– ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు
– ఎంపీపీఎస్ హెచ్‌ఎం ప్రభుదాసు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ
నవతెలంగాణ-సత్తుపల్లి
పుట్టిన ఊరిలోని బడిలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ అదే పాఠశాలలో ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయమని సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం కిష్టారం ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొండా ప్రభుదాసు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభను అదే పాఠశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుదాసు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభలో ఎంఈఓ రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ…. సొంత గ్రామంలో పనిచేస్తూ పేద విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల మౌలిక వసతుల కల్పనకు ఆయన సొంత నిధులతో ఎంతో కృషి చేశారని సహచర ఉపాధ్యాయులు కొనియాడారు.
ప్రభుదాసు అంకితభావంతో అందించిన సేవలకుగానూ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానం పొందారని ఎంఈఓ రాజేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. ఈ విధమైన నిబద్ధత గల ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ సమయంలో అనారోగ్యానికి గురికావడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. విద్యాధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రభుదాసు-నాగరత్నం దంపతులను పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు అప్పారావు, కాంప్లెక్స్ హెచ్ఎం శైల కుమారి, కుటుంబ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుదాసు మాస్టారు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

