మీకు తెలుసా
భారతదేశంలోని అనేక నగరాలకు వాటి భౌగోళిక అందాలు, చారిత్రక నేపథ్యాల ఆధారంగా కొన్ని ప్రత్యేకమైన పేర్లు వచ్చాయి. ఉదాహరణకు గులాబీ రంగు కట్టడాలతో మెరిసిపోయే జైపూర్‌ను పింక్ సిటీ అని, అందమైన సరస్సుల నడిబొడ్డున కొలువైన ఉదయ్‌పూర్‌ను సిటీ ఆఫ్ లేక్స్ అని, ముంబయిని కలల నగరం అని పిలుస్తుంటాం. అలాగే అద్భుతమైన నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ లండన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన మరో చారిత్రక నగరం కూడా మన దేశంలో ఉంది. అదే పశ్చిమ బెంగాల్ రాజధాని ‘కోల్‌కతా. అసలు ఈ నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
కోల్‌కతా నగరానికి బ్రిటన్ రాజధాని లండన్‌తో ఉనికి, పరిపాలన, సంస్కృతి పరంగా సారూప్యతలు ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఆనాటి కట్టడాలు, అప్పటి సదుపాయాలు బ్రిటిష్ ఇండియా కాలంలో కోల్‌కతా పాత్రను గుర్తు చేస్తాయి. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఆ తర్వాత వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం భారత్‌లో తమ పాలనను విస్తరించినప్పుడు కోల్‌కతా నగరాన్నే తమ అధికారిక రాజధానిగా ఎంచుకుని పాలించారు. ఆ కాలంలో ఆసియాలోనే అత్యంత ముఖ్యమైన పట్టణాల్లో ఈ నగరం ఉండేది. విశాలమైన రహదారులు, అద్భుతమైన కట్టడాలు ఉండేవి. బ్రిటిష్ వారి వాస్తుకళా నైపుణ్యం ఇక్కడి నిర్మాణాల్లో స్పష్టంగా కనిపించేది. అందుకే కోల్‌కతాకు ఐరోపా నగరాల రూపురేఖలు వచ్చాయి.
కోల్‌కతా మహానగర అభివృద్ధి 18వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఇక్కడే ఈస్ట్ ఇండియా కంపెనీ తన ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పడంతో, ఈ నగరం అనతికాలంలోనే బ్రిటీష్ సామ్రాజ్యానికి శక్తిమంతమైన అధికార కేంద్రంగా అభివృద్ధి చెందింది. కొన్ని దశాబ్దాల పాటు కోల్‌కతా బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా ఉంది. ఆ టైమ్‌లో దేశ పరిపాలన, వాణిజ్యం, వలసవాద విధానాలపై కీలక నిర్ణయాలకు ప్రధాన వేదికగా నిలిచింది. రాజధాని కావడంతో బ్రిటిష్ పాలకులు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టారు. భారీ కట్టడాలు, న్యాయస్థానాలు, విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలను అభివృద్ధి చేశారు. కోల్‌కతా రూపురేఖల్ని మార్చిన ఈ నిర్మాణాలన్నింటిలోనూ యూరోపియన్ వాస్తుకళా శైలి స్పష్టంగా కనిపిస్తుంది.
బ్రిటన్ రాజధాని లండన్ నగరం థేమ్స్ నది ఒడ్డున ఉంది. ఆ నగర అభివృద్ధిలో దీనికి కీలక స్థానం. మన దగ్గర కోల్‌కతా నగరం హుగ్లీ నది ఒడ్డున ఉంది. ఈ భౌగోళిక పోలికే రెండు నగరాల మధ్య ఒక అద్భుతమైన సారూప్యతను తీసుకువచ్చింది. హుగ్లీ నది కోల్‌కతా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఈ నది గంగా నదికి ఉప నదిగా ఉండటం వల్ల ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించే ఓడలకు ఇది ఒక కీలకమైన వాణిజ్య మార్గంగా మారింది.
బ్రిటిష్ వారి కాలంలో రవాణా కోసం ట్రామ్‌లు ఉపయోగించేవారు. 1900 తొలినాళ్లలో వీటి వాడకం మొదలయింది. స్వాతంత్ర్యం తర్వాత ఇవి క్రమంగా అంతరించిపోయాయి. కానీ ఇప్పటికీ ఇవి కోల్‌కతాలో వినియోగిస్తున్నారు. రద్దీగా ఉండే వీధుల గుండా నెమ్మదిగా కదిలే ఈ వెహికల్స్ యూరప్‌లోని వాహనాల వలే నగరానికి ఒక అపురూపమైన పాత కాలపు అందాన్ని ఇస్తున్నాయి. పాత కాలపు ఆనవాళ్లు ఉన్నా, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. వివిధ పరిశ్రమలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు ఇక్కడ కనిపిస్తాయి.






కామెంట్‌లు (0)