బలవంతంగా తొలగించే విధానాన్ని అమలు చేస్తున్నారని బేబీ విమర్శించారు.
ఈ విధమైన చర్య గౌరవంగా జీవించే హక్కును కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విర్ధుమని బేబీ తెలిపారు. ‘వ్యయాన్ని హేతుబద్దం చేయడం’, ‘దుర్వినియోగాన్ని నిరోధించడం’ అనే కారణం.. భారీ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే పన్ను మినహాయింపులను అందించే లెడ్జర్‌ను సమతుల్యం చేయడానికి వికలాంగులైన మాజీ సైనికులను పావులుగా చేస్తున్నారనే వాస్తవాన్ని కప్పిపుచ్చదని బేబి విమర్శించారు. అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశంలోనూ జాతీయవాదాన్ని ప్రదర్శించే బీజేపీ దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల ధైర్యాన్ని, త్యాగాన్ని శిక్షకు గురి చేస్తుందని బేబీ తెలిపారు. తక్షణమే ఈ పన్నును ఉపసంహరించుకోవాలని బేబి విజ్ఞప్తి చేశారు.



