– క్వార్టర్స్‌లో టాప్ సీడ్
– రిబకినా, పెగులా ముందంజ
– మయామి ఓపెన్ 2026
– మయామి (యుఎస్‌ఏ):-
మయామి ఓపెన్‌లో వరల్డ్ నం.1 అరినా సబలెంక (బెలారస్) జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అరినా సబలెంక.. మయామి ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో చైనా అమ్మాయి, 23వ సీడ్ క్విన్వెన్ జెంగ్‌పై సబలెంక 6-3, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించింది. 4 ఏస్‌లు, 3 బ్రేక్ పాయింట్లతో మెరిసిన సబలెంక..చైనా అమ్మాయిని చిత్తు చేసింది. జెంగ్ 8 ఏస్‌లు, ఓ బ్రేక్ పాయింట్ సాధించినా.. అగ్రశ్రేణి క్రీడాకారిణికి దీటుగా రాణించలేదు. పాయింట్ల పరంగా 60-53తో సబలెంక స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మరో ప్రీ క్వార్టర్స్‌లో కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలెనా రిబకినా అలవోక విజయం సాధించింది. ఆస్ట్రేలియా అమ్మాయి టాలియ గిబ్సన్‌పై 6-2, 6-2తో మెరుపు విజయం సాధించింది. మూడో సీడ్ రిబకినా 3 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లు సాధించింది. 57-37తో పాయింట్ల పరంగా పైచేయి సాధించింది. గిబ్సన్ ఏ దశలోనూ రిబకినాకు పోటీ ఇవ్వలేదు. ఐదో సీడ్, అమెరికా అమ్మాయి జెస్సికా పెగులా సైతం ముందంజ వేసింది. జాక్వలైన్ క్రిస్టియన్‌పై 6-4, 6-1తో వరుస సెట్లలో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 6 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లతో రాణించిన జెస్సికా.. 60-42తో పాయింట్ల పరంగా పైచేయి సాధించింది. స్విస్ భామ బెలిందా బెన్సిక్ 6-2, 6-2తో ఆమంద అనిషిమోవ (అమెరికా)పై గెలుపొందింది. ఆరో సీడ్ ఆమంద ఫేవరేట్‌గా బరిలో నిలిచినా..బెలింద వరుస సెట్లలో లాంఛనం ముగించింది. నాలుగు సార్లు ఆమంద సర్వ్ బ్రేక్ చేసిన బెలింద అలవోకగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. అమెరికా స్టార్ కొకొ గాఫ్ మూడు సెట్ల సమరంలో సోరానపై పైచేయి సాధించింది. 6-4, 3-6, 6-2తో కొకొ గాఫ్ గెలుపొందింది. ఏడు బ్రేక్ పాయింట్లు సాధించిన గాఫ్.. రెండో సెట్లో సోరానకు తలొగ్గింది. పాయింట్ల పరంగా 92-81తో పైచేయి నిలుపుకుంది. జెలెనా ఒస్టాపెంకో 6-3, 6-4తో అమెరికా అమ్మాయి హేలీ చేతిలో మట్టికరిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లో బెలిందతో గాఫ్.. రిబకినాతో పెగులా… సబలెంకతో హేలీ పోటీపడనున్నారు.
సినర్ రికార్డు :
పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.2, ఇటలీ స్టార్ ఆటగాడు జానిక్ సినర్ ఏటీపీ మాస్టర్స్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. మంగళవారం మయామి ఓపెన్‌లో గెలుపొందిన సినర్.. ఏటీపీ 1000 మాస్టర్స్‌లో వరుసగా 26 సెట్లు గెలుపొందిన ఆటగాడిగా నొవాక్ జకోవిచ్ (25) రికార్డును అధిగమించాడు. 6-1, 6-4తో ఫ్రాన్స్ ఆటగాడు కొర్టెనిన్‌పై గెలుపొందిన సినర్ 71 నిమిషాల్లోనే గెలుపొందాడు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జకోవిచ్ ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీల్లో నెలకొల్పిన రికార్డును అధిగమించటం సంతోషంగా ఉందని సినర్ అన్నాడు. ‘ఎంతో సంతోషంగా ఉంది. టెన్నిస్ నమ్మశక్యం కాని ఆట’ అని సినర్ ఆనందం వ్యక్తపరిచాడు. 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన సినర్.. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఇండియన్‌వెల్స్, పారిస్ మాస్టర్స్ టైటిల్స్ సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1, రష్యా స్టార్ డానిల్ మెద్వదేవ్‌కు చుక్కెదురైంది. ప్రీ క్వార్టర్స్‌లో అర్జెంటీనా ఆటగాడు ఫ్రాన్సిస్కో 6-0, 4-6, 7-5తో మెద్వదేవ్‌పై గెలుపొందాడు. మూడు సెట్ల మ్యాచ్‌లో మెద్వదేవ్ 4 ఏస్‌లు, 4 బ్రేక్ పాయింట్లు సాధించినా.. ఫ్రాన్సిస్కో ఏడు బ్రేక్ పాయింట్లతో పైచేయి సాధించాడు. మూడో సీడ్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-2, 5-7, 6-4తో మారిన్ సిలిచ్ (క్రోయేషియా)పై గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. 19 ఏస్‌లు, 3 బ్రేక్ పాయింట్లతో జ్వెరెవ్ విరుచుకుపడ్డాడు. 106-89తో పాయింట్ల పరంగా సిలిచ్‌పై పైచేయి సాధించాడు.



