రవీంద్రనాథ్ ఠాగూర్ ఫొటో శుభ్రంగా తుడుస్తు కిటికిలో నుండి మనవడి వైపు చుశాను. వాడు గోటికాయలను గురిచూసి కొడుతు నావైపు చూస్తూ పండ్లికిలించిండు. వాడి ముందు పళ్ళు మొత్తం పోవడంతో అందరు వాడిని ఆటపట్టిస్తూ గేలిచేస్తున్నారని అప్పుడప్పుడు నా గదిలోకొచ్చి చెప్పుకునేవాడు. శుష్కించిన శరీరం సహకరించకున్నా, ఉదయం పాలు, పేపర్ వేసే వారి దగ్గర నుండి రాత్రి తిరిగే గూర్ఖా వరకు నా గది కిటికి నాకు ప్రపంచాన్ని వినయంగా విజయగర్వంతో చూపిస్తుంది.
అప్పుడప్పుడు గాలి ఇటుగా వచ్చినప్పుడు ఈ కిటికి రెక్కలు టప టప కొట్టుకుంటూ వాటికవే పరవశించి పోతూ నన్ను చూడమని గోల చేస్తాయి. మనిషి బతికినంత కాలం యుద్ధం చేయవలసిందే. బాల్యం ఆట పాటలతో గడిచింది. ఆ తరువాత కాలమే నాకు అనేక పాఠాలు నేర్పింది. అప్పుడు మొదలైన సంఘర్షణ యుద్ధం తనువు పండిపోయినా అలానే సాగిపోతుంది.
ఠాగూర్ నా కండ్లలోకి చూసి ఏదో చెప్పబోతున్నట్టు అనిపించింది. నేను ఫొటోను స్పృశించి చెప్పమన్నట్టు చూశాను. నా చూపుకు పక్కనే ఉన్న బాపుజీ ఆప్యాయంగా నవ్విండు. దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన ఘట్టాలను నేటి పిల్లలకు ప్రత్యేకంగా చెప్పమంటున్నారు వాళ్ళు. అయినా నేటి పిల్లలు మన మాట వింటారా చెప్పండి. మనం ఎడ్డం అంటే వాళ్ళు తెడ్డం అంటారు. ఈ సందేహం మనసును ఎప్పటి నుండో తొలిచేస్తుంది. ‘మై ఎక్స్పరిమెంట్ విత్ ట్రూత్’ మహాత్మా గాంధీ రాసిన పుస్తకం ఎన్నోసార్లు పెద్దబ్బాయికి చదువమంటే వీలు చూసుకుని చదువుతానంటాడే గాని చదివిందిలేదు. కంఫ్యూటర్ యుగం, అంత తీరికెక్కడిది.
రాను రాను పుస్తకాలు చదవడం కూడా నామోషీగా ఫీలవుతున్నారు నేటి యువత. కట్టే.. కొట్టే.. తెచ్చెలాగ ఉండాలంటే విజ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి. అదే సాహిత్యం పట్ల అమితాసక్తి వున్న కోడలు మాత్రం ఇప్పటికే మూడుసార్లు చదివి పక్కన పెట్టింది. ఇప్పుడు ఠాగూర్ గీతాంజలి, తిలక్ అమృతం కురిసిన రాత్రి తీసుకుని చదివింది. నిన్న ఎవరో టివిలో ఆగష్టు 15 సందర్భంగా కొన్ని స్కూళ్ళు, కాలేజీలు, పార్కుల వద్ద స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల ఫొటోలను చూపించి అందులో వున్నవారి పేరును అడుగుతుంది యాంకర్, ఎవ్వరు సరైన సమాధానం చెప్పలేక పోయిండ్రు. ఈ రోజు నా మనసు ఎందుకో చాలా బాధగా వుంది. అడిగిన ఆవిడకు మనసులో చాలా సార్లు కృతజ్ఞతలు చెప్పాను. ఎంత మంది ప్రాణాల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యం.
పిల్లలకు ప్రపంచ విజ్ఞానం అందిస్తున్నామని అనుకుంటున్నారే గాని ఇలాంటి విషయాలు ఎవరు చెప్పాలి? కార్పోరేట్ స్కూళ్లలో లక్షలకు లక్షలు డొనేషన్లని, ఫీజులని గుంజుతున్నారే గానీ ఎక్కడా సరైన విద్యను నేటి పిల్లలకు అందించడం లేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవలసిన చదువు మోపెడు పుస్తకాలతో సాగుతుంది. ఆ బరువును మోయలేక ఎంత మంది పిల్లల నడుములు ఒంగిపోయినవో తరువాత వాళ్ళ నడకలో చూడవచ్చు.
‘‘తాతయ్య కాలి పట్టి ఊడింది పెట్టవా?’’ నా మనవరాలు ప్రకృతి నా దగ్గరకు వచ్చింది.
‘‘ఎవరు తాతయ్య వీళ్ళు ఆగస్టు15 రోజు జెండా గద్దెవద్ద ఫొటోలు పెట్టారు గాని ఎవరూ చెప్పలేదు’’ ఫొటో పై చేయిపెట్టి అడిగింది ప్రకృతి.
‘‘ఇయన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అందరు ప్రేమగా బాపు అంటారమ్మా మీ స్కూల్లో చెప్పలేదా?’’ కాలి పట్టిని పెట్టి తలపై ప్రేమగా నిమిరుతు అడిగాను.
మనవరాలు ప్రకృతి పెదవి విరిచింది.
అప్పుడర్ధమైంది తనకు ఏమీ తెలియదని. నేను గదిలో గోడకు పెట్టిన స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారందరి ఫొటోలను చూపిస్తు వారి గురించి చెబుతుంటే ప్రకృతి అనేక ప్రశ్నలు వేస్తూ ఆసక్తిగా తెలుసుకుంది. కిటికి రెక్క చప్పుడు చేసింది, బయట క్లైమేట్ చేంజ్ అయింది. చదురు మొదురు వర్షం మెల్లగా భూ తల్లిని తాకిందేమో మట్టి పరమళాన్ని గాలి స్వీకరించగానే కిటికి మెల్లగా నాకు ఉప్పందించింది. నేను ఆ ప్రేమకు మురిసిపోయాను. చినుకులను చూసి మనవరాలు ప్రకృతి బయటకు వెళ్ళి వర్షంలో వాన.. వాన వల్లప్ప.. పాట పాడుతుంది. వర్షం పిల్లలకే గాదు పెద్దలకు ఇష్టమే గదా!
‘‘ప్రకృతి.. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది లోపలికి రా’’ పెద్దోడు పాపను కేకేసి పిలిచిండు.
‘‘తడవనీయండి దానికి సరదా వుంటుంది. స్కూల్లో ఎలాగు ఆడకోనీయరు, తడిస్తే ఎలా వుంటుందో తెలియాలి గదా, ఎప్పుడూ నాలుగు గోడల మధ్య బందిస్తే వాళ్ళకు ఈ వాతవరణ పరిస్ఠితులు ఎలా అర్థం అవుతాయి’’ మేడ మీది బట్టలు తీసుకోని వస్తూ అంది సుభద్ర.
‘‘బాగా చెప్పావమ్మా’’ కోడలిని ప్రశంసిస్తూ అన్నాను.
‘‘ఇప్పటికే మనం మన పెద్దలమాటను పెడచెవిన పెట్టేసరికి కాలం తన గతినిమార్చి పయనిస్తుంది’’ కాస్త సమాజం మీద కోపంతో అంది కోడలు సుభద్ర.
‘‘మనం పెద్దల మాట పెడచెవిన పెట్టిందేంటో’’ కాస్త వెటకారంగాను కోపంగా అన్నాడు మా అబ్బాయి అరవింద్.
‘‘మనం అంటే నువ్వే కాదు సమాజంలో మనమందరం అరవింద్. అడవులను నరకడం, ప్లాస్టిక్ వాడకం, పారిశ్రామీకరణ పేరుతో ఊర్లను నాశనం చేయటం మనిషి చేస్తున్న పెద్ద తప్పిదం. దీనివల్ల వాతావరణం తన పరిస్థితులను మార్చుకుంటుంది’’ నేను నాలుగు మాటలు కోడలు మనసు చదివి చెప్పాను.
‘‘నిజం చెప్పారు మామయ్యా’’ నవ్వుతూ అంది సుభద్ర.
‘‘మీరు చెప్పింది వింటే మనిషే గాదు ఏ గ్రామము, పట్టణం అభివృద్ధి చెందదు’’ ల్యాప్ టాప్లో వర్క్ చేసుకుంటూ అన్నాడు పెద్దోడు.
‘‘అంటే మీ ఉద్దేశం?’’ కోడలు నొసలు చిట్లిస్తూ అంది.
‘‘ఎవరికి ఉపాధి వుండదు’’ తలపైకెత్తి అన్నాడు.
‘‘మీరన్నది నిజమే కావచ్చు కాని కూర్చున్న కొమ్మలను నరుక్కోవడం మన తప్పే గదా’’.. ‘‘అంటే’’.
‘‘ఈ వాతవరణం కాలుష్యం చేయడం, సహజ వనరులను విధ్వంసం చేయడం తప్పుకాదంటారా? ఒక్కసారి ఆలోచించండి?’’ కోడలు అబ్బాయికి క్లాస్ ఇస్తుంది.
వారి వాదనకు ఆకాశం కూడా బెదిరిపోయిందేమో! ఉరుము ఉరిమి ఎక్కడో పిడుగుపడ్డట్టున్నది. భయంతో ప్రకృతి ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. దాని వెనకాలే మా మనవడు కూడా వచ్చిండు. మెల్లగా చీకటి మబ్బులు కమ్ముకున్నాయి. అందరం భోజనాలు చేసి పడుకున్నాం. అర్ధరాత్రి ఎప్పుడు అందుకుందో జోరుగా వర్షం తెల్లారేసరికి తుఫానుగా మారింది. నన్ను నిత్యం పలకరించే కిటికి టప టప కొట్టుకుంటు నన్ను నిద్రలేపింది. బయట అహాకారపు ఆర్ధనాథాలు వినిపిస్తున్నాయి.
ఊరిపక్క కాలువ పెరిగి తన దిశను మార్చుకుని ఊరు మీద బడ్డది. పరిస్థితి అర్ధమైన నేను కింది గదిలో పడుకున్న పెద్దోడిని, కోడలిని లేపాను. అప్పటికే వాళ్ళ మంచాల వరకు నీరు వచ్చి చేరింది, వాళ్ళ బెడ్రూమే కాక అన్ని గదులలో వరదనీరు చేరింది. ఉప్పు పప్పుతో సహా అన్ని నీళ్లల్లో వున్నాయి.
‘‘మామయ్య ఈ చిన్నోడిని, ప్రకృతిని తీసుకుని మీరు పైకెల్లండి మేం వస్తాము’’ అంటూ పిల్లలను అందించారు.
ప్రకృతి నిద్రలేచింది, పిల్లవాడే వర్షం మీద పడేసరికి ఆ భయానక వాతవరణంను చూసి ఏడుస్తున్నాడు.
‘‘పెద్దోడా.. ఏం చేస్తున్నార్రా తొందరగా రండి’’ వారిని పిలిచాను.
వాళ్ళు పిల్లల కోసం గొడుగు, కవర్లను తీసుకుని వచ్చారు. అప్పటికే కొందరు బంగ్లాలపైకెక్కారు, పక్కింటి పరందామయ్య మేడ పైకి రాలేక అవస్థ పడుతున్నాడు. పాపం తనకి ఈ మధ్యనే కాలు విరిగింది. పెద్దోడు, కోడలు అతనికి చేయందించారు. చుట్టూ చాలా మంది ఇండ్ల పైకెక్కారు, కొందరు చెట్లకొమ్మలపైన తల దాచుకున్నారు, వరద పైపైకి మెల్లగా మా రెండో అంతస్తుకు చేరవస్తుంది. నేను తెలిసిన మిత్రులకు ఫోన్ చేశాను. అబ్బాయి, కోడలు ఊర్లో అందరినీ పిలుస్తు ఒక్కొక్కరికి మేడ పైకి ఎక్కడానికి చేయందిస్తున్నారు, ఊరు నదిలా మారింది.
‘‘మామయ్య ఎవరికి కాల్ చేసిండ్లు’’ ఆ వరద శబ్ధంలో చిన్నగా వినిపించింది కోడలు గొంతు.
‘‘రిపోర్టర్ మల్లిక్కి చేశానమ్మా’’ అంటూ కేక వేశాను. పిల్లలు భయంతో వణికిపోతూ ఏడుస్తున్నారు, పశువులు ఎక్కడివక్కడ కొట్టుకొని పోయినాయి.
ఆకాశంలో మెరుపు మెరిసి ఎక్కడో మళ్ళీ పిడుగు పడిన శబ్ధానికి భయపడి పిల్లలందరు మమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు.
మల్లిక్ వీడియో కాల్ చేసిండు. పెద్దోడు ఫోన్ తీసుకుని అక్కడున్న వారందరిని చూపించాడు, అధికారులకు సమాచారమిస్తానన్నాడు. అప్పటికే మీడియా డ్రోన్ కెమెరాలతో ఊరును, చుట్టు పరిసరాలను చిత్రీకరిస్తున్నారు.
‘‘పెద్దోడా చిన్నోడికి కాల్ చేసి ఎలా వున్నారో తెలుసుకో’’ అన్నాను.
రాత్రంత కరెంటు లేక ఎవరి సెల్ ఫోన్లలోను చార్జింగ్ లేదు. వరదబీభత్సంలో ఒక రోజు.. పగవాడికి కూడా రావద్దు దేవుడా అనుకుంటూ పిల్లలను దగ్గరకు తీసుకుని గొడుగు పట్టాను, చలికి పిల్లలు వణికిపోతున్నారు, కొందరు ఆకలి అంటున్నారు. ఇది కల, నిజమో తెలియడం లేదు. చెట్టుపై నిల్చున్న మురళి కొమ్మ విరగడంతో వరదలో పడి కొట్టుకుపోతున్నాడు. ‘‘అయ్యో దేవుడా! చూస్తుండగానే ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోబోతుందే అతన్ని రక్షించేవారే లేరా?’’ అనుకుంటుండగా..
‘‘నాన్న మురళి కొట్టుకుపోతూన్నాడు’’ పెద్దోడు అరుస్తున్నాడు.
చిన్నప్పటి నుండి ఇద్దరు మంచి స్నేహితులు. పెద్దోడికి పోలియోసోకి ఓ కాలు నడవరాకుండా పోయింది. ఊర్లో కొందరు వాడిని కుంటోడా! అన్నప్పుడల్లా గొడవకు దిగి వాళ్ళతో పోట్లాడేవాడు. నేను ఆలోచించేలోపే పెద్దోడు ఓ పెద్ద తాడు సహాయంతో వరదలోకి దూకిండు. నేను నీర్ఘాంతపోయి స్థానువుల చూస్తున్నాను.
అందరు హాహా కారాలు చేస్తున్నారు. పెద్దోడు వేగంగా ఈదుకుంటువెళ్ళి మురళి చేయందుకున్నాడు. తన బలాన్నంతా కూడదీసుకుని మురళిని బిల్డింగ్ మెట్లదాకా తీసుకుని వచ్చాడు. మురళి పెద్దోడిని హత్తుకుని ఏడ్చాడు. నిన్నటి వరకు ఎగతాళి చేసిన వారందరు కూడా పెద్దోడిని దగ్గరకు తీసుకుని అభినందించారు.
హెలికాప్టర్ ఆకాశంలో చెక్కర్లు కొడుతుంది. ఆర్మీ వాళ్ళు మెల్లగా తాడు సహాయంతో దిగి ఒక్కొక్కరిని బయట పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. కలెక్టర్, అధికారులు ఒక్కొక్కరిని పలకరిస్తుంటే అందరం బోరుమన్నాము. వాళ్ళు ఆహరపొట్లాలను అందించి అక్కడున్న అధికారులకు కలెక్టర్ సూచనలిచ్చి వెళ్ళాడు.
మెల్లగా వర్షం శాంతించింది. వరద గోదావరి ఉధృతి తగ్గగానే మేము ఇండ్లవైపు పరుగు తీశాము. మమ్మల్ని కాపాడిన మీడియా వాళ్లకు అధికారులకు కృతజ్ఞతలు చెప్పి గల్లంతైన వారి కోసం ఆరా తీశాం.
కొందరింట్లో ఒకరు లేదా ఇద్దరు కొందరు కుటుంబానికి కుటుంబం చెల్లాచెదరై గల్లంతైనారు. ఒకరిద్దరి శవాలు మాత్రమే దొరికినాయి. పశువులన్నీ చనిపోయాయి, పొలాలన్నీ మేటబెట్టినాయి. ఒక్కొక్కరి బంధువులు, స్నేహితులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు వారి శక్తి కొద్ది సహాయం చేశారు. అతివృష్టి మా బతుకులమీద దెబ్బకొట్టింది. హామిలిచ్చిన నాయకులు జాడలేకుండా పోయిండ్లు. కాలువకు మరమ్మత్తులు చేసి బ్రిడ్జి కడితే ఈ బాధ వుండేదే కాదు. అందరు ఎవరికి వారు అనుకున్నామే తప్ప ఎవరిని నిందించను లేదు. ప్రకృతికి కోపం వస్తే ఎలా వుంటుందో పెద్దోడు ఇప్పుడు అర్ధం చేసుకున్నట్టున్నాడు.
నేను నాకు ప్రపంచాన్ని చూపించే కిటికికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాను. మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా వుండడానికి వంతెన కోసం మావంతు ప్రయత్నం మేం చేశాము. కాలం గడిచే కొద్ది సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని అలోచించి పిల్లలందరిని ఒక్కచోటుకు చేర్చి దేశనాయకుల చరిత్రను, ప్రకృతి వైపరిత్యాలను ఎలా ఎదుర్కోవాలి, జీవితంలోని ఒడి దుడుకులను ఓర్చుకుంటూ ఎలా ముందుకు సాగాలో నేను, పెద్దోడు, కోడలు బోధిస్తుంటే, ఈ రోజు పెద్దలు కూడా మా సముహంలో భాగం అయ్యారు.
ఇప్పుడు నా గది అనేక చర్చలకు వేదికైంది. టపటపామని కొట్టుకుంటున్న కిటికీ మళ్ళీ ఏ సందేశం ఇస్తుందో అని వాలు కుర్చీలో కూర్చుండి చూస్తూన్నాను.
వజ్జీరు ప్రదీప్, 9989562991






కామెంట్లు (0)