జుట్టుపోలుగాడు : మావా కేతిగా! గీ సెల్‌ఫోన్ డేంజర్ నుండి మనం మన పిల్లల్ని కాపాడలేమా?
కేతిగాడు : డేంజరేందిరా?
జుట్టుపోలుగాడు : లేకపోతే ఏంది. నెలల పిలగాడు కూడా సెల్ ఇవ్వకపోతే ఏడుస్తున్నాడు. బువ్వ తినడం లేదు, పాలు తాగడం లేదు. అంతగా అలవాటు పడుతున్నాడు.
కేతిగాడు : అలవాటు పడ్తున్నాడా? అలవాటు చేస్తున్నామా..?
జుట్టుపోలుగాడు : అదేలేరా.. గా పిల్లల మారాం మాన్పించేందుకు తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు. అయినా గా సెల్ ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయిందనుకో.
కేతిగాడు : ఇక్కడే ఈ తల్లిదండ్రులు, పెద్దలు సెల్‌ఫోన్ విషయంలో పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. టెక్నాలజీని మంచి కంటే చెడుకే ఎక్కువ వాడటం జరుగుతున్నది. స్లో పాయిజన్‌లా అది మనల్ని హరించివేస్తున్నది.
జుట్టుపోలుగాడు : ఎలా?
కేతిగాడు : కంప్యూటర్, స్కానింగ్, సెల్‌ఫోన్, టచ్‌స్ర్కీన్, డిజిటల్ ఎ.ఐ., చాట్‌జిపిటి, హ్యూమనైడ్ రోబో... ఇలా ఎన్నెన్నో మార్పులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఇక ముందు కూడా వస్తాయి. స్కానింగ్ ద్వారా కడుపులో పిండం ఆడా, మగ తెలుసుకుని ఆడపిండం అయితే బ్రూణ హత్యలకు తెగబడ్డాం. ఎంతనీచం? ఎంత పాపం? అలాగే టచ్ స్ర్కీన్ సెల్‌ఫోన్, మన అభిరుచులు, ఆలోచనలు మన ద్వారానే అది క్షణాల్లో పసిగట్టి మనల్ని ఆకట్టుకునేలా తిరిగి వాటినే పదేపదే మార్చి పంపుతుంది. అలాంటి రీల్స్, యాప్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి మీద పడ్తుంటాయి. ఆ సెల్‌ఫోన్ నిర్మాణమే అలా వుంటుంది. అప్పుడు నీవు దానితో ఆడుకోవు. అదే నిన్ను ఆడిస్తుంది. అందుకే పిల్లలు చిన్నప్పటి నుండే దానికి బానిసైపోతున్నారు. కళ్లు, చెవులు దానికి అప్పగించి మిగతా శరీరాన్ని, అవయవాలను అచేతనంగా పడేస్తున్నారు. ఎక్కువ భాగం పనిచేయకపోతే మెదడు మొద్దుబారిపోద్ది. కళ్లద్దాలు రావడం, ఊబకాయం పెరగడం, సరిగా మాట్లాడలేకపోవడం, స్పందన కోల్పోవడం, ఊరికే అలసిపోవడం, లేదా పెంకిగా మారడం... ఇలాంటి అవలక్షణాలు ఒకదానివెంట ఒకటి జరిగిపోతున్నాయి. అంతేకాదు సోషల్‌మీడియా ద్వారా కిశోర వయసు (ఎడాల్సెంట్ ఏజ్ 13- 19సంవత్సరాలు) పిల్లలు పెడదారిలో పడ్తున్నారు. సాంస్కృతిక నేరాలు పెరుగుతున్నాయి. అందుకే సెల్ పిల్లలకు నరకకూపంలా (హెల్) మారిందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జుట్టుపోలుగాడు : మరెలా?
కేతిగాడు : అందుకే ఆస్ట్రేలియా, బ్రెజిల్, డెన్మార్క్ వంటి కొన్ని దేశాలు పిల్లల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రకరకాల పద్ధతుల్లో పిల్లలను సెల్‌ఫోన్ నుండి దూరం చేస్తున్నాయి.
జుట్టుపోలుగాడు : అంటే..?
కేతిగాడు : అలాంటి ప్రమాదకర ఫోన్ ఎకౌంట్లను, యాప్‌లను నిషేధించడం, నియంత్రించడం, లేదా క్రమబద్దీకరించడం చేస్తున్నాయి. అయితే అవినీతి సర్వాంతర్యామిగా మారిన పరిస్థితుల్లో వాటి అమలుకూడా కష్టసాధ్యమవుతున్నది.
జుట్టుపోలుగాడు : బడికెళ్లే పిల్లలకు సెల్‌ఫోన్ ఇప్పుడు తప్పనిసరైందిగా. ఆన్‌లైన్ క్లాసులు, పరీక్షలు, హోమ్‌వర్కులు, రిపోర్ట్‌లు అన్నీ దాంతోనే ముడిపడి వున్నాయిగా.
కేతిగాడు : అవునవును. నీవన్నది నిజమే కానీ, సెల్‌ఫోన్ యూజ్ కంటే మిస్‌యూజ్ పెరిగిపోతున్నదనేదే బాధ. పిల్లలను నేరాల ఊబిలోకి దించేలా ప్రమాదకర ఎకౌంట్స్, యాప్స్, పోర్న్ (అస్లీల) వీడియోలు నానాటికి ఎక్కువవుతున్నాయి. లైంగిక నేరాలు, బెట్టింగ్స్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వ్యాప్తి... ఒకటేమిటి? ఇలా ఓ భయంకరమైన ఉచ్చు పిల్లలపై పడ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న ఆధునిక ప్రమాదం ఇది. అందుకే సెల్‌ఫోన్‌తో ఇంటి పట్టున వున్న పిల్లలు క్షేమంగా వున్నారనే భావన కలగడం లేదు. ఒంటరైపోతూ, మానసిక వేదనకు గురౌతూ ఎప్పుడు ఏ అఘాయిత్యం చేస్తారో, లేదా చేసుకుంటారో అన్న భయం పెద్దల్ని వెంటాడుతుంది.
జుట్టుపోలుగాడు : ఎహె, కాలికేస్తే వేలికేస్తావ్, వేలికేస్తే కాలికేస్తావ్. పరిష్కారం చెప్పమంటే ఏదేదో మాట్లాడతావేంది?
బంగారక్క : పరిష్కారం అంత తేలికారా... ప్రభుత్వాలు ప్రజల క్షేమం పట్టించుకోనప్పుడు ప్రజలే మేల్కోవాలి. సంక్షోభం నుండి స్పష్టత వైపు రావడానికి మథనం జరగాలి. పౌర సమాజం నిత్య చైతన్యంతో ఉద్యమాలు నిర్వహించాలి. పిల్లల కోసం ముందుకు రావాలి. టెక్నికల్‌గా ఎంత పెద్ద చదువులు చదివినా, ప్రభుత్వంలో ఎంత పెద్ద పదవులు వెలగబెట్టినా సార్థకత ముఖ్యం. ‘చదువది ఎంత కల్గినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు’ అని భాస్కర శతకకారుడు ఏనాడో చెప్పాడు కదా. పిల్లల్ని పీక్కుతినే డేంజరస్ ఎడల్ట్ కంటెంట్ ప్రొడక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలోకి రాకుండా బేషరతుగా నిషేధించాలి. ఆ నేరస్థులను కఠినంగా శిక్షించాలి. రెండో మాటకు తావులేదు. కానీ దుర్మార్గ దోపిడీ కార్పొరేట్ వ్యవస్థకు సాగిలపడిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు పిల్లలకు న్యాయం జరగదు. ఇప్పుడు జరుగుతున్నదదే. మన వేళ్లతో మన కళ్లు పొడుచుకునేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. పిల్లలు సమాజ సంపద. మంచి విలువలు గల సమాజం ఆకాశం నుండి అకస్మాత్తుగా ఊడిపడదు. చిన్నప్పడి నుండి బాధ్యతగా మనమే నిర్మించుకోవాలి. సెల్‌ఫోన్ కంటెంట్ ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు పెద్దలు తల్లిదండ్రులు తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు పిల్లల్ని దూరంగా వుంచాలి. మన పిల్లలే మన దేశ భవిత అని గుర్తెరగాలి.
కె.శాంతారావు, 99597 45723






కామెంట్‌లు (0)