నవతెలంగాణ – అశ్వారావుపేట
పథకం ఏదైనా ప్రజా ప్రయోజనం అయితేనే ఆ పధకానికి సార్ధకత. లేకపోతే అది పాలకుల ప్రాభవం కోసమో లేక అధికారుల సాధికారత కోసమో అమలు చేసినట్లు భావించాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వం కాలుష్యం నివారించడం తోపాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడం కోసం పల్లె ప్రకృతి వనాలు ను ఏర్పాటు చేసింది. అయితే ఇవి గ్రామం సమీపంలో నో లేక గ్రామం నడిబొడ్డు నో మొక్కలు పెంచి, దానిలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి రోజూ ఉదయమో లేక సాయంత్రంమో స్థానిక ప్రజలు అక్కడ సేద దీరే విధంగా పల్లె ప్రకృతి వనాలు రూపొందించారు. కానీ గ్రామం సమీపంలో గానీ, గ్రామంలో గాని ప్రభుత్వం ఖాలీ స్థలాలు ఏమీ లేకపోవడంతో అడవుల్లోనూ.. మైదానాల్లో వీటిని ఏర్పాటు చేసారు. నేడు అవి పెరిగి అడవులను తలపిస్తున్నాయి.
ఉదాహరణగా నందిపాడు పంచాయితీలో గుట్టను ఆనుకొని ఒకటి, కుడుములు పాడులో గుట్ట పక్కన ఒకటి దట్టమైన అడవిలో ఒకటి ఏర్పాటు చేసారు. అటవీ శాఖ ప్రకారం పాల్వంచ డివిజన్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో లచ్చపేట ఎక్స్టెన్షన్ 1 లో కుడుములపాడు పల్లె ప్రకృతి వనం నెలకొని ఉంది. దీంతో గ్రామీణాభివృద్ధికి వెచ్చించిన నిధులు ఇలా అడవిలో కాచిన వెన్నెలలా ఇలా వృధా అయ్యాయి.