నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, హాస్య నటుడిగా.. ఇలా పలు భిన్న పాత్రల్లో మెప్పించి, ప్రేక్షకుల మదిపై చెరగని సంతకం చేసిన విలక్షణ నటుడు గిరిబాబు (80) కన్ను మూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు.
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా కొరిశపాడు రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు.
చదువుకొనే రోజుల నుంచే ఆయనకు నటనాభి లాష ఉండేది. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు చూసి వారిలాగా అభినయిస్తూండేవారు. దీంతో అందరూ ఆయన్ని సినిమా పిచ్చోడ.
సినిమాల్లోకి రాకముందే మాదాల రంగారావుతో కాలేజీ రోజుల్లో గిరిబాబుకు పరిచయం ఉండేది. ప్రజానాట్య మండలికి చెందిన నల్లూరి వెంక టేశ్వర్లు శిష్యరికంలో మాదాలతో పాటు గిరిబాబు నటనలో శిక్షణ తీసుకున్నారు.
తొలుత నాటకాలతో నట జీవితాన్ని ప్రారం భించిన ఆయన సొంతంగా నాటక సమాజాన్ని కూడా స్థాపించారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలు, మిత్రుల తోడ్పాటుతో సినీ రంగంవైపు అడుగులు వేశారు. అలా మొదటి సినిమా ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ మొద లైనా పూర్తి కాలేదు. ఆ తర్వాత ‘తప్పటడుగులు’ ఓకే అయినా అదీ ఆగిపోయింది. మూడో సినిమా ‘స్వర్గానికి నిచ్చెనలు’ని మధ్యలోనే ఆపేశారు. మూడు సినిమాలు ఆగిపోయినా తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఎందుకంటే ఏమీ సాధించ కుండా వెనక్కి తిరిగి వెళితే అవమానమని గిరిబాబు భావించారు. పైగా అప్పటికే పెళ్లై పిల్లలు కూడా.
సినిమాల్లో అవకాశాలు రాలేదని ఖాళీగా కూర్చో లేదు. నాటకాలు వేస్తూ వాటిల్లో రాణించారు. చివరకు 1973లో పి.వి. సుబ్బారావుతో కలిసి ఏ. పూర్ణచంద్రరావు నిర్మించిన 'జగమే మాయ' చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. దీనికి ఐ.యస్. మూర్తి దర్శకత్వం వహించారు.
విశేషం ఏమంటే, ఈ సినిమా విడుదల కాకుండానే గిరిబాబుకు దాదాపు ఇరవై సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
తరువాత 'వధూవరులు' వంటి కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే కథానాయకుని గా గిరిబాబు సక్సెస్ సాధించలేదు. దాంతో విలన్ వేషాల్లో రాణిస్తూ ముందుకు సాగారు. ‘జ్యోతి’, ‘మా దైవం’, ‘కురుక్షేత్రం’, ‘దేవతలారా దీవిం చండి’ చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
విలన్ వేషాలు వేసి జనాన్ని భయపెట్టినా తరు వాతి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొడుకుగా, తండ్రిగా, ఊరి పెద్దగా, ఇంటి పెద్దగా ఎన్నో మరిచిపోలేని పాత్రలు చేశారు.
‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’, ‘భైరవద్వీపం’, ‘అల్లుడా మజాకా’, ‘ప్రేమ లేఖలు’, ‘హలో బ్రదర్’, ‘సిసింద్రీ’, ప్రతినిధి, ‘కితకితలు’, ‘ఎవడైతే నాకేంటి’, ‘అతడు’, ‘నువ్వేకావాలి’, ‘బిందాస్’, ‘అ.. ఆ’, ‘గీత గోవిందం’, ‘శ్రీకారం’ వంటి 600లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. పాతతరం నుంచి నేటి తరం వరకూ నాలుగు దశాబ్దాలుగా చిత్ర రంగంలో రాణించిన గిరిబాబు 2023లో విడులైన ‘అన్నీ మంచి శకునములే’ చివరి సారిగా నటించారు.
గిరిబాబు నటునిగానే కాదు జయభేరి పతాకంపై నిర్మాతగా, రచయితగా, దర్శకునిగానూ సాగారు. గిరిబాబు నిర్మించి, నటించిన 'దేవతలారా దీవిం చండి, సింహగర్జన, మెరుపుదాడి, రణరంగం', ‘ఇంద్రజిత్’ వంటి తదితర చిత్రాలు ఆదరణ పొందాయి. 'రణరంగం' చిత్రంతో దర్శకుడైన గిరిబాబు తరువాత 'నీ సుఖమే నే కోరుతున్నా' వంటి సినిమానూ రూపొందించారు.
గిరిబాబు, మురళీ మోహన్ మంచి మిత్రులు. . గిరిబాబు నెలకొల్పిన జయభేరి బ్యానర్‌ని తరువాత మురళీమోహన్ తీసుకున్నారు. అప్పటి నుంచీ మురళీమోహన్ సొంత చిత్రాల్లో గిరిబాబు తప్పనిసరిగా కనిపించేవారు.
గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు రఘుబాబు, బోసుబాబు ఇద్దరు కుమారులు. రఘుబాబు హాస్యనటుడిగా కొనసాగుతున్నారు.
80 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచిన గిరిబాబుకు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకూ ఫిల్మ్ ఛాంబర్లో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్దం ఉంచారు. ఆ తర్వాత గిరిబాబు స్వగ్రామం రావినూతలకు తరలించారు. నేడు (ఆదివారం) మధ్యాహ్నం రావినూతలలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
‘ప్రారంభంలో ప్రజానాట్యమండలిలో నల్లూరి వెంకటేశ్వర్లు దగ్గర నటనలో ఓనమాలు దిద్దు కొని, తదుపరి సినిమా రంగంలో నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తనకంటూ ఒక ప్రత్యే కతను నిర్మించుకున్న మంచి మనిషి గిరిబాబుకి అశృనివాళి’ అని ప్రజానాట్య మండలి సినిమా శాఖ అధ్యక్షులు, వందే మాతరం శ్రీనివాస్, కార్యదర్శి మద్దినేని రమేష్, ట్రెజరర్ మాదాల రవి సంతాప ప్రకటనలో తెలిపారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మా తగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ప్రముఖ నటులు గిరిబాబు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడిగా, నిర్మా తగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. - చిరంజీవి
మద్రాస్‌లో ఉన్నప్పుడు గిరిబాబు, నేను రూమ్ మేట్స్. ఇండస్ట్రీలో నాకంటే ముందు అతను నటుడయ్యారు. ఆ తరువాత మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో నటించాం. గిరిబాబు గొప్ప మనసున్న వ్యక్తి. ఎన్నో విలక్షణమైన పాత్ర లను పోషించారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో విజయాలను సాధించారు. అలాంటి వ్యక్తి పరిశ్రమలో లేరని తెలియడం బాధగా ఉంది. బాధతో నాకు మాటలు రావడం లేదు. - మోహన్‌బాబు
నా కెరీర్ ప్రారంభంలోనే 'అన్నదమ్ముల అను బంధం'లో గిరిబాబుతో కలిసి నటిం చాను. నా పలు చిత్రాలలో ఆయన ప్రాధాన్య మున్న పాత్రలు పోషించారు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు, మంచి వ్యక్తి కూడా.
- బాలకృష్ణ
గిరిబాబు కన్నుమూశారని తెలిసి చింతి స్తున్నా. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. చక్కటి హాస్యం కూడా పండిం చారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంత మైన చిత్రాలు రూపొందించారు.
- పవన్ కల్యాణ్






కామెంట్లు (0)