ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అన్ని ప్రధాన పర్యావరణ సమస్యలకి మానవ వ్యాపారాత్మక ప్రవృత్తే కారణం. మానవుని వినియోగ దృష్టి సోకినంత మేరా పర్యావరణం ఆదాయాన్ని సమకూర్చే ఆర్థిక వనరుగా మారిపోయింది. ఈ వినియోగ దృష్టే సమస్త పర్యావరణ సమస్యలకీ ప్రధాన కారణం.
పారిశ్రామిక యుగం ప్రారంభంతో మొదలైన పర్యావరణ వ్యవస్థల పతనం నేడు అతికీలకమైన దశకు చేరుకుంది. నేల, నీరు, వాతావరణం సమస్తం తిరిగి కోలుకోలేనంతగా ధ్వంసం చేయబడ్డాయి. తన చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడి బతికే మానవునితో పాటు సమస్త జీవరాసుల మనగడా నేడు ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ప్రాణం పోయాల్సిన ప్రకృతి నేడు ప్రాణాలని హరించే కాలుష్యంలా మారిపోవటం నేటికాలపు మహా విషాదం. విధ్వంస కాలాలన్నిటిలోనూ ప్రకృతి మానవాళికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పరిష్కారంగా పంపిస్తూనే ఉంటుంది. అలాంటి సంకేతాల్లో ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్‌నినో కూడా ఒకటి.
ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు కరువు ఛాయలు.. ఇంకోవైపు వరదల బీభత్సం. భూమిపై ఎక్కడో సముద్రం వేడెక్కితే, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతు పొలం ఎందుకు వర్షం లేక బీడుబారుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో మొదలయ్యే ఒక సహజ ప్రక్రియ ప్రపంచ ఆహార భద్రతను, ఆర్థిక వ్యవస్థలను, పర్యావరణ సమతుల్యతను ఎందుకు ఇంతగా అతలాకుతలం చేస్తుంది.
ఒక సంక్లిష్టమైన వ్యవస్థ
భూమి అంటే ఖండాలు, పర్వతాలు, నదులు, అడవులు మాత్రమే కాదు. సముద్రాలు, వాతావరణం, గాలులు, మేఘాలు, వర్షాలతో పరస్పరం అనుసంధానమై పనిచేసే ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో చోటుచేసుకునే చిన్న చిన్న మార్పులు కూడా ప్రపంచంలోని మరో ప్రాంత వాతావరణంపై తీవ్రమైన ప్రభావం చూపగలదు. సముద్ర జలాలు వేడెక్కడం, గాలులవీచే దిశలో స్వల్ప మార్పులు సంభవించటం, మేఘాల ప్రయాణ మార్గాలు మారిపోవడం, ఇవన్నీ స్థానికంగా సంభవించే సాధారణ మార్పుల్లా మనకి కనిపించవచ్చు. కానీ వాటి ప్రభావం వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకూ విస్తరించి, లక్షలాది మంది రైతుల జీవనోపాధిని, నగరాల నీటి సరఫరాను, అడవుల మనుగడను, కోట్లాది ప్రజల ఆహార భద్రతను ప్రభావితం చేయగలదు. దీనికి పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతల అసమానతల వల్ల కలిగే ఎల్‌నినో (El Nino)ఒకసాక్ష్యం.
ఇది పరిమితం కాదు
నిజానికి ఎల్‌నినో అనేది ఏ ఒక్క దేశానికో లేదా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల ప్రసరణ, వర్షపాత నమూనాల మధ్య ఏర్పడే విస్తృతమైన పరస్పర చర్యల ఫలితంగా ఏర్పడే సహజ వాతావరణ దృగ్విషయం. దీని ప్రభావంతో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసి వరదలు సంభవించవచ్చు. అది ఏర్పడే కాలం, దాని తీవ్రత, వాతావరణ వ్యవస్థల్లో అప్పటికే నెలకొన్న ఇతర మార్పులు మొత్తంగా దాని తీవ్రతని నిర్ధారిస్తాయి. పర్యావరణంలో ఒక ప్రాంతంలో ప్రారంభమయిన మార్పు, మరొక ప్రాంతంలో జీవుల జీవితాలను ప్రభావితం చేయగలదు అన్న అంశాన్ని ఎల్‌నినో వంటి విపత్తుల ద్వారా ప్రపంచం మానవాళి అర్థం చేసుకోవాల్సిన తరుణమిది.
ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది భూమధ్యరేఖ వెంబడి ఉన్న మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అసాధారణంగా వేడెక్కే సహజసముద్ర–వాతావరణ దృగ్విషయం. సాధారణ పరిస్థితుల్లో తూర్పు నుంచి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు వెచ్చని సముద్రజలాలను ఇండోనేషియా, ఆస్ట్రేలియావైపు నెడతాయి. అయితే ఎల్‌నినో సమయంలో ఈ పవనాలు బలహీన పడటంతో వెచ్చని జలాలు తూర్పు పసిఫిక్ వైపు విస్తరిస్తాయి. దీని ఫలితంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల ప్రసరణ, మేఘాల విస్తరణ, వర్షపాత నమూనాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమయ్యే ఈపరిణాలు, వాతావరణ వ్యవస్థల అనుసంధానం ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వాతావరణం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కడో పసిఫిక్‌లో ఎల్‌నినో వల్ల భారతదేశంలో వర్షపాతానికి కారణమయిన నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తాయి. దాని ఫలితంగా వ్యవసాయం, నీటివనరులు, ఆహార భద్రతవంటి అంశాలలో అనేక విపత్కర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, భారత మహాసముద్ర ద్విధ్రువం వంటి ఇతర వాతావరణ కారకాలు కూడా రుతుపవనాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఎల్‌నినోను కేవలం సముద్రం వేడెక్కే ప్రక్రియగా కాకుండా, సముద్రం–వాతావరణం మధ్య పరస్పర చర్యల ద్వారా ప్రపంచ వాతావరణం, పర్యావరణం, మానవ జీవనంపై ప్రభావం చూపగల కీలకమైన సహజ దృగ్విషయంగా అర్థంచేసుకోవాలి.
‘సూపర్ ఎల్‌నినో’ అంటే ఏమిటి?
ఎల్‌నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి ఎంత తీవ్రంగా ఉంటే, అంతగా దాని ప్రభావం ప్రపంచ వాతావరణంపై ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఎల్‌నినో తీవ్రతను కేవలం సముద్ర వేడిని అంచనా వేయటం ద్వారా గుర్తించలేం. ఆ వేడి సాధారణ స్థాయితో పోలిస్తే ఎంత ఎక్కువగా ఉంది, ఎంతకాలం దాన్ని ప్రభావం వాతావరణంలో కొనసాగుతోంది, సముద్రంతో పాటు ఇతర వాతావరణ వ్యవస్థలు దానికి ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలను పరిశీలించటం ద్వారా మాత్రమే ఎలనినో తీవ్రతని అంచనా వేయగలుగుతాం. భూమధ్యరేఖా పసిఫిక్లోనినినో-3.4ప్రాంతంలో నమోదయ్యే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు దీర్ఘకాల సగటు కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయో పరిశీలించటం ద్వారా ఎల్‌నినో తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు దీర్ఘకాల సగటు కంటే చాలా ఎక్కువగా పెరిగిన సందర్భంలో సంభవించే బలమైన ఎల్‌నినోలను ‘సూపర్ ఎల్‌నినో’లుగా పిలుస్తారు. అయితే ఈ పదానికి ప్రపంచవ్యాప్తంగా ఒకేరకమైన అధికారిక నిర్వచనం అంటూ ఏది లేదు. అందువల్ల ‘సూపర్ ఎల్‌నినో’ అనే పదం కలిగించే ఆందోళనకంటే, దాని ప్రభావాలను ముందుగానే అంచనా వేసి సిద్ధపడటం ముఖ్యం. సముద్రం ఎంత వేడెక్కుతోంది, వాతావరణ ప్రసరణ ఎలా మారుతోంది, రుతుపవనాల అంచనాలు ఏమి సూచిస్తున్నాయి, ఏఏ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే అంశాలను సమిష్టిగా పరిశీలించాలి. ఆ అంశాల ఆధారంగా వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆహార సరఫరా, ప్రజారోగ్య రంగాల్లో ముందస్తు చర్యలు చేపడితే సంభావ్య నష్టాలను అరికట్టవచ్చు. ఎల్‌నినోను ఆపడం మన చేతుల్లో లేకపోయినా, దాని ప్రభావాలకు తగ్గించి తద్వారా మనల్ని, మన వ్యవస్థలని కాపాడుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది.
చరిత్ర నుండి పాఠాలు?
ప్రపంచ వాతావరణ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఎల్‌నినో ప్రభావం ఎంతటి విషాదాన్ని కలిగిస్తుందో మనకి అర్ధమవుతుంది. ముఖ్యంగా 1982–83, 1997–98, 2015–16ల్లో సంభవించిన బలమైన ఎల్‌నినో మానవాళికి ఎంతటి విపత్తుని కలిగించాయో, ఇదే విధంగా 2015–16 ఎల్‌నినో కూడా ఆధునిక వాతావరణ చరిత్రలో అత్యంత బలమైన ఎల్నినోలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆ కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కూడా అత్యధిక స్థాయిల్లో నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలకి కేవలం ఎల్‌నినో ఒక్కటే కారణం కాదు. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి, ఎల్‌నినో వల్ల సంభవించే ఉష్ణోగ్రతలు తోడవటంతో పరిస్థితి మరింత విషమించింది. మానవ ప్రేరిత చర్యల వల్ల కలిగే అనర్ధాలకి, వాతావరణ ఉపద్రవాలు తోడైతే ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో 2015–16 ఎల్‌నినో ఘటన మనకి తెలియ చేస్తుంది. గత సంఘటనలు ఇచ్చిన పాఠాలను ఆధారం చేసుకుని శాస్త్రీయ అంచనాలను మెరుగు పరుచుకోవటం, రైతులకు ముందస్తు సమాచారం అందించడం, నీటి వనరులను సమర్థంగా నిర్వహించడం, వాతావరణ విపత్తులకు సిద్ధంగా ఉండటం మన చేతుల్లోనే ఉంటుంది. గతం మనకు అనేక అనుభవాలను అందిస్తుంది. ఆ అనుభవాల ఆధారంగా భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవటానికి ఎంత సంసిద్దంగా ఉన్నామో అన్నదే సవాళ్ల తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మరో విషమ పరీక్ష!
విశ్వవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, మారుతున్న వర్షపాత నమూనాలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలకే కాకుండా మానవ జీవనానికి కూడా అనేక సవాళ్లు విసురుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎల్‌నినో వంటి సహజ వాతావరణ దృగ్విషయం బలంగా ఏర్పడితే, భూమిపై ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, పరిస్థితులు మరింత సంకటంగా మారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. భూమి దీర్ఘకాలికంగా వేడెక్కడానికి ప్రధాన కారణం మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో పేరుకుపోతున్న గ్రీన్హౌస్ వాయువులు కాగా, ఎల్‌నినో అనేది సముద్రం, వాతావరణం మధ్య సహజంగా ఏర్పడే ఒక చక్రీయ పరిణామం. ఈ రెండూ వేర్వేరు ప్రక్రియలే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో వాటి ప్రభావాలు ఒకదానితో మరొకటి కలిసి మరింత వినశానాన్ని కలిగించొచ్చు. ఇప్పటికే మానవ ప్రేరిత చర్యల వల్ల భూమి ఉష్ణ సమతుల్యత గాడి తప్పటంతో పాటు, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, భూవినియోగ మార్పులు ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అడవులు కార్బన్లను నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం, సహజ పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడం వల్ల వాతావరణ మార్పులను నియంత్రించే ప్రకృతి తన సామర్ధ్యాన్ని నెమ్మది, నెమ్మదిగా కోల్పోతుంది. ఈ విపరిమాణాలు అన్నీ ఒక్క ఏడాదిలో సంభవించే పరిణామాలు కాదు, దశాబ్దాలుగా పర్యావరణంలో కొనసాగుతున్న మార్పుల ఫలితం.
భారతదేశానికి ఏం జరుగుతుంది?
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే వ్యవసాయ రంగం ఇప్పటికీ నైరుతి రుతుపవనాలపై గణనీయంగా ఆధారపడి ఉంది. అందుకే ప్రతి ఏడాది రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఎంత వర్షాన్ని అందిస్తాయి, ఏ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా లేదా ఎక్కువగా ఉండవచ్చు అనే ప్రశ్నలు కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎల్‌నినో బలపడే సూచనలు కనిపించినప్పుడు భారతదేశం ప్రత్యేకంగా అప్రమత్తమవుతుంది. సాధారణంగా ఎల్‌నినో ఏర్పడినప్పుడు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉష్ణోగ్రతలు, వర్షపాతం, గాలుల ప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు ప్రపంచవ్యాప్త వాతావరణ వ్యవస్థలతో పాటు భారత రుతుపవనాలను కూడా ప్రభావితం చేయగలవు. గతంలో సంభవించిన అనేక బలమైన ఎల్నినోలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులని సృష్టించాయి. రుతుపవనాలు బలహీనపడితే వర్షాధార పంటల సాగు దెబ్బతింటుంది, జలాశయాల్లోకి నీరు అడుగంటి పోతుంది, భూగర్భజలాల శాతం తగ్గిపోతుంది. తద్వారా రైతుల ఆదాయంతో పాటు, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవటం, గ్రామీణ ఆర్థికం కుప్పకూలి పోయే అవకాశం ఉంటుంది. అయితే ఎల్‌నినో ఏర్పడిందంటే భారతదేశంలో రుతుపవనాలు తప్పనిసరిగా విఫలమవుతాయని భావించడం శాస్త్రీయంగా సరైంది కాదు. భారత రుతుపవన వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. పసిఫిక్ మహాసముద్రంతో పాటు హిందూ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు, హిందూ మహాసముద్ర ద్విధ్రువం, భూమి, సముద్రాల మధ్య ఉష్ణ వ్యత్యాసాలు, వాతావరణ పీడనంలో మార్పులు, ఇతర వ్యవస్థలు కూడా రుతుపవనాలపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే మిగిలిన కారకాలతో కలిసి ఎల్‌నినో రుతుపవనాలకు పెను సవాలుగా మారవచ్చు.
కుదిపేసిన కరువు...
గతంలో సంభవించిన ఎల్‌నినో మహావిపత్తుల వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా అత్యంత తీవ్రంగా నష్టపోయింది. 70వ దశకంలో వచ్చిన ఎల్‌నినో కారణంగా భారత్‌తో సహా ప్రపంచ దేశాలని తీవ్రమైన కరువును ఎదుర్కొన్నాయి. భారత్, ఆగ్నేషియా, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగం, దక్షిణ, తూర్పు ఆఫ్రికాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 నుండి 5 కోట్ల మంది ఎల్‌నినో కలిగించిన వాతావరణ విపత్తులకి బలయ్యారు. దీనితోపాటు దక్షిణ భారతదేశంలో 1876 నుంచి వర్షపాతం తగ్గిపోవడం, పంటలు విఫలమవడం, నేలలో తేమ క్షీణించడం వంటి పరిణామాలు తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీశాయి. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీలోని ప్రాంతాలు, మైసూరు సంస్థానం, హైదరాబాద్ సంస్థానం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 1877లో కరువు మధ్య భారతదేశం, వాయవ్య ప్రాంతాలు, పంజాబ్ వరకూ విస్తరించింది. వర్షాభావంతో పంటలు నాశనమయ్యాయి. ఆహార ధాన్యాల కొరత పెరిగింది. పౌష్టికాహార లోపం కారణంగా ప్రజల శారీరక నిరోధక శక్తి తగ్గింది. కలరా, మశూచి వంటి అంటువ్యాధులు అనేక ప్రాంతాల్లో మరణాల శాతాన్ని మరింత పెంచాయి. ఆ కాలంలో సంభవించిన కరువు, కాటకాల వల్ల దేశవ్యాప్తంగా సుమారు 56 నుండి 96 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ఉంటారని ఒక అంచనా.
ఎల్‌నినోను అడ్డుకోగలమా..?
ఎల్‌నినో ప్రకృతి సృష్టించే ఒక సంక్లిష్టమైన సముద్ర వాతావరణ ప్రక్రియ. దాన్ని ముందుగానే గుర్తించడం సాధ్యమవుతున్నా, కృత్రిమంగా అడ్డుకోవడం లేదా దాని తీవ్రతను నియంత్రించడం మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పెను సవాలుగానే నిలుస్తుంది. ఎల్‌నినోను అడ్డుకోవడం సాధ్యం కాదు, అయితే దాన్ని ప్రభావాన్ని కృత్రిమంగా ఎంతవరకు తగ్గించగలం అనే అంశం మీద ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు అనేక నూతన విధానాలను తెర మీదకు తీసుకువస్తున్నారు. ఈ విధానాలలో మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ ఒకటి. అయితే ఇవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రకృతిలోని ఒక సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నం మరో సమస్యకు కారణం కాకూడదు. సాంకేతికతపై ఆశలు పెట్టుకోవడం అవసరమే. కానీ శాస్త్రీయ ఆధారాలు, పర్యావరణ జాగ్రత్తలు, సామాజిక బాధ్యతలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం అంతకంటే ముఖ్యం. ఎల్‌నినోను అడ్డుకునే మార్గం కోసం శాస్త్రం అన్వేషణ కొనసాగిస్తున్నప్పటికీ, దాని ప్రభావాలను ఎదుర్కొనేందుకు మానవ సమాజం ఇప్పటి నుంచే ఒక కార్యచరణని నిర్దేశించుకోవాలి. వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, నీటి వనరులను సంరక్షించడం, వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దడం, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, హరితగృహ వాయు ఉద్గారాలను తగ్గించడం వంటి అంశాలతో ఎల్‌నినో వంటి వాటి ప్రభావాల నుండి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ప్రకృతిని పూర్తిగా నియంత్రించాలనే ఆకాంక్ష కంటే, దాని సంక్లిష్టతను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా జీవించడం సమస్త మానవాళికి మరింత స్థిరమైన భవిష్యత్తును అందించగలదు. ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం.
చరిత్ర ద్వారా భవిష్యత్తును నిర్మించుకోవాలి..!
1876–1878 మధ్య భారతదేశాన్ని కుదిపేసిన మహాకరువు మానవ చరిత్రలో ఒక విషాద అధ్యాయం. ప్రకృతి వైపరీత్యం ఒక్కటే మానవ విపత్తుకు కారణం కాదని, దానికి తోడు సామాజిక అసమానతలు, ఆహార భద్రతలో లోపాలు, పాలనా వైఫల్యాలు, ముందస్తు సంసిద్ధత లేకపోవడం వంటి అంశాలు ఉమ్మడిగా కలిసినప్పుడు నష్టం ఎంత భయంకరంగా మారుతుందో గడిచిన చరిత్ర మనకు గుర్తుచేస్తుంది. ఇప్పుడు 2026–2027 కాలానికి సంబంధించి ఎల్‌నినోపై వెలువడుతున్న అంచనాలు మరోసారి ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అంచనాలు అనేవి భవిష్యత్తును ముందుగానే ఖరారు చేసే తీర్పులు కావు, సంభవించగల పరిస్థితులను అర్థం చేసుకుని, తగిన చర్యలు చేపట్టేందుకు ఉపయోగపడే శాస్త్రీయ సూచనలు. అందుకే ఈ సమయంలో భయాన్ని వ్యాప్తి చేయడం కంటే శాస్త్రీయ అవగాహనను పెంపొందించడం అత్యవసరం. వాతావరణ అంచనాలను ప్రజలకు సులభంగా అందించడం, రైతులకు ప్రాంతాలవారీగా ముందస్తు వ్యవసాయ సలహాలు ఇవ్వడం, నీటి వనరులను సమర్థంగా నిర్వహించడం, వేడిగాలుల నుంచి ప్రజలను రక్షించే ప్రణాళికలను అమలు చేయడం, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం వంటి చర్యలు ఎల్‌నినోతో సహా వివిధ వాతావరణ ప్రమాదాల ప్రభావాన్ని తగ్గించగలవు. ముఖ్యంగా వాతావరణ హెచ్చరికలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే వాటికి నిజమైన సార్ధకత ఉంటుంది.
సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
పరిస్థితులు మానవాళి చేయి జారిపోతున్న ప్రతిసారీ ప్రకృతి ఏదో ఒక రక్షణ సాంకేతాన్ని పంపిస్తుంది. ప్రకృతి తన సంకేతాలను సముద్ర ఉష్ణోగ్రతల మార్పుల్లో, వర్షపాత హెచ్చుతగ్గుల్లో, తీవ్రమైన వేడిలో, పర్యావరణ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడిల ద్వారా వ్యక్తం చేస్తుంది. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి, అనిశ్చితులను గుర్తించి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, మీడియా, రైతులు, ప్రజలఅందరి ఉమ్మడి బాధ్యత. ప్రకృతి విపత్తు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనేది వాతావరణ పరిస్థితులపైనే కాకుండా, సమాజం ఎంత సిద్ధంగా ఉందనే అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.
భవిష్యత్తు తరాల భద్రత కోసం
ఎల్‌నినో మనకు ప్రకృతిపై సంపూర్ణ ఆధిపత్యం సాధించలేమని గుర్తుచేస్తుంది. అదే సమయంలో శాస్త్రజ్ఞానం, పర్యావరణ బాధ్యత, సామాజిక న్యాయం, సమర్థవంతమైన పాలన, ముందస్తు ప్రణాళికలతో దాని ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలమని కూడా చెబుతుంది. గతంలోని విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని, వర్తమానంలోని శాస్త్రీయ హెచ్చరికలను గౌరవించి, భవిష్యత్తు తరాల భద్రత కోసం ఇప్పుడే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చే ప్రతి హెచ్చరిక భయపడటానికి మాత్రమే కాదు.. మన ఆలోచనలను మార్చుకోవడానికి, మన వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి, మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక అవకాశమూ కావచ్చు. ఈ ఎల్‌నినోని ఆ దిశలోనే మనం అర్ధం చేసుకుందాం.
డాక్టర్ శశిధర్, 94919 91918







కామెంట్లు (0)