Magazines

బతుకమ్మ ...!

14 నవంబర్, 2026

Bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 6 నిమిషాల చదవడం

తెల్లవారుజామున... ఇంకా చీకటి పూర్తిగా తొలగిపోలేదు. నగరం నిద్రలోనే ఉంది. కానీ నా ఫోన్ మాత్రం అప్పటికే రెండుసార్లు మోగింది. ఆమె నుంచి మెసేజ్‌. 'లేచావా?' 'లేచాను మహారాణీ. మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాను.' 'ఆజ్ఞలు తర్వాత. త్వరగా రా. నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.' ఆ చివరి వాక్యం చదివి నవ్వుకున్నాను. బతుకమ్మ పండుగంటే ఆమెకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. పండుగకు వెళ్లాలన్న ఆమె కోరికను తీర్చడానికి ఈ ప్రయాణం. కానీ నిజం చెప్పాలంటే, ఆమెతో ఒక రోజంతా గడపబోతున్నానన్న ఆనందం నాలోనూ ఏదో తెలియని ఉత్సాహాన్ని నింపుతోంది. ఆమెను కలిసేసరికి అప్పటికే ప్రయాణానికి అంతా సిద్ధంగా ఉన్నారు. వీరూ కారు దగ్గరే ఉన్నాడు. రాణి, నరేన్ కూడా వచ్చేశారు. అందరి ముఖాల్లోనూ నిద్రమత్తు కంటే ప్రయాణ ఉత్సాహమే ఎక్కువగా కనిపించింది. “ఇంతమందిని పొద్దున్నే లేపి తీసుకొస్తున్నావంటే బతుకమ్మ మీద నీ ప్రేమ మామూలుది కాదు” అన్నాను ఆమెతో. “ఆమెది బతుకమ్మ మీద ప్రేమ. నీది ఆమె మీద ప్రేమ” అన్నాడు నరేన్. “అయితే మనం దేనికోసం వచ్చినట్టు?”

అంటూ వీరూ మధ్యలో కల్పించుకున్నాడు. “ఈ ప్రేమకథకు ప్రేక్షకులుగా” అన్నాడు నరేన్ నవ్వుతూ. “ప్రేక్షకులం కాదు... సాక్షులం” అంది రాణీ. అందరం నవ్వుకున్నాం. ఆ నవ్వుల మధ్య మా ప్రయాణం మొదలైంది. వీరూ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ముందు సీట్లో నరేన్, వెనుక సీట్లో రాణి, ఆమె, ఆమె పక్కన నేను. కిటికీలోంచి చల్లటి గాలి లోపలికి వస్తోంది. బయట చీకటి మెల్లగా పలుచబడుతోంది. దూరంగా పొలాల మీద మంచుతెరలు, చెట్ల మధ్య నుంచి తొంగిచూస్తున్న ఉదయపు వెలుగు ప్రయాణానికి కొత్త అందాన్ని ఇస్తున్నాయి. కొద్దిసేపటికి ఆమె ఫోన్‌లో బతుకమ్మ పాటలు పెట్టింది. పాట మొదలవగానే తానూ గొంతు కలిపి పాడుతుంటే ముచ్చటగా ఉంది. ముందు సీట్లోంచి వీరూ నవ్వుతూ, “అన్నా, మేడమ్‌ పాటలు మొదలుపెట్టారు. ఇక ఈ ప్రయాణంలో మనకు వేరే వినోదం అక్కర్లేదనుకుంటా!” అన్నాడు. “వినోదం సంగతి తర్వాత, ముందు నువ్వు డ్రైవింగ్‌ చూసుకో” అంది ఆమె నవ్వుతూ. వీరూ నవ్వుకుంటూ రోడ్డు మీద దృష్టి పెట్టాడు. కాసేపటికి ఓ చిన్న బ్రిడ్జి దాటుతుండగా, కింద వాగు ఒడ్డున పూలు సేకరిస్తున్న పిల్లలు, యువకులు కనిపించారు.

కొందరు అప్పటికే పూల సంచులతో ఇళ్లకు తిరుగుతున్నారు. తంగేడు, గునుగు పూలతో నిండిన వారి సంచులను చూస్తూ ఆమె, “చూడు రామ్‌! బతుకమ్మ సందడి అప్పుడే మొదలైంది” అంది. “బతుకమ్మ పండుగ ఊళ్లో మొదలైందో లేదో కానీ, మన కారులో మాత్రం అప్పుడే మొదలైపోయింది!” అన్నాడు నరేన్‌. అందరం నవ్వుకున్నాం. కారు ముందుకు సాగింది. మేము వెళ్లాల్సిన గ్రామానికి సమీపంలో మిత్రులు ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌస్‌కు చేరుకునేసరికి పూర్తిగా తెల్లవారింది. కారు ఆగగానే గేటు దగ్గర ఎదురుచూస్తున్న మిత్రులు వచ్చి ఆత్మీయంగా పలకరించారు. సామాన్లు లోపలికి తీసుకెళ్లి, మాకు గదులు చూపించారు. “ముందు ఫ్రెష్‌ అయి రండి. అల్పాహారం సిద్ధంగా ఉంది” అన్నారు. ప్రయాణపు అలసటతో అందరం త్వరగా ఫ్రెష్‌ అయి డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు చేరుకున్నాం. వేడివేడి ఇడ్లీలు, ఉప్మా, పల్లీ చట్నీతో అల్పాహారం సిద్ధంగా ఉంది. అల్పాహారం చేస్తూనే ఊరి విశేషాలు, బతుకమ్మ ఏర్పాట్ల గురించి కబుర్లు సాగాయి.

ఆమె ఆసక్తిగా వింటూ మధ్యమధ్యలో ప్రశ్నలు అడుగుతోంది. పండుగ మీద ఆమెకున్న ఆసక్తి వాళ్లకూ అర్థమైంది. అల్పాహారం పూర్తయ్యాక మిత్రులు తమ పనుల మీద వెళ్లిపోయారు. మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం పండుగ ప్రాంగణానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాం. అందరం ఎవరి గదుల్లోకి వాళ్లం వెళ్లిపోయాం. నేను గదిలో మంచం మీద వాలుతూ ఫోన్‌ చూస్తున్నాను. ఇంతలో ఆమె నుంచి మెసేజ్‌ వచ్చింది. 'ఏం చేస్తున్నావ్‌?' 'రెస్ట్ తీసుకుంటున్నాను.' 'నిజంగానా?' 'మరి!' 'ఒక్కసారి నా గదికి రా.' 'ఏంటి సంగతి?' 'వస్తావా రావా?' 'వస్తున్నా.' ఫోన్‌ పక్కన పెట్టి ఆమె గదికి వెళ్లాను. తలుపు తట్టగానే తెరిచింది. లోపలికి వెళ్లగానే తలుపు మూసి నవ్వుతూ నా వైపు చూసింది. “ఏంటి? అంత అర్జెంటుగా పిలిచావు?” “నిన్ను చూడాలనిపించింది.” “అదే మెసేజ్‌లో చెప్పొచ్చుగా!” “చెబితే వచ్చేవాడివా?” “ఇంతదూరం నీతో వచ్చినవాడిని, నీ గదికి రావడానికి ఆలోచిస్తానా?” ఆమె నవ్వుతూ మంచం మీద కూర్చుంది. నేను పక్కనే కూర్చున్నాను. ఆమె నా చేతిని అందుకుంది. కొద్దిసేపు ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. ఆమె వేళ్లు నా వేళ్లతో అల్లుకున్నాయి.

“రామ్‌... ఈ ప్రయాణం కోసం ఎంత ఎదురుచూశానో తెలుసా?” “బతుకమ్మ చూడటానికా?” “అది ఒక కారణం. నీతో ఇలా ప్రశాంతంగా కొంత సమయం గడపడానికి కూడా.” “రోజూ కలుస్తున్నాం కదా!” “కలవడం వేరు. ఇలా ఏ హడావుడీ లేకుండా నీతో ఉండటం వేరు.” ఆమె నా భుజం మీద తల వాల్చింది. నేను ఆమెను దగ్గరకు తీసుకున్నాను. ఆమె జుట్టును సుతారంగా నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాను. ఆమె నా చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. బయట ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దాలు, నవ్వులు వినిపిస్తున్నాయి. కిటికీలోంచి ఉదయపు వెలుగు గదిలోకి పడుతోంది. ఆ కొద్దిసేపు మాకు మాత్రం బయట ప్రపంచంతో పనిలేనట్టుగా అనిపించింది. “రామ్‌...” “ఊ...” “ఈరోజు ఫోన్‌ పక్కన పెట్టేయ్‌. ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంటావు. ఈరోజైనా నాతో హాయిగా ఉండు.” “అలాగే. ఈరోజు నీకు నచ్చినట్టే గడుపుదాం.” ఆమె నవ్వింది. నా భుజంపై నుంచి తల తీయకుండా మరికాసేపు అలాగే ఉండిపోయింది.

అలా ఎంత సమయం గడిచిందో తెలియదు.. ఇంతలో నా ఫోన్‌ మోగింది. వీరూ నుంచి కాల్‌. “అన్నా... మధ్యాహ్నం భోజనానికి అందరం కలుద్దామా? తర్వాత తయారై సాయంత్రానికి బయలుదేరుదాం” అన్నాడు. “సరే. అలాగే చేద్దాం” అంటూ ఫోన్‌ పెట్టేశాను. “ఏమంటున్నాడు?” అడిగింది ఆమె. “భోజనానికి పిలుస్తున్నాడు.” “సరే. నువ్వు వెళ్లు.. నేను కూడా వచ్చేస్తాను.” నేను నా గదికి తిరిగి వచ్చాను. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేశాం. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం పండుగకు వెళ్లేందుకు తయారయ్యాను. బయటకు వచ్చేసరికి వీరూ కెమెరా సిద్ధం చేసుకుంటున్నాడు. నరేన్ కూడా తయారై వచ్చి కూర్చున్నాడు. రాణీ అప్పుడే తన గది నుంచి బయటకు వచ్చింది. “ఆమె ఇంకా రాలేదా?” అని అడిగాను. “ఇంకా తయారవుతోంది. కాస్త ఓపిక పట్టండి సార్‌!” అన్నాడు నరేన్. అంతలోనే ఆమె గది తలుపు తెరుచుకుంది. నీలిరంగు చీరలో ఆమె బయటకు వచ్చింది. ఆ చీరకు పెద్దగా హంగులేమీ లేవు. చక్కగా సర్దుకున్న జుట్టు, చిన్న బొట్టు, చెవులకు అందమైన జూకాలు. సాధారణమైన అలంకరణే అయినా ఆ చీరలో ఆమె ప్రత్యేకంగా కనిపించింది.

నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఇంతలో వీరూ కెమెరా ఎత్తాడు. “అన్నా, వదినగారూ... ఒక్కసారి అలా నిలబడండి. ఈరోజు మొదటి ఫొటో మీ ఇద్దరిదే.” “ముందు బతుకమ్మ ఫొటోలు తీయాలి. తర్వాత మా ఫొటోలు” అంది ఆమె. “అవి ఎలాగూ తీస్తాను మేడమ్‌. కానీ ఈ క్షణం మళ్లీ రాదు కదా!” అన్నాడు వీరూ. ఆమె నా పక్కన వచ్చి నిలబడింది. వీరూ కెమెరా క్లిక్‌మంది. “ఇప్పుడు పదండి. ఊరంతా మనకోసం ఎదురుచూస్తోంది” అంటూ రాణీ ముందుకు కదిలింది. గెస్ట్‌హౌస్‌ బయట మిత్రులు వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. మేమంతా వాటిలో ఎక్కాం. ఆమె చీర కొంగును సరిచేసుకుంటూ నా పక్కన కూర్చుంది. గ్రామం వైపు మా ప్రయాణం మొదలైంది. ఊరికి చేరేసరికి సాయంత్రపు వెలుతురు మైదానం మీద పరుచుకుంది. వాహనాలు ఆగగానే దూరం నుంచి బతుకమ్మ పాటలు వినిపించాయి. ఊరి మధ్యలోని విశాలమైన ప్రాంగణంలో మహిళలు బతుకమ్మల చుట్టూ వలయాలుగా నిలబడి పాటలు పాడుతున్నారు. రంగురంగుల పూలతో ప్రతి బతుకమ్మ ఓ కళాఖండంలా ఉంది. మహిళల చప్పట్లు, పాటల లయతో ఆ ప్రాంగణమంతా సందడిగా ఉంది. కారు దిగగానే ఆమె చూపు అటువైపే నిలిచిపోయింది. “దగ్గరికి వెళ్లి చూద్దాం.

పదండి.” అన్నాడు నరేన్. మేమంతా ప్రాంగణం వైపు నడిచాం. అక్కడి మహిళలు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. ఆమెను చూసి ఒక పెద్దావిడ దగ్గరకు వచ్చింది. “ఏ ఊరమ్మా మీది?” “హైదరాబాద్‌ అమ్మా” అంది ఆమె నవ్వుతూ. “మాతో బతుకమ్మ ఆడతావా? రా అమ్మా...” ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. నా వైపు చూసి, “రామ్‌... నేను వెళ్తున్నా” అంది. “వెళ్లు. ఇంతదూరం వచ్చింది ఇందుకే కదా!” ఆమెతో పాటే రాణిని కూడా ఆ పెద్దావిడ మహిళల వలయంలోకి తీసుకెళ్లింది. కాసేపటికే వాళ్లు ఆటలో కలిసిపోయారు. నేను కొంచెం దూరంగా నిలబడి చూస్తున్నాను. వీరూ కెమెరా ఆన్ చేసి ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. “అన్నా... అటు చూడండి. మీ ఆవిడ బతుకమ్మలో కలిసిపోయింది. మీరు మాత్రం ఇక్కడ ఒంటరిగా నిలబడ్డారు” అన్నాడు నరేన్ అటపట్టిస్తూ.

“ఆమె ఆనందంగా ఉంటే చాలు. మనం ఇక్కడి నుంచే చూద్దాం” అన్నాను. అంతలో ఆమె పాట మధ్యలో నా వైపు చూసి నవ్వింది. చేతితో దగ్గరకు రమ్మని సైగ చేసింది. నేను తల అడ్డంగా ఊపాను. ఆమె మళ్లీ సైగ చేసింది. ఈసారి ముఖంలో చిన్న అలక. “వెళ్లండి అన్నా... కనీసం దగ్గరికి వెళ్లి నిలబడండి. లేదంటే ఈరోజు మీకు క్లాస్‌ ఉంటుంది” అన్నాడు నరేన్. నేను నవ్వుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్లి కొంచెం దూరంగా నిలబడ్డాను. ఆమె మళ్లీ పాటలో కలిసిపోయింది. పాట ముగిసిన తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చింది. “ఏంటి రామ్‌... ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్‌?” అంది. “నీ ఆట చూస్తున్నాను” “చూసింది చాలు... కాసేపు నాతో ఉండు” అంటూ నా చేయి పట్టుకుని కొంచెం పక్కకు తీసుకెళ్లింది. “ఏం కావాలి బుజ్జీ?” “నువ్వు నా పక్కన ఉండాలి. అంతే!” “ఉన్నానుగా!” “మనిషి ఉండటం వేరు. నాతో ఈ పండుగను ఆస్వాదించడం వేరు.” “అయితే ఏం చేయమంటావ్‌?” “ఏమీ వద్దు. కాసేపు నాతో ఇలాగే ఉండు.” ఆమె నా భుజానికి ఆనుకుంది. చుట్టూ బతుకమ్మ పాటలు వినిపిస్తున్నాయి. ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. “రామ్‌... ఈరోజు చాలా బాగుంది.” “నీకు నచ్చిన చోట, నీకు ఇష్టమైన మనుషుల మధ్య ఉన్నావు కదా!” “అవును.

నువ్వు కూడా ఉన్నావు.” ఆమె నవ్వుతూ నా భుజం మీద తల ఆనించింది. ఆ క్షణం ఎంతసేపు గడిచిందో తెలియదు. “సరే, నేను మళ్లీ ఆటలోకి వెళ్లాలి. నువ్వు ఇక్కడే ఉంటావా?” అంది. “నీకు నచ్చినంతసేపు ఆడు. నేను ఇక్కడే ఉంటాను.” “మధ్యమధ్యలో నన్ను చూస్తూ ఉండు. లేకపోతే అలుగుతాను.” "చిత్తం, తమ ఆజ్ఞ.” నవ్వుతూ నా చేయి వదిలి మళ్లీ మహిళల వలయంలోకి వెళ్లిపోయింది. పాట మొదలైంది. ఆమె చప్పట్లు కొడుతూ మహిళలతో గొంతు కలిపింది. మధ్యలో ఓసారి నా వైపు చూసి నవ్వింది. మళ్లీ తన ప్రపంచంలోకి వెళ్లిపోయింది. నేను మాత్రం ఆమెను చూస్తూ నిలబడిపోయాను. ఆ సాయంత్రం ఆమెకు బతుకమ్మ ఇచ్చిన ఆనందం కంటే, ఆమె ఆనందాన్ని చూస్తూ నేను పొందిన సంతోషమే ఎక్కువ అనిపించింది.


- రామ్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్