– దిగొచ్చిన ‘తాజ్ బీడీ’ యాజమాన్యం
– సర్వీస్ డబ్బులు చెల్లింపు
– పీఎఫ్ డబ్బులు, బట్వాడాలు జమ చేసేందుకు హామీ
– హర్షం వ్యక్తంచేసిన బీడీ కార్మికులు
నవతెలంగాణ-డిచ్‌పల్లి
రెండు రోజుల నుంచి తాజ్ బీడీ కంపెనీ కార్మికులు చలిని సైతం లెక్కచేయకుండా కంపెనీ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి విజయం సాధించారు. దిగొచ్చిన యాజమాన్యం బీడీ కార్మికులకు చెల్లించాల్సిన సర్వీస్ డబ్బులను మంగళవారం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో కలిసి రెండ్రోజులపాటు ధర్నా చేపట్టామని తెలిపారు. మహిళలు ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా పోరాటబాట పట్టారన్నారు. ఆ పోరాట ఫలితంగా యాజమాన్యం దిగొచ్చి సర్వీస్ డబ్బులను జమ చేసిందని చెప్పారు. ఇది కార్మికుల విజయమని, నెల రోజుల పరిధిలో మూడేండ్ల పీఎఫ్ డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్ డబ్బులను, 14 క్వింటాళ్ల ఆకు, కార్మికులకు చెల్లించాల్సిన బట్వాడా చెల్లింపుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, నెల రోజుల పరిధిలో పీఎఫ్ డబ్బులు జమ చేయకుంటే పీఎఫ్ కార్యాలయం ఎదుట పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి.మోహన్, లలిత, లావణ్య, సునీత, సారిక, లత తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ పోరాట ఫలితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



