చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలామంది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) ప్రకారం.. వేసవితో పోలిస్తే భారతదేశం అంతటా శీతాకాలంలో ఇన్ఫ్లుఎంజా (ILI), తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల (SARI) కోసం ఆసుపత్రులను సందర్శించే రోగుల సంఖ్య 30% నుండి 50% వరకు పెరుగుతుంది. పొడి గాలి, కాలుష్యం, ఇళ్లలో అందరూ దగ్గరగా ఉండటం వంటివి వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. కాబట్టి అనారోగ్యం పాలై మందులు వేసుకోవాల్సి వచ్చే వరకు వేచి ఉండకుండా, ఇప్పుడే శరీరాన్ని బలోపేతం చేసుకునేందుకు ముందడుగు వేయడం చాలా ముఖ్యం.
ఈకాలంలో రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది?
శీతాకాలంలో అనారోగ్యాలు ఎక్కువగా ప్రబలడానికి ప్రధాన కారణం మన శరీరంలో జరిగే కొన్ని శారీరక మార్పులే.
శ్లేష్మ పొరలు దెబ్బతినడం: ఆరోగ్యవంతుల ముక్కు, గొంతులోని శ్లేష్మం శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లను బంధించి నిరోధిస్తుంది. కానీ పొడిగా ఉండే శీతాకాలపు గాలికి గురైనప్పుడు ఈ శ్లేష్మ పొరలు పొడిబారి, క్షీణించిపోతాయి. దీనివల్ల వ్యాధికారకాలు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
విటమిన్ డి లోపం: శరీర రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచేందుకు విటమిన్ డి చాలా అవసరం. శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండటం, మందపాటి ఉన్ని దుస్తులు ధరించడం వల్ల మనపై పడే UVB కిరణాల ప్రభావం తగ్గి, విటమిన్ డి స్థాయిలు పడిపోతాయి.
గాలి ఆడని వాతావరణం: ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, కిటికీలు మూసి ఉంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించక ప్రజలు ఇళ్లలోపల గుమిగూడతారు. దీనివల్ల ఒకరికి సోకిన వైరస్ గాలి ద్వారా ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫూడ్స్
వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
విటమిన్ సి: NIN (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) నివేదిక ప్రకారం ఒక నారింజ పండు కంటే ఉసిరికాయలో సుమారు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు గొప్ప బలాన్ని ఇస్తుంది. జామకాయలు, క్యాప్సికం కూడా విటమిన్ C కి మంచి వనరులు.
పసుపు (కర్కుమిన్): పసుపు నుండి లభించే కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్. దీనికి చిటికెడు మిరియాల పొడి (పైపెరిన్) జోడించడం వల్ల కర్కుమిన్‌ను శోషించుకునే సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రపోయే ముందు ఒక కప్పు గోరువెచ్చని పసుపు పాలు తాగడం ఎంతో మంచిది.
ప్రోబైయోటిక్స్ : జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇంటిలో తయారుచేసిన పెరుగు, ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలి.
జింక్ అధికంగా ఉండే ఆహారాలు: జింక్ రోగనిరోధక కణాల పరిపక్వతకు తోడ్పడుతుంది. బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, పప్పుధాన్యాలను క్రమం తప్పకుండా తినాలి.
జీవనశైలి మార్పులు
నాణ్యమైన నిద్ర : మనం గాఢంగా నిద్రపోయినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌లతో పోరాడే ‘సైటోకైన్స్’ అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. రాత్రి 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్ర ఎంతో అవసరం.
మితమైన వ్యాయామం : రోజుకు 30-45 నిమిషాలు చురుగ్గా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయితే శరీరం అలసిపోయేలా అతిగా శ్రమించకూడదు.
ఒత్తిడి నియంత్రణ : దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు, దీర్ఘ శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి.
తప్పనిసరిగా వేయించుకోవాల్సిన టీకాలు
వార్షిక ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) వాక్సిన్: ఫ్లూ వైరస్‌లు ప్రతి ఏడాది మారుతుంటాయి. CDC ప్రకారం, ఫ్లూ ఇన్జెక్షన్ వల్ల ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని ఈ టీకా గణనీయంగా తగ్గిస్తుంది. పిల్లలు, వృద్ధులు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారు ఈ టీకా వేయించుకోవడం మంచిది.
న్యూమోకాకస్ వాక్సిన్ : శీతాకాలంలో ఫ్లూ ఇన్ఫెక్షన్ల వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ నిమోనియా వచ్చే అవకాశం ఉంది. స్ట్రెప్టోకోకస్ నిమోనియా బ్యాక్టీరియా నుండి రక్షణ పొందడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది.
(సూచన : వాక్సిన్ డాక్టర్ సలహాపై తీసుకోవాలి)
వాణీ అయోధ్య క్లినికల్ డైట్ కన్సల్టంట్ , 99593 61180






కామెంట్‌లు (0)