Magazines

పని మనిషి..!!

4 రోజుల క్రితం

Domestic worker
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 6 నిమిషాల చదవడం

‘ఆఫీస్‌కి టైమ్ అవుతుంది. లేట్ అయితే బాస్‌తో చివాట్లు, ఆయనను భరించడం చాలా కష్టం. బాస్ మాకు ఆఫీస్‌లో పులి, ఇంట్లో పిల్లి.. ఇంట్లో ఆవిడా మీద కోపం ఆమె మీద చూపలేక మాపై చూయిస్తూ ఉంటాడు. కానీ మనిషి మాత్రం మంచోడు.. కొంచం పొగడ్తలకు లొంగిపోతాడు. అయినా ఒక్కొక్కసారి తట్టుకోవడం కష్టం. సాయంత్రం పిలిచి, తిట్టిన తిట్లకు అర్థం చెప్పి నవ్విస్తూ ఉంటాడు. అవసరంలో ఆదుకునే మనిషి. ఎంతో కఠినమైనా ఈ వృత్తిలో మానవత్వం కలిగిన మంచి మనిషి. అయినా ఏదో సాకు చెప్పి ఆలస్యంగా వచ్చే వాళ్లకు మాత్రం యమధర్మరాజు’ అని లోలోపల అనుకుంటున్నాడు జగన్.

అతడు పనిచేసే ఆఫీస్ హైటెక్ సిటీలో.. ఉండేది బాలానగర్‌లో. రోజు బైక్ మీద రైడింగ్. ఒకటే టెన్షన్. ఇంకా పనిమనిషి రాలేదు. పొద్దున్నే వస్తుంది.. తన పని తను చేసుకునే రకం. అవసరమైతే ఒక గంట ఎక్కువే చేస్తోంది. అందుకే అందరికి ఆమంటే ఇష్టం. ప్రతి నెల టైమ్‌కి ఆమె జీతం ఇస్తూ.. ఏదైనా పండుగ వస్తే స్పెషల్ గిఫ్ట్ ఇస్తాం. కానీ ఈరోజు ఇప్పటి వరకు ఆమె రాలేదంటే ఎదో జరగరానిది జరుగుతుంది అనే భయం పట్టుకుంది. ఈరోజు బాస్ ముందు తల దించుకోవడం ఊహించుకుంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం, అలీ మధ్య జరిగిన సిన్ లాగా ఉంది జగన్‌కి.

సమయం 9 గంటలు అవుతుంది. పాప, బాబు, స్కూల్‌ బస్సులో స్కూల్‌కి వెళ్లారు. జగన్ భార్యకి కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్. పిల్లలకు లంచ్ బాక్స్ సర్ది, టిఫిన్ బాక్స్ తీసుకోని మార్నింగ్ 8గంటలకు ఆటోలో వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిని, లంచ్ బాక్స్ తీసుకోని రోజూ 9 గంటలకు వెళతాడు జగన్‌. కరెక్ట్‌గా 9.45కి ఆఫీస్‌లో ఉంటాడు. కానీ బాస్ మాత్రం 9.30 కి ఆఫీస్ ఛాంబర్‌లో ఉంటాడు. వచ్చి పోయేవాళ్లను సి సి కెమెరాలో గమనిస్తూ, లేట్‌‌గా వచ్చిన వాళ్ళకి క్లాస్ పీకుతూ ఉంటాడు. అందుకే కంపెనీ మెనేజ్మెంట్ స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తూ ఉంటుంది.

మరి ఈరోజు ఏంటి పనిమనిషి వనజ ఇంకా రాలేదు. లేట్ అయితే ఆఫీస్‌లో బాస్‌తో కష్టం. ఈరోజు ఇంకా ముందు రమ్మన్నాడు కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని. అందరిలో జగన్కే ఎక్కువ ప్రాయారిటీ ఇస్తాడు. వర్క్ సిన్సియర్‌గా చేస్తాడని. కానీ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ రెడీ చెయ్యాలి. ఒక రోజు ముందు చెప్పాడు. దీంతో ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ కూడా ఉంటుందని చెప్పాడు. అవకాశం మళ్ళీ రాదు. పిల్లలు పెరుగుతున్నారు. అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇఎంఐ భారం అవుతుంది. పిల్లల చదువు.. భవిష్యత్తు.. అందుకే జాగ్రత్తగా పని చేసుకుంటూ ఉన్నాడు జగన్. అసలే ఏ.ఐ.కాలం ముంచు కోస్తుంది. అడ్వాన్స్‌గా ఉండాలి వర్క్‌‌లో. ఈ టైమ్‌లో ఇంట్లో అన్నీ చెత్త చెత్తగా ఉన్నాయి. రెండు రోజుల ఎంగిలి గిన్నెలు సయ్యటలాడుతూ ఒక్కదానికొకటి కరచాలనం చేసుకుంటున్నాయి. పని మనిషి రాకకోసం.

ఆమె వర్క్ మాత్రం అద్దంలా ఉంటుంది. ఆమె కడిగిన తర్వాత గిన్నెలు తళతళా మెరుస్తాయి. బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేసి ఆరేసి.. ఇంట్లో ఏవైనా కూర, అన్నం మిగిలినవి ఉంటే ఇంటికి తీసుకెళుతుంది.

***

వనజ కల్వకుర్తి నుండి భర్తతో పాటు వచ్చి ఇండ్లలో పాచి పనులు చేసుకుంటుంది. భర్త అపార్ట్మెంట్ వాచ్‌‌మెన్‌. పిల్లలు ఊళ్లోనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నారు. సెలవులు వస్తే పిల్లలు సిటీకి వస్తారు. జగన్ అపార్ట్మెంట్లో వీరితో పాటు మరో ఇద్దరికి పని చేస్తుంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా. అందరూ ఆమె ప్రవర్తనను ఎంతో ఇష్టపడతారు. సెలవు పెట్టి వెళ్ళేటప్పుడు ముందుగానే చెబుతుంది. అందుకే జాగ్రత్త పడే వారు. ఈరోజు వనజ రాదు అనుకోని తమ పనులు చేసుకునేవారు.

కాని ఈరోజు చెప్పలేదు. కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. అపార్ట్మెంట్‌లో‌ని మిగిలిన ఇద్దరు హౌస్ వైఫ్ లే.. వాళ్ళకి ప్రాబ్లెమ్ లేదు. తన భార్య ఆఫీస్‌ ‌నుండి వచ్చే వరకు ఇల్లంతా కంపు వాసనే.. ఏం చేయాలో అర్థం కాక జగన్ తల వేడెక్కింది. మరోసారి కాఫీ పెట్టుకొని తాగేసాడు. అయినా మనసు కుదుట పడలేదు.

ఒకసారి వనజకి ఫోన్ చేద్దామని.. కాల్ చేసాడు. రింగ్ అవుతుంది, కాని లిఫ్ట్ చెయ్యడం లేదు. మిగిలిన వారికి కూడా కాల్ చేసాడు. వాళ్లు కూడా ‘పొద్దున్నుండి కాల్ చేస్తున్నే వున్నాం.. కాని కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు’ అని రిప్లై ఇచ్చారు.

ఒక్కసారిగా జగన్‌కి గుండెల్లో రాయి పడ్డట్లయింది.

అటు బాస్.. ఇటు పని మనిషి..

అనుకోకుండా ఆమె మీద కోపం సుడిగాలిలా వచ్చేసింది.. ఏదేదో అరిచేసాడు.. తలుపులు మూసేసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది.. లేకుంటే అతని అరుపులకు అపార్ట్మెంట్ అంతా గుమ్మి గుడేవారు.

అయినా ఒక్కరోజు పనిమనిషి రాకపోతే ఇంత టెన్షనా..!? ఆమేమైనా సంతలో కొన్న మేకపిల్లనా..? పని చేస్తేనే కదా డబ్బులు ఇచ్చేది.. నేనొక్కడినే ఇస్తే ఆమె జీవితం గడవడం లేదు కదా.. అందరి ఇండ్లలో పని చేసి పిల్లలను చదివించుకుంటుంది కదా..

మొగుడు మాత్రం వచ్చిన జీతం తాగుడికే ఖర్చు పెడుతున్నాడు. అదేంటని తిరగబడితే ఒళ్ళు హూనం అయ్యేలా కొడతాడు. లేకుంటే ఎవరెవరితోనో సంబంధాలు అంట కడతాడు. అటు పిల్లలు, ఇటు మొగుడు.. ఇంకో వైపు పని చేసే దగ్గర కొందరి వింత చూపులు. అయినా అన్నీ భరిస్తూ అందరి చేత పనిమనిషి అంటే ఇలా ఉండాలి.. అని పేరు తెచ్చుకుంది.. ఎవరైనా కసురుకుంటే నవ్వుతో సమాధానం చెప్పేది.

అయినా ఈరోజు రానంత మాత్రాన ఆమె మీద ఇలా విరుచుకుపడాలా? నాలాగే చాలా మంది చేస్తుంటారు.

ఆమె కూడా మనిషే కదా.. పొట్టకూటి కోసం ఈ పని చేస్తుంది.. అయినా రాకుంటే ఫోన్ చేసి మరీ చెబుతుంది..

సరే చూద్దాం అని భార్య సంగీతకి కాల్ చేసి.. ‘వనజ ఇంకా రాలేదు. నీవు మధ్యాహ్నం వచ్చి ఇల్లు క్లీన్ చేసుకో.. పిల్లలు వచ్చే వరకు నీట్‌గా ఉంటే బాగుంటుంది. పాపకి ఇల్లు ఇలా ఉంటే ఎలర్జీ’ అని చెప్పి రెడీ అయ్యి ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళాడు. ఇంటి ‘కీ’ వాచ్‌‌మెన్‌కి ఇచ్చి.. ‘వనజ వస్తే ఇవ్వు లేదా.. అమ్మ మధ్యాహ్నం వస్తుంది’ అని చెప్పి అతని చేతిలో టిప్పు పెట్టి వెళ్ళాడు జగన్. అప్పుడపుడు టిప్ ఇవ్వడం అతనికి అలవాటే.

సాయంత్రం 6 గంటలకు కాల్.. వనజ నుండి..

‘ఏమైంది వనజ.?. పనికి రాలేదు.. ఏమైంది..? ఎదో గాబరా పడుతున్నావు..?’ అడిగాడు.

‘సార్! మా ఆయనకి పొద్దున్న ఆక్సిడెంట్ అయ్యింది. మీ ఇంటికి బయలు దేరేముందు పక్క అపార్ట్మెంట్ వాచ్ మాన్ వచ్చి ‘రోడ్డు మీద మీ ఆయనకు ఆక్సిడెంట్ అయ్యింది.. కార్ గుద్దేసి వెళ్ళిపోయింది.. మనవాళ్ళు చాయ్ తాగడానికి అక్కడకి వచ్చారు. చాయ్ తాగి వస్తుండగా స్పీడ్‌గా వచ్చిన కార్ మీ ఆయన పైకి దూసుకోచ్చింది. ఆక్సిడెంట్ చేసినతను కారు అక్కడే వదిలేసి తప్పించుకొని పారిపోయాడు. మేము మీ ఆయన్ను గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళుతున్నాం. వెంటనే రా’ అని ఫోన్‌ ‌చేస్తే వెళ్ళాను సార్..

‘చాలా రక్తం పోయింది.. దెబ్బలు బాగా తగిలాయి. ప్రాణానికైతే ముప్పు లేదు.. కానీ కొన్ని రోజులు రెస్ట్ కావాలి.. డబ్బులు కావాలి సార్.. మీకు పని చేసి రుణం తీర్చుకుంటాను..’ వనజకి ఏడుపు ఆగడం లేదు.

ఆమె మాటలు విన్న జగన్‌కి ప్రాణం పోయినట్ల అయింది. పనిమనిషి అయినా ఎవ్వరిదైనా ప్రాణమే.. జీవితమే కదా.. జరిగిందంతా ఓపిగ్గా విని.. ఆమెకు ధైర్యం చెప్పి.. సరే నేను వస్తున్నా.. ఏం వర్రీ కాకు.. డబ్బులకు భయపడకు. నీ భర్త త్వరగా కోలుకుంటాడు’ అని చెప్పి సంగీతకి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అందరికి చెప్పి వనజ కోసం సహాయం అడగమన్నాడు.

కొద్దీ రోజులు గడిచి పోయాయి. అందరి సహకారంతో వనజ భర్త కోలుకున్నాడు. ఈ సంఘటనతో తాగటం మానేసాడు. ఆరోజు కూడా పొద్దున్నే తాగి రోడ్డు మీదకి వచ్చాడు.. తప్పు కార్‌ ‌అతనితే కాదు ఇతనిది కూడా ఉంది.

ఆక్సిడెంట్ చేసి పారిపోయి, తెలిసిన పోలీస్ వారిని తీసుకొచ్చి ట్రీట్మెంట్‌ కోసం కొంత డబ్బులు ఇచ్చి మరికొన్ని డబ్బులు వనజ పిల్లల పేరు మీద ఫిక్స్‌‌డ్‌ డిపాజిట్ చేసి.. కాంప్రమైజ్ చేసుకున్నాడు. వనజ మంచి తనం వల్ల అందరూ సపోర్ట్‌గా నిలబడడంతో మళ్ళీ ఆమె జీవితంలో వెన్నెల చిగురించింది. తనకు ఎంతో సాయం చేసిన జగన్‌‌కు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చింది.

‘మనం పనిమనిషి అని చులకన చేస్తాం. వాళ్ళు కూడా మనుషులే.. అవసరం వాళ్ళది కాదు మనది కూడా. ఇద్దరు పనిచేసినా జీవితం గడవని మధ్యతరగతి వాళ్ళకి వనజ లాంటి పనుషుల అవసరం చాలా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ వాళ్లంటే చిన్నచూపు. పనిమనిషి ముసుగులో కొందరు ఇంట్లో తిష్ట వేసి ఇల్లంతా దోచుకొని, హత్యలు కూడా చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో వనజ లాంటి వాళ్లు ఆదర్శం అవుతారు.. అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మాలాంటి కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటున్నాయి. మాకు వనజ ఓ భరోసా.

ఏది ఏమైన పని మనిషి అని హేళన చేస్తూ, ఒక రోజు పనికి రాకపోతే శాపాలు పెట్టి తిట్లతో సత్కారం చెయ్యడం అనేది మనకు పనికి రాదు.. అవసరం కోసం పని చేస్తారు తప్ప వేరే కాదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మనవాళ్లే. సమాజంలో వారికి కూడా గౌరవం ఇవ్వాల్సిందే’ అని మనసులో అనుకుంటున్న జగన్‌‌కు వనజ కళ్లలోని ఆనందం స్పష్టంగా కనిపించింది.

‘నీకు ఏ అవసరం ఉన్నా.. మేము ఉన్నాం వనజ!.. ఇలా నీ మంచి తనమే నీకు శ్రీ రామ రక్ష’ అంటుండగా

వనజ భర్త వచ్చి జగన్ కాళ్ళకి దండం పెట్టి.. ‘సార్! ఇక నుండి వనజను ప్రేమగా చూసుకుంటా.. నాకోసం, నా పిల్లల కోసం నాలుగిళ్లలో పని మనిషి అయ్యింది. ఆమె మంచి తనం నాకు మళ్లీ బతుకును ఇచ్చింది’ అంటూ వనజ చేతిని తన చేతుల్లోకి తీసుకోని ‘మళ్ళీ ఎప్పుడూ నిన్ను కష్ట పెట్టాను. ఇక మంచిగా ఉంటా.. అందరి ముందు మాట ఇస్తున్నా’ అని భార్యను తీసుకొని ఇంటికి బయలు దేరాడు.

ఇక నుండి వాళ్ల జీవితం పండు వెన్నెల కావాలని కోరుకుంటూ జగన్ కూడా ఇంట్లోకి వెళ్లిపోయాడు.

అప్పుడే భర్తకు వేడి వేడి కాపీ కప్పు అందిస్తూ.. ‘మన వనజ చాలా తెలివి గలది, బాగా చదువుకుంటే పెద్ద ఉద్యోగం చేసేది కదా..! ఎందుకో కొందరి జీవితాలు ఇలా ఉంటాయి. రంగస్థలం సినిమాలో ప్రకాష్ రాజ్ చివరికి హోటల్‌లో గిన్నెలు కడిగే సన్నివేశం గుర్తుకొస్తుందండీ...’ అంటూ అతనికి దగ్గరగా జరిగింది సంగీత.

‘అవును నిజమే.. కొన్ని జీవితాలు అంతే. అవకాశాలు దొరికితే అందరి జీవితాలు బాగుంటాయి. అయినా మనం వనజని పనిమనిషిలా కాకుండా ఒక కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నాం. అందరూ వాళ్ళను అలా భావిస్తే వారి జీవితానికి ఓ జవాబుదారీ తనం ఉంటుంది. నాకన్నా నీకు జాలి ఎక్కువ సంగీత! అప్పుడప్పుడు నాకు తెలియకుండా ఎదో ఒకటి ఇస్తూనే ఉంటావు. వనజ చెప్పేదాకా తెలియదు నీ మంచితనం’ అనగానే, ఇదంతా మిమ్మల్ని చూసే నేర్చుకున్నానండీ’ అంటూ అతని గుండెలపై వాలిపోయింది సంగీత.

కొండా రవీందర్ 9059237771


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్