కస్టోడియల్ డెత్‌ను ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారు
ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూ, ఎన్‌సీపీసీఆర్‌కు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాజ్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అది కస్టోడియల్ డెత్ అని, రియాజ్ మరణించిన తరువాత డెడ్ బాడీలోకి బుల్లెట్లు దించి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని అన్నారు. ఈ విషయంలో పోలీసులు నిజాలు దాస్తున్నారనీ, అందువల్ల కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారంనాడిక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సీడబ్ల్యూ), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్)లకు లీగల్ యాక్టివిస్ట్ సయ్యద్ ఫిరాసత్ అలీ, సోషల్ యాక్టివిస్ట్‌లు ఖలీదా పర్వీన్, జలాదుద్దీన్, ఇతర ప్రజా సంఘాల నేతలతో కలిసి రియాజ్ తల్లి జరీనా బేగం, భార్య సనోబర్ నజ్జీన్‌లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రియాజ్ ఒక బైక్ సీజర్ అని, ప్రమోద్ హత్య తర్వాతే ఆయనపై మర్డర్ కేసు నమోదైందన్నారు. ఈ కేసులో ముందు నుంచి పోలీసులు నిజాలు దాచి పెట్టారని చెప్పారు. ప్రమోద్‌ను హత్య చేసినట్టు ఆరోపిస్తున్నారనీ, అందులోనూ వాస్తవాలు లేవన్నారు. తొలుత రియాజ్‌ను పట్టుకునేందుకు సీఐతో కలిసి ప్రమోద్ వచ్చాడని చెప్పిన పోలీసులు… తర్వాత కాలేజ్‌లో చదువుతున్న తన మేనల్లుడితో ప్రమోద్ వచ్చినట్టు తేలిందన్నారు. ఒక క్రిమినల్‌ను పట్టుకునేందుకు స్డూడెంట్‌తో కలిసి పోలీస్‌లు ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా… మెయిన్ రోడ్డుపై ప్రమోద్‌ను హత్య చేసినట్టు చెబుతోన్న పోలీసులు ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఎక్కడా చూపలేదన్నారు. అయితే తన కుటుంబ సభ్యుల్ని ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని తెలిసి… స్వయంగా రియాజ్ పోలీసులకు లొంగిపోయాడని చెప్పారు. ఆ తరువాత రియాజ్‌ను థర్డ్ డిగ్రీ పేరుతో చిత్ర హింసలు పెట్టి కస్టోడియల్ డెత్ చేశారన్నారు. ఈ డెత్‌ను కప్పిపుచ్చుకునేందుకు హాస్పిటల్‌కు తరలించారన్నారు. మెడ, ముక్కు భాగంలో ఎముకలు విరిగాయని, రెండు చేతులు కట్టేసి ఉన్న రియాజ్ ఏ విధంగా పోలీసుల గన్ లాక్కునే ప్రయత్నం చేస్తాడని ప్రశ్నించారు. ఇదంతా పోలీసులు అల్లిన కట్టు కథ అని, మరణించిన రియాజ్ డెడ్ బాడీలోకి బుల్లెట్లు దింపి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు.
రియాజ్‌ను హాస్పిటల్ లోపలికి, బయటకు తీసుకెళ్లిన విజువల్స్, ఇతర ఏ సాక్ష్యాలనూ పోలీసులు చూపడం లేదన్నారు. ఈ ఘటన తర్వాత పోలీస్ కమిషనర్, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టార్ బిష్ణోరు ఫోటోలు పక్క పక్కనే పెట్టుకొని సంబరాలు చేసుకోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఇందులో చాలా అంశాలు దాగి ఉన్నాయనీ, సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. అప్పుడే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని రియాజ్ తల్లీ, భార్యలు డిమాండ్ చేశారు.న
రియాజ్‌ది బూటకపు ఎన్‌కౌంటర్
- Advertisement -
- Advertisement -



