నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ రెండు విడత అసెంబ్లీ ఎన్నికలు(West Bengal Assembly Elections) జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. మొత్తం 142 స్థానాలకు ఇవాళ తుది విడుత పోలింగ్ జరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో 18.39 శాతం ఓటింగ్ నమోదైంది.
అయితే కొన్ని చోట్ల ఉదయమే విధ్వంసకర సంఘటనలు జరిగాయి. చాప్రా, శాంతిపుర్, భాంగర్‌లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎంటలీ నియోజకవర్గంలో పోలింగ్ ఆఫీసర్లు, సెక్యూర్టీ సిబ్బందితో బీజేపీ అభ్యర్థి గొడవ పడ్డారు. పోలింగ్ బూత్ నుంచి తమ ప్రతినిధిని గెంటివేయడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బూత్ చిన్నగా ఉన్న కారణంగా ఏజెంట్‌ను బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఓ సీటు కోసం తృణమూల్ అభ్యర్థి గొడవపడడంతో ఇద్దర్నీ పంపించేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాల్లో, రెండో దశలో 142 స్థానాలు ఉన్నాయి. ఈ దశలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 3.21 కోట్లు కాగా, వీరిలో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాల పరిధిలో, 220 మంది మహిళలతో సహా మొత్తం 1,448 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ పోలింగ్ కేంద్రాలలో 8,000కు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న తొలి దఫాలో 152 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 4న పోలింగ్ ఫలితాలు వెల్లడికానున్నాయి.


