Magazines

మానవత్వమే చివరి గుర్తింపు

4 రోజుల క్రితం

Humanity is the ultimate identity.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 3 నిమిషాల చదవడం

మనిషి జీవితం ఒక ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రశ్న కూడా. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ గడిచే ప్రయాణం. పుట్టినప్పుడు ఆ ప్రశ్న ఉండదు. చనిపోయిన తర్వాత కూడా ఉండదు. మధ్యలో మాత్రమే ఉంటుంది. ఆ మధ్యలోనే సమాజం మనిషికి ఎన్నో సమాధానాలు చెబుతుంది. ‘నువ్వు ఈ కులం, నువ్వు ఆ మతం, నువ్వు ఈ వర్గం, నువ్వు ఈ దేశం, నువ్వు ఈ భాష’.. కానీ ఒక్కసారి కూడా ‘నువ్వు ఒక మనిషివి’ అని చెప్పడం మరిచిపోతుంది. అందుకే జీవితమంతా మనిషి తనను తాను వెతుకుతూనే ఉంటాడు. తన అసలు ముఖాన్ని కాదు, తన మీద సమాజం వేసిన ముసుగులను తొలగించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

మనిషి ఒంటరిగా జీవించలేడు. కానీ విచిత్రంగా అతడే తన చుట్టూ గోడలు కడతాడు. ఆ గోడలు ఇటుకలతో కట్టినవి కావు. అనుమానాలతో, పక్షపాతాలతో కట్టినవి. ఆ గోడల మధ్యే అతడు భద్రతను వెతుకుతాడు. కానీ అదే గోడలు అతన్ని ప్రపంచం నుంచి దూరం చేస్తాయని గ్రహించడు. మనం చాలా సార్లు స్వేచ్ఛ గురించి మాట్లాడతాం. కానీ స్వేచ్ఛ అంటే ఏమిటో ఆలోచించం. ఎక్కడికైనా వెళ్లే అవకాశం స్వేచ్ఛ కాదు. ఎవరినైనా ప్రేమించే హక్కు మాత్రమే స్వేచ్ఛ కాదు. తన మనసులోని భయాల నుంచి బయటపడగలగడం కూడా స్వేచ్ఛే. సమాజం ఏమంటుందో అనే సంకెళ్లను తెంచుకుని, తన మానవత్వాన్ని నిలబెట్టుకోవడం కూడా స్వేచ్ఛే.

సమాజం ఒక అద్దంలా ఉండాలి. ప్రతి మనిషి తనను తాను గౌరవంగా చూసుకునే అద్దం. కానీ అది న్యాయస్థానంలా మారిపోయింది. ప్రతి క్షణం తీర్పులు చెబుతోంది. ఎవరి దుస్తులు ఎలా ఉన్నాయి? ఎవరి భాష ఎలా ఉంది? ఎవరి జీవితం ఎలా ఉంది? ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం వినడం తగ్గించాం. తీర్పు చెప్పడం పెంచాం. అర్థం చేసుకోవడం తగ్గించాం. వర్గీకరించడం పెంచాం. మనిషి జీవితంలో అత్యంత విలువైనది కాలం కాదు. విశ్వాసం. ఒకసారి విశ్వాసం విరిగిపోతే, దాన్ని మళ్లీ నిర్మించడం ఒక నాగరికతను నిర్మించినంత కష్టం. అందుకే మనిషి మనిషిపై ఉంచుకున్న నమ్మకమే సమాజానికి నిజమైన పునాది. చట్టాలు సమాజాన్ని నడిపించగలవు. కానీ విశ్వాసం మాత్రమే సమాజాన్ని నిలబెడుతుంది.

నేడు పిల్లలకు పోటీ నేర్పుతున్నాం. మొదటి ర్యాంకు కోసం పరుగులు నేర్పుతున్నాం. గెలవడం నేర్పుతున్నాం. కానీ పడిపోయిన స్నేహితుడిని లేపడం నేర్పిస్తున్నామా? పంచుకోవడం నేర్పిస్తున్నామా? ఓడిపోయిన మనిషి గౌరవాన్ని కాపాడడం నేర్పిస్తున్నామా? విద్య అక్షరాలను మాత్రమే ఇస్తే సరిపోదు. మనసును కూడా తీర్చిదిద్దాలి. లేకపోతే చదువుకున్న మనుషులు పెరుగుతారు. కానీ మానవులు తగ్గిపోతారు. మరో విషయం ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి పని చేసే రైతు. రోడ్డు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడు. పిల్లలకు అక్షరాలు నేర్పే ఉపాధ్యాయుడు. రోగికి రాత్రంతా సేవ చేసే నర్సు. ఇంట్లో అందరూ తిన్నాక చివర్లో తినే తల్లి. వీళ్ల పేర్లు చరిత్ర పుస్తకాల్లో ఉండకపోవచ్చు. కానీ నాగరికత అనే పుస్తకాన్ని రాస్తున్న అసలు రచయితలు వీళ్లే.

మనం గొప్ప నాయకుల కోసం ఎదురుచూస్తుంటాం. కానీ ప్రతి గొప్ప మార్పు ఒక సాధారణ మనిషి హృదయంలోనే మొదలవుతుంది. ఒకరోజు అతడు ద్వేషించకూడదని నిర్ణయించుకుంటాడు. ఒకరోజు అతడు వివక్ష చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఒకరోజు అతడు మరొకరి బాధను తన బాధగా భావిస్తాడు. అదే చరిత్రలో కనిపించని విప్లవం.

ప్రపంచంలో ప్రతి యుద్ధం ఒక ఆలోచనతోనే మొదలైంది. అలాగే ప్రతి శాంతి కూడా ఒక మనసుతోనే మొదలవుతుంది. ప్రతి హింసకు ముందు ఒక ద్వేషం ఉంటుంది. ప్రతి ప్రేమకు ముందు ఒక అర్థం చేసుకోవాలనే ప్రయత్నం ఉంటుంది. అందుకే సమాజాన్ని మార్చాలంటే ముందుగా మన చూపు మారాలి. మన చూపు మారితే మాట మారుతుంది. మాట మారితే సంబంధం మారుతుంది. సంబంధం మారితే సమాజం మారుతుంది. ఈ కాలంలో మరో విషాదం నిశ్శబ్దంగా పెరుగుతోంది. జనాల మధ్య మనిషి ఒంటరివాడైపోతున్నాడు. పెద్ద ఇళ్లు నిర్మించుకున్నాడు. కానీ అందులో మాట్లాడుకునే మనుషులు తగ్గిపోయారు. వేల మంది పరిచయాలు సంపాదించాడు. కానీ తన బాధను చెప్పుకునే ఒక మనసు కోసం వెతుకుతున్నాడు. సాంకేతికత మన చేతులను కలిపింది. కానీ హృదయాలను కలపలేకపోయింది. అందుకే ఆధునిక ప్రపంచంలో అతి పెద్ద పేదరికం డబ్బు లేకపోవడం కాదు. మనసును అర్థం చేసుకునే మనిషి లేకపోవడం.

కాలం చివరికి ఒకే ప్రశ్న అడుగుతుంది. ‘నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావు?’ అని కాదు, ‘నీ వల్ల ఎంతమంది తలెత్తుకుని నిలబడ్డారు?’ అని. ‘నువ్వు ఎంత సంపాదించావు?’ అని కాదు. ‘నీ వల్ల ఎంతమంది ఆశను సంపాదించారు?’ అని. "నువ్వు ఎంత ప్రసిద్ధి పొందావు?" అని కాదు. "నీ వల్ల ఎంతమంది జీవితాల్లో వెలుగు పెరిగింది?" అని. ఎందుకంటే.. మనిషి అసలు గొప్పతనం అతను ఎంత పెద్దవాడయ్యాడో దానిలో ఉండదు. తన పక్కనున్న మనిషిని ఎంత చిన్నవాడిగా భావించలేదో దానిలో ఉంటుంది. అందుకే వెళ్లిపోయే ముందు ఒక పని చేయగలిగితే చాలు.. మరో మనిషి హృదయంలో తన వల్ల కొంచెం వెలుగు మిగిల్చాలి. ఆ వెలుగే నాగరికత. ఆ వెలుగే సమానత్వం. ఆ వెలుగే మానవత్వం. ఆ వెలుగే.. మనిషి చివరి గుర్తింపు. ఆ వెలుగే.. మనిషి గెలుపు.


మామిండ్ల రమేష్ రాజా, 7893230218

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్