Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంఒక్క రోజులోనే రూ. 11 లక్షల కోట్లు ఆవిరి

ఒక్క రోజులోనే రూ. 11 లక్షల కోట్లు ఆవిరి

- Advertisement -

సెన్సెక్స్‌ మరో 1456 పాయింట్ల పతనం
నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్లపై అవిశ్వాసం
కానరాని సానుకూలతలు
భారత ఆర్థిక వ్యవస్థపైనా భయాలు

ముంబయి : భారత స్టాక్‌ ‌మార్కెట్లపై దేశ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లినట్లు స్పష్టమవుతోంది. బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలన్న ప్రధాన మోడీ ప్రకటనతో దేశ ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు పెరుగుతున్నాయనే సంకేతాల నేపథ్యంలో వరుసగా నాలుగు సెషన్లలో స్టాక్‌ ‌మార్కెట్లు కుప్పకూలాయి.అదే విధంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌‌తో రూపాయి రికార్డ్‌ ‌పతనం తదితర పరిణామాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్క సెషన్లోనే రూ.11 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 16.77 లక్షల కోట్లు హరించుకుపోవడంతో లబోదిబోమంటున్నారు.

మంగళవారం ట్రేడింగ్‌లో బిఎస్ఇ సెన్సెక్స్ 1,456 పాయింట్లు లేదా 1.92 శాతం పతనమై 74,559కు పరిమితమయ్యింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 3,399.28 పాయింట్లు లేదా 4.36 శాతం నష్టపోయింది. దీనివల్ల బిఎస్ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 456 లక్షల కోట్లకు పడిపోయింది.
​​రంగాల వారీగా.. మంగళవారం బిఎస్ఇలో 3,412 షేర్లు నష్టపోగా, కేవలం 869 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సెన్సెక్స్30లో టెక్‌మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్, టైటాన్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా నష్టపోయాయి. అయితే ఎస్‌‌బిఐ మాత్రం లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. రంగాల వారీగా రియాల్టీ 4.22 శాతం, ఐటి 3.37 శాతం, కన్య్సూమర్‌ ‌డ్యూరెబుల్స్‌ 3.35 శాతం చొప్పున పతనమై మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి.

​ముందున్న సవాళ్లు..
అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలు, హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న అంతరాయాల వల్ల ఇంధన ధరలు పెరగడం మార్కెట్లను సూచీలను కుదిపేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 3 శాతం పెరిగి బారెల్‌కు 107.4 డాలర్లకు చేరింది. దీనికి తోడు ఐటి, 

రియల్టీ రంగాల్లో నెలకొన్న బలహీనత అమ్మకాల ఒత్తిడిని పెంచిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం లాభాల స్వీకరణ దశ మాత్రమే కాదని, మార్కెట్‌‌పై నమ్మకం దెబ్బతినడం వల్లే ఈ పతనం సంభవించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముడిచమురు ధరలు 105-107 డాలర్ల మధ్య కొనసాగడం, రూపాయి విలువ బలహీనపడటం, విదేశీ నిధుల తరలింపు వంటి అంశాలు రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

​అదానీ గ్రూప్ షేర్లు కుదేలు..
అదానీ గ్రూప్ షేర్లు వరుస నష్టాలను ఎదుర్కొంటున్నాయి. మంగళవారం సెషన్‌‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన దాదాపు అన్ని కంపెనీల షేర్లు నష్టాలతో కుదేలాయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 5.87 శాతం నష్టపోగా, అదానీ పవర్ 5.63 శాతం పతనమైంది. వీటితో పాటు ఎన్‌‌డిటివి 4.78 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 4.77 శాతం, అదానీ పోర్ట్స్ 4.39 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4.14 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3.82 శాతం చొప్పున క్షీణించాయి. సిమెంట్ రంగంలోని అంబుజా సిమెంట్స్ 2.24 శాతం, ఎసిసి 0.76 శాతం చొప్పున తగ్గాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -