Magazines

ఉద్యమాలను నిర్భందించగలరా?

1 గంట క్రితం

Can movements be suppressed?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 3 నిమిషాల చదవడం


జుట్టుపోలుగాడు : ఎన్నికల సిత్రాలు చూడరో నరుడో నరుడా.../ గళమెత్తి పాడరో నరుడో నరుడా...

కేతిగాడు : ఎహె.. పాట మార్చు.. ఎన్నికల కమిషన్‌ ‌సిత్రాలు చూడరో నరుడో నరుడా.../ ఎన్నెన్ని అక్రమాలు కనరో వినరో నరుడా అని పాడుకోవాలి.

జుట్టుపోలుగాడు : అంటే..?

కేతిగాడు : భారత దేశంలో పుట్టిన ప్రతి మనిషికి 18 ఏళ్లు నిండగానే ఓటు హక్కు వుందని, ప్రజాస్వామ్య పాలన నిలబడటానికి ఓటు ఓ బ్రహ్మాస్ర్తమని, ఆ ఓటును ఎవరు ఏ రూపంలో దోచుకున్నా అంతిమంగా ప్రజాస్వామ్యమే కుప్పకూలుతుందని అప్పుడు మన తరాలే కాకుండా భావితరాలు కూడా భయంకర ముప్పును ఎదుర్కోవలసి వస్తుందని ప్రజల్లో నిత్యచైతన్యం కల్గించాలి. అలాంటి పాటలు పాడాలి.

జుట్టుపోలుగాడు : ఆ అక్రమాలు ఏమిటో సవివరంగా వివరించు నాయనా...

కేతిగాడు : ప్రజాస్వామ్యానికి ప్రజల ఓటే పునాది. ఎన్నికలు సక్రమంగా, పారదర్శకంగా జరగాలి. మెజార్టీ వచ్చిన వారు ఎన్నికై ఆయా ప్రభుత్వాలకు, పదవులకు, సఖ్యత్వానికి ప్రాతినిద్యంతో వ్యవహరించాలి. మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియను నిస్పక్షపాతంగా నిర్వహించేలా ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఉండాలి. కమిషన్‌‌కు ఆ విధంగా రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి వున్నది. కానీ అది అలా వ్యవహరించకుండా కేంద్రప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నది.

1. అసలు ఎన్నికల కమిషన్‌ - ఆ సెలక్షన్‌ ‌పద్దతినే కేంద్రం మార్చేసింది. చీఫ్‌ ఎలక్షన్‌ ‌కమిషనర్‌‌ను దేశ ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత కలసి ఉమ్మడిగా నియమించాలి. పరస్పర విశ్వాసంతో పాటు దేశ ప్రజల విశ్వాసం కూడా ఇందులో దాగి వుంది. కానీ ఈ త్రిసభ్య సెలెక్షన్‌ ‌కమిటీ నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమంత్రిని తొలగించి ఆ స్థానంలో మరో కేంద్ర మంత్రిని తీసుకునేలా ప్రక్రియను మార్చేసింది. అప్పుడిక పాలకపక్షం చెప్పినట్టు ఎన్నికల కమిషనర్‌ ‌తైతక్కలాడాల్సిందే కదా..!

2. అలా తప్పులు చేసిన కమిషనర్‌‌ను జీవితకాలం రక్షించేలా, అతగానిపై ఎప్పుడూ ఎలాంటి కేసులు పెట్టరాదని, అతన్నో పుణ్యమూర్తిగా చూడాలంటూ మరో బిల్లు తెచ్చారు.

3. కాగా ఎన్నికలు జరిగిన చోటల్లా ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ ‌మిషన్‌ ఇ.వి.ఎం.లతో ఓట్ల ట్యాంపరింగ్‌ - ‌మార్పిడి. ఉన్న ఓట్ల కంటే అధికంగా పోలైనట్టు చూపడం, పోలింగ్‌ ఓట్లకు - లెక్కపెట్టిన ఓట్లకు పొంతన లేకపోవడం.. ఈ అవకతవకలన్నీ యధాతథంగా జరిగిపోతున్నాయి. వడ్డించేవాడు ‌మనోడైతే ఎక్కడ కూర్చున్నా ఇస్తరి నిండుద్ది అన్నట్టయింది ఈ పోలింగ్‌ ‌తంతు.

4. 2024 ఎన్నికల్లో ఇలాగే 400కు పైగా సీట్లతో అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ తీరా 230కు పడిపోయి ఆంధ్రను టిడిపి, బీహార్‌ ‌జనతాదళ్‌ ఊతకర్రలపై నిలబడాల్సి వచ్చింది. ఇక లాభం లేదనుకుని బరితెగించి ఇప్పుడు ఓట్ల చోరీకి తెగబడ్డారు. తమకు ఓట్లేయరని తెలిసినోళ్లని, తమకు శత్రువులుగా భావిచే ముస్లిం, క్రైస్తవ, బడుగు జాతి దళితులని, ప్రశ్నించలేని అమాయక ఆదివాసులను, ఇతరులను ఓట్ల జాబితా నుండి తొలగించేందుకు నానా తప్పుడు పద్ధతులు చేపట్టారు. ఆ విధంగా ఇప్పటికి పదమూడున్నర కోట్ల మంది ఓట్లు గల్లంతైపోయాయి. ఇతర దేశాల చొరబాటుదార్లను తొలగించేందుకే మేమీ పద్ధతులు చేపట్టామని బుకాయించారు. మరో పక్క దొంగ ఓట్లు వేయించుకోవాలనే దుగ్దతో సరైన పేరు చిరునామా లేని అనామకులను పెద్ద ఎత్తున జాబితాలో ఎక్కించారు. దీనికి వాళ్లు పెట్టుకున్న ముద్దుపేరు సర్‌ - ‌ప్రత్యేక తనిఖీ ప్రక్రియ. చొరబాటు దార్లు ఎంతమందో కచ్చితంగా ఇంతవరకు తెలపలేదు. మొత్తం ఈ ‘సర్‌’ నాటకాన్ని రాహుల్‌‌గాంధీ ఆధారాలతో సహా మీడియా ముందు రుజువు చేసినా ఏ మాత్రం చలించకుండా కొట్టి పారేశారు. తీరా ఇప్పుడు జర్నలిస్టు రితికా చోప్రా ఇండియన్‌ ఎక్స్‌‌ప్రెస్‌‌లో కమిషన్‌‌లోని లుకలుకలతో సహా మొత్తం భాగోతాన్ని బయటపెట్టడంతో చీఫ్‌ ‌కమిషనర్‌ ‌జ్ఞానేశ్వర్‌ ‌కన్నంలో పడ్డ దొంగలా అడ్డంగా దొరికిపోయాడు. ఫారం 6,7 పత్రాలను ప్రవేశపెడితే అవి రాజ్యాంగ విరుద్దమని కమిషన్‌‌లో తక్కిన ఇద్దరు సభ్యులు అభ్యంతరాలు తెలపడం, వాటికి తమ ఆమోదం లేదని సుప్రీం కోర్టు ప్రకటించడంతో గుడ్లు తేలేయడం తప్పలేదు. అలాగే ఆ కంప్యూటర్‌ ‌సాఫ్ట్‌‌వేర్‌ ‌కూడా కుట్రపూరితంగా రూపొందినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడడంతో మింగాలేక కక్కాలేక ఇప్పుడిక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

జుట్టుపోలుగాడు : ఎవరు?

కేతిగాడు : ఇంకా అర్థం కాలేదా తిక్కలోడా... తైతక్కలాడినోడు. ఆడించినోళ్లు.

జట్టుపోలుగాడు : కిం. కర్తవ్యం?

కేతిగాడు : అందుకేగా జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌రాజీనామా చేయాలని, సర్‌ ‌ప్రక్రియను సమూలంగా రద్దు చేయాలని, బ్యాలట్‌ ‌పత్రాలతోనే ఇక ఎన్నికలు నిర్వహించాలని, అటు జెన్‌ ‌జీ యువతతో పాటు ఇటు ప్రతిపక్షాలు అన్నీ కలిసి ముక్త కంఠంతో ఒక్క పెట్టున ఢిల్లీ నుండి గల్లీదాకా కదం తొక్కుతున్నాయి.

బంగారక్క : మా బాగా చెప్పావ్‌ ‌మావా. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమాన్ని మరో స్వాతంత్రోద్యమంగా పోలుస్తూ దేశ దేశాల పత్రికలు, మీడియా సంస్థలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఎందుకంటే లక్షలాది మంది పాల్గొంటున్నా ఎక్కడా శాంతి భద్రతలకు చిన్న మెత్తు విఘాతం కల్గడం లేదు. నహీ డరేంగి, నహీ డరేంగి (భయపడబోం, భయపడబోం) అంటూ ఆబాల గోపాలం నడివీధుల్లోకి వచ్చి నినదిస్తున్నది. కాగా ఆరెస్సెస్‌ ‌గూండాలు పోలీసుల అండతో ఉద్యమకారులపై చేస్తున్న దౌర్జన్యం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆడపిల్లల బట్టలు చించడం, పోలీసు యూనిఫాం ముసుగులో దాడులు చేయడం చూసి లోకం నివ్వెరపోతుంది. ఆరెస్సెస్‌ - ‌బిజెపోళ్లకు అటు స్వాతంత్ర్యోద్యమంలోనూ, ఇటు సాయుధ తెలంగాణ పోరాటంలోనూ పాల్గొన్న చరిత్ర రవ్వంత కూడా లేదు. రాముని పేరు చెప్పి, మతచిచ్చు రగిల్చి అప్పనంగా అధికారంలోకి వచ్చారు. అందుకే వారికి ఉద్యమాలన్నా, పోరాటాలన్నా కంటగింపు. కొందరు నేతల్ని, వ్యక్తుల్ని భయపెట్టి నిర్బంధించవచ్చు. ఉద్యమాలను ఎలా నిర్బంధిస్తారు? సత్యం - అహింస పరమోధర్మహ అని ప్రపంచానికి చాటిన పవిత్ర భారతదేశం మనది. ఈ కుట్రలు కుతంత్రాలు నీచులు చేసే బుద్భుదప్రాయలని వేరే చెప్పాలా..?

కె.శాంతారావు, 99597 45723

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్