Tuesday, March 24, 2026
E-PAPER

రూ’పాయే’!

- Advertisement -

ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలవిలలాడుతున్నది. మునుపె న్నడూ లేని విధంగా పాతాళానికి దిగజారుతున్నది. మరీ ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతూనే ఉంది. రూపాయి విలువ పెంచుతానంటూ ప్రధాని చెబుతున్న మాటలు ఉత్తికోతలే అని స్పష్టమవుతూనే ఉంది. డాలర్‌తో పోలిస్తే నేడు మన రూపాయి విలువ 94.10కి చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా డాలర్‌ విలువ భారీగా పెరిగి మన రూపాయిని వెక్కిరిస్తోంది. రూపాయి పతనం అనేది కేవలం కరెన్సీ మార్పు మాత్రమే కాదు, ఇది ఆర్థిక వ్యవస్థపై పడుతున్న తీవ్రమైన ఒత్తిడికి ఓ సంకేతం. అందుకే భవిష్యత్తులో రూపాయి ఏ స్థాయికి పడిపోతుందో అనే అందోళన అందరిలో మొదలయింది.

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే రూపాయి విలువ ఇప్పటివరకు దాదాపు పదిశాతం మేర క్షీణించింది. 2014 తర్వాత రూపాయికి ఇదే అత్యంత దారుణమైన పతనం. ఆ ఏడాది 9.4 శాతం పడిపోగా, ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటేసింది. నిజం మాట్లాడుకోవాలంటే గడిచిన పద్నాలు గేండ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే రూపాయి పుంజుకుంది, మిగిలిన అన్ని ఏండ్లలో పతనాన్నే చవిచూసింది. రూపాయి అంటే కేవలం ఓ నాణెం మాత్రమే కాదు. దేశంలోని కోట్లాది మంది జీవితం. దాని విలువ పైసా పడిపోయినా పేదల జీవితాలు తలకిందులై పోతాయి. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. కానీ, సామాన్యుల సమస్యలేవీ మన పాలకులకు పట్టవు. సామ్రాజ్య వాదులకు వత్తాసు పలకడం, కార్పొరేట్లకు సలామ్‌లు కొట్టడం తప్ప రూపాయి విలువ కాపాడేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నం శూన్యం. దానికి తాజా పరిస్థితులే ఉదాహరణ.

ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహ రణతో మన రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. దీనికి తోడు క్రూడాయిల్‌ ధరలు పెరగడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచ మార్కెట్‌లో డాలర్‌ జోరు, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రూపాయిని కోలుకోలేని దెబ్బతీశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. సూటిగా చెప్పాలంటే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి సుమారు 3.4 శాతం నష్టపో యింది. ఈ కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐఎస్‌) భారత మార్కెట్ల నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.1,07,077 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మన దేశానికి దాదాపు ఎనభై శాతం చమురు విదేశాల నుంచే వస్తుంది. ఈ నెలలోనే క్రూడాయిల్‌ ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. దీనితో పాటు రూపాయి బలహీనపడటం వల్ల ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. రూపాయి విలువ పడిపోవడమంటే విదేశాల నుంచి మనం కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరగడమే. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పెట్రోల్‌, గ్యాస్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. పెట్రోల్‌ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. అంతేకాదు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల దేశీయ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావం పడటం ఖాయం.

రూపాయి పతనంతో ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రయత్నాలు చేస్తానంటోంది. కానీ ఆచరణలో మాత్రం చర్యలు శూన్యం. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించక పోవడంతో రూపాయిపై ఒత్తిడి మరింత పెరిగింది. మొత్తానికి అగ్రరాజ్య ఆమెరికా అహంకారానికి మన రూపాయి కొవ్వొత్తిలా కరిగిపోతోంది. మన ”నాయకుడు’ మాత్రం యుద్ధ విన్యాసాలను చూస్తూ, అమెరికాకు గులాంగిరి చేస్తూ కాలం గడుపుతున్నాడు.

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. దాని పర్యావసానాలు అనుభవించేది సామాన్యులే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆ యుద్ధ ప్రభావమే నేడు మన రూపాయిపై కూడా పడింది. పతనానికి కారణమయింది. నేడు ఇంట్లో వండుకునేందుకు కూడా గ్యాస్‌ దొరక్క చాలామంది గ్యాస్‌ కంపెనీల వద్ద క్యూలు కడుతు న్నారు. చిరు వ్యాపారులు, టిఫిన్‌ సెంటర్ల వారైతే దుకాణాలు మూసేసుకుని అల్లాడుతున్నారు. దీనంతటికి కారణం ముమ్మాటికీ అమెరికా దురహంకారమే. దానికి వత్తాసు పలుకుతున్న మన కేంద్ర పాలకుల నిర్వాకమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -