Sunday, March 8, 2026
E-PAPER
Homeజాతీయంవ్యవసాయంలో ఆమెకు గుర్తింపు కరువు

వ్యవసాయంలో ఆమెకు గుర్తింపు కరువు

- Advertisement -

– ఈ రంగంలో మహిళలది గణనీయమైన పాత్ర
– హక్కులు, న్యాయం, సమానత్వానికి దూరం
– అందని ఆర్థిక వనరులు, పోషకాహారం
– దేశంలో చట్టాల అమలూ పేలవమే
– మాటలకే పరిమితమైన మోడీ సర్కారు
– నష్టపోతున్న మహిళా రైతులు

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమాన హక్కులు, న్యాయం కోసం గొంతె త్తుతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి వారు స్వేచ్ఛ, సమానత్వం, సాధి కారత వంటి పలు కీలక డిమాండ్లను వినిపిస్తున్నారు. ఇందుకోసం మహిళా లోకాన్ని ఐక్యం చేసి ఉద్యమిస్తున్నారు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో వారి డిమాండ్లు పూర్తిగా నెరవేరడం లేదు. కేంద్రంలోని మోడీ పాలనలో ప్రతి రంగంలోనూ ఇదే సమస్య ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం, కరోనా వంటి సంక్షోభంలో ఉపాధిని కల్పించి ఆదుకున్న వ్యవసాయ రంగంలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లో వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే పెరుగుతున్నప్పటికీ.. వారికి భూమి హక్కులు, అధికారిక గుర్తింపు, ఆర్థిక సౌకర్యాలు వంటి కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ అందుబాటులో లేవు. మహిళలు వ్యవసాయం నిర్వహిస్తున్నప్పటికీ.. చట్టపరమైన గుర్తింపు లేకపోవడంతో అనేక సంక్షేమ పథకాల నుంచి వారు దూరమవుతున్నారు.

భూమి హక్కుల్లో మహిళలకు అన్యాయం
గ్రామీణ భారతదేశంలో ఎక్కువ భూములు పురుషుల పేర్ల మీదనే నమోదై ఉన్నాయి. మహిళలు వ్యవసాయం నిర్వహించినా.. భూమిపై వారికి అధికారిక హక్కులు ఉండవు. సాంప్రదాయ వారసత్వ విధానాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల మహిళల పేర్లు భూరికార్డుల్లో నమోదు కావడం చాలా అరుదుగా ఉంటోంది. దీని ఫలితంగా మహిళలు రైతులుగా గుర్తింపు పొందలే కపోతున్నారు. దీంతో బ్యాంకు రుణాలు, పంట బీమా, సాగునీటి పథకాలు, వ్యవసాయ శిక్షణలు వంటి అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.

భద్రత కరువు
వ్యవసాయంలో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతోంది. పురుషులు ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళ్తుండడంతో గ్రామాల్లో వ్యవసాయం బాధ్యతలు ఎక్కువగా మహిళలపై పడుతున్నాయి. దీంతో వ్యవసాయంలో మహిళలు కీలకంగా మారారు. అయితే ఇది వారి పరిస్థితిని మాత్రం మెరుగుపర్చడం లేదు. పొలాల్లో పని, ఇంటి పనులు రెండూ నిర్వహించాల్సి రావడంతో మహిళలపై పని భారం తీవ్రంగా పెరిగింది. దీనితో వారు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా పోషకాహార లోపం, రక్తహీనత (ఎనీమియా) వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

పోషకాహార లోపం పెద్ద సవాలు
భారత్‌లో మహిళలు, బాలికల్లో పోషకాహార లోపం ఇప్పటికీ తీవ్ర సమస్యగానే ఉంది. చాలా గ్రామీణ కుటుంబాల్లో ఆహారం ప్రధానంగా ధాన్యాలపై ఆధారపడుతుంది. పప్పులు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్‌ ఆహారం తక్కువగా ఉంటుంది. అయితే ఇది మరింత ప్రమాదకరమని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మహిళల పోషకాహార లోపం పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. తక్కువ బరువుతో పుట్టడం, పిల్లల ఎదుగుదలలో లోపాలు వంటి సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

చట్టాలున్నా.. అమలులో లోపం
భారత్‌లో మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలున్నాయి. ఆస్థుల్లో పురుషులతో పాటు వారికి సమాన వాటా దక్కాలన్న సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం చాలా మంది మహిళలు ఈ హక్కును అందుకో లేకపోతున్నారు. చట్టాలపై మహిళల కు అవగాహన లేకపోవడం, ఆస్తుల పంపకాల విషయాల్లో జరిగే వివాదాలు, దాని పరిణామాల విషయంలో భద్రత కరువవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెప్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌) వంటి చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి ప్రయోజనాలు మాత్రం అందరికీ సమానంగా అందడం లేదు. రేషన్‌ వ్యవస్థలో ప్రధానంగా ధాన్యాలు మాత్రమే అందుతాయి. పప్పులు, పోషకాహార పదార్థాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా అందుబాటులో లేవు. డిజిటలైజేషన్‌.. గ్రామీణ మహిళలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇంటర్నెట్‌, డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరిజ్ఞానం వారికి లేకపోవడంతో కొంత మంది ఈ పథకాలకు దూరమవుతున్నారు.

నాలుగు కీలక చర్యలు అవసరం
మహిళా రైతుల పరిస్థితిని మెరుగుపర్చడానికి నాలుగు ముఖ్య చర్యలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. అవి

1.మహిళా రైతులకు అధికారిక గుర్తింపు ఇవ్వాలి. భూమి యాజమాన్యానికి సంబంధం లేకుండా వ్యవసాయం చేసే వారిని రైతులుగా గుర్తించే విధానాలు అమలు చేయాలి.

2.భూమి, వనరులపై మహిళలకు హక్కులు కల్పించాలి. మహిళలకు వారసత్వ హక్కులను పటిష్టంగా అమలు చేయ డం, వారికి అవగాహన కల్పిం చడం, భూమి రిజిస్ట్రేషన్లలో వారి పేర్లు చేర్చడం, చట్టపరంగా భద్రత కల్పించడం చేయాలి.

3.మహిళల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వారు పోషకాహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం, గోధుమలకు మాత్రమే పరిమితం కాకుండా పప్పులు, మిల్లెట్లు వంటి పలు పోషకాహార పదార్థాలను అందించాలి.

4.ప్రస్తుత కాలంలో సాంకేతికత ఎంతో కీలకం. కాబట్టి మహిళా రైతులకు వారి శ్రమను తగ్గించేందుకు వ్యవసాయ పరికరాలు, శిక్షణ, మార్కెట్‌ సమాచారం అందించాలి.

సమానత్వానికి ఇదే మార్గం
వ్యవసాయ రంగంలో మహిళలకు జ్ఞానం, హక్కులు, సంస్థాగత మద్దతు లభిస్తే వారు పర్యావరణానికి అను కూలమైన, పోషకాహారాన్ని పెంపొం దించే వ్యవసాయ వ్యవస్థలను ముందుకు నడిపించగలరని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మహిళా రైతులకు భూమి హక్కులు, వనరులు, పోషకాహారం అందించడం ద్వారా సమానత్వంతో కూడిన, బలమైన భారతదేశాన్ని నిర్మించవచ్చని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు.

మోడీ సర్కారు విధానాలపై విమర్శలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళలు, మహిళా రైతులపై చిన్న చూపు చూస్తున్నది. గత పదేండ్లలో వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని కేంద్రం చెప్తున్నా…మహిళా రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టలేదని పరిశీలకులు చెప్తున్నారు. ఉదాహరణకు, భూమి హక్కుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే పెద్దస్థాయి సంస్కరణలు కనిపించలేదని వారు వివరిస్తున్నారు. వ్యవసాయ పథకాల్లో మహిళా రైతుల ప్రత్యేక అవసరాలను గుర్తించే విధానాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వ ఆహార భద్రతా పథకాలు ప్రధానంగా ధాన్యాలకే పరిమితమై ఉండటంతో మహిళల్లో పోషకాహార సమస్యలు కొనసాగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. గ్రామీణ మహిళల్లో రక్తహీనత సమస్య ఇప్పటికీ తీవ్రంగానే ఉండటం ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని చూపుతున్నదని వారు అంటున్నారు. మోడీ ప్రభుత్వం మహిళా సాధికారత గురించి తరచూ మాట్లాడుతున్నప్పటికీ.. వ్యవసాయ రంగంలో మహిళా రైతుల అసలు సమస్యలను పరిష్కరించడంలో మాత్రం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -