– లహోటి ఆయిల్ మిల్ కు కట్టబెట్టే ప్రయత్నాలను నిలిపివేయాలి
– బేషరతుగా ఆయిల్‌ఫెడ్ కు అప్పగించాలి
– ఏఐకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కు చెందిన 15,984.50 చదరపు గజాల స్థలాన్ని విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ (ఏఐకేఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి పుల్లయ్య డిమాండ్ చేశారు. సుమారు రూ.500 కోట్ల విలువైన ఈ స్థలాన్ని ఆయిల్‌ఫెడ్ కు బేషరతుగా అప్పగించాలని కోరారు. బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో రైతుల ఉత్పత్తుల విక్రయాలు, భవిష్యత్ అవసరాల కోసం ఈ స్థలం ఆయిల్‌ఫెడ్ కు అత్యంత కీలకమన్నారు. 1990 నుంచి ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని దయారామ్ సూరజ్‌మల్ లహోటి ఆయిల్ మిల్ యాజమాన్యానికి కారు చౌకగా కట్టబెట్టేందుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లహోటి ఆయిల్ మిల్ యాజమాన్యం చేసిన న్యాయపోరాటాల్లో అన్ని న్యాయస్థానాల్లో ఓటమి ఎదురైందని గుర్తుచేశారు. అయినప్పటికీ న్యాయస్థానాల తీర్పులను విస్మరించి ఆయిల్‌ఫెడ్ ఆధీనంలోని స్థలాన్ని తొలగించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగంలో లాభాల్లో నడుస్తున్న ఆయిల్‌ఫెడ్ ను బలోపేతం చేయాల్సింది పోయి, దాని ఆస్తులను విక్రయించడం సరికాదన్నారు.
పామాయిల్ సాగు చేస్తున్న లక్షలాది మంది రైతుల ప్రయోజనాల కోసం ఆయిల్‌ఫెడ్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇదే తరహాలో పామాయిల్ ఫ్యాక్టరీలు, ఇతర ఆస్తులను సైతం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారన్న ఆందోళన రైతుల్లో నెలకొందన్నారు. స్థలాన్ని లహోటి ఆయిల్ మిల్ కు కేటాయించే చర్యలను నిలిపివేసి, ఆయిల్‌ఫెడ్ కు బేషరతుగా అప్పగించక పోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని పుల్లయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డా లక్ష్మినారాయణ, కొలికపోగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



