Magazines

ఆధునిక కళలకు తెరపడితే ముందు ముందు వచ్చేవి సమకాలీన కళా సిద్ధాంతాలు

4 రోజుల క్రితం

If an end is brought to modern
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 5 నిమిషాల చదవడం

ఆధునిక కళలకూ తెరపడింది. బ్రిటిష్‌ ‌వారు వారి సిద్ధాంతాలు తెచ్చినప్పుడు, కాలం మారి, మన ఆలోచనలు మారి, మన సంప్రదాయ కళల అభ్యాసం మారి, వారు చెప్పిన ఆధునిక కళల సాధన మొదలైంది. అప్పుడు ఆధునిక కళా పద్ధతులు మొదలైనాయి. మొదట బ్రిటిష్‌ ‌వారు చెప్పిందే విద్యగా మన కళాకారులు సాధన చేశారు. ఆపై మన భారతీయ సమాజ, సంస్కృతి విషయాలు ప్రాతిపదికలు చేసి ఇవి మన భారతీయ ఆధునిక కళాసిద్ధాంతాలనీ, ముందడుగు వేసి చెప్పారు. ఇందుకు మూల కారణం వుంది. దేశం స్వతంత్ర్య భారతం కోసం పోరాడుతోంది. కళాకారులూ తమ వంతుగా మన భారతీయ సంస్కృతి, ఆలోచనా విధానాల ప్రాముఖ్యం చెపుతూ కళలు చేశారు. ఆనాడు అన్ని రంగాలకూ శత్రువు, బ్రిటిష్‌ ‌పాలన. మన దేశం మనకు కావాలనీ, బ్రిటిష్‌‌ని వెళ్లగొట్టాలనేదే ప్రతి ఒక్కరిదీ, దేశమందరిదీ ఆలోచన.


స్వతంత్రం వచ్చింది దేశానికి. స్వతంత్రం భారతదేశపు గుర్తులు, కళా సిద్ధాంతాల గుర్తింపు కోసం ఆలోచన చేశారు కళాకారులు. మన పల్లె, రైతు, జీవనాలు, నిత్య జీవిత విషయాలూ సంస్కృతి, ఆధ్యాత్మిక, తంత్ర, ప్రాంతీయ పద్ధతులనూ గుర్తులుగా తెచ్చి చిత్రాలు వేశారు. ఇంతలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మార్పులు, ప్రశ్నలు మొదలైనాయి. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత, మానవాళి చూసిన, అనుభవించిన విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోలేక పోయింది లోకం. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మొదలైనాయి. ఎందుకు మానవులందరికీ సమాన హక్కులు లేవు. కొన్ని దేశాలు నియంతృత్వంగా, నిరంకుశంగా ఎందుకు ప్రవర్తిస్తాయి. మానవాళిలోనే స్త్రీలకు, పురుషులకు సమాన హక్కులు ఎందుకు లేవు. అలాగే కళావేదికల విషయంగా బ్రిటిష్‌ ‌వారు చెప్పారు కాబట్టి వారు నేర్పిన కళలు ఆధునిక కళలు, వాటికి గొప్ప స్థానమనీ, అలాగే దేశ సంప్రదాయ కళలు, జానపద, ఆదివాస కళలూ ఆధునిక కళలకంటే తక్కువ స్థానంగా నిర్ణయించి చెలామణి చేయబడింది. ఈ అసమానతపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశ్నలు మొదలైనాయి.

అంతే కాదు మరో పెద్ద మార్పు జరిగింది. కళలకు యూరప్‌ ‌వారసత్వ పెన్నిధిగా చెలామణి చేసుకుంది. ప్రపంచ యుద్ధాలలో విధ్వంసం అయిన యూరప్‌ ‌నిలదొక్కుకోవటం కష్టమైనప్పుడు, కళలకు కళాకారులకు భుజం ఎక్కడ అందిస్తుంది. యూరప్‌ ‌నుండి కళాకారుల శిబిరాలు, కళా పద్ధతులు అమెరికాకు మార్చుకున్నారు కళాకారులు. అమెరికా కళల కేంద్రం అయింది.

యూరోప్‌ ‌వారి వారసత్వంపై ధీమా వ్యక్తపరిస్తే, అమెరికా నిత్య జీవన, పురోగమన పద్ధతులపై డాబు, దర్పంపై, విద్యపై ధ్యాస పెట్టింది. అక్కడి కళాకారులు అమెరికన్‌ అబ్‌‌స్ర్టాక్ట్‌ ‌కళల పేరుతో తత్వమూ, మనసులోని ఆలోచనలు ముఖ్యమైనవని నిరూప చిత్రాలు మొదలెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాపంచిక విషయాల కంటే, ఆ ప్రాపంచిక విషయాల భావాలపై ధ్యాస పెట్టారు కళాకారులు. ఈ కళావేదికల మార్పులు, ప్రశ్నలూ ప్రపంచ కళాకారులను కదిల్చాయి. ఈ మార్పులు భారతీయ కళాకారులనూ కదిల్చాయి. భారతీయ కళాకారులు భూత, వర్తమాన, భవిష్యత్‌ ‌వైపు ప్రపంచ నలుదిశలా చూడమొదలెట్టారు. మన భారతీయ కళాకారులూ మరిన్ని ఆలోచనలు తెచ్చారు.

ఆనాటి ఎన్నో ఆలోచనల మధ్య ముందడుగు వేసిన ఒక సిద్ధాంతం ‘నియో తాంత్రిక్‌ ‌కళ’. మన సమాజంలో జానపద, తత్వ, ఆధ్యాత్మిక మార్గాలున్నాయి. అందులో ఒకటి యంత్రం, తంత్రం. మొదటిగా వీటిని కళాపద్ధతులలో చూప మొదలెట్టిన చోళమండలం కళాకారుడు కె.సి.యస్‌. పణికర్‌. ఇతను ఈ పద్ధతిని సున్నిత కలీగ్రఫీ పద్ధతిగా ద్రవిడ తంత్రకళను చూపాడు. కానీ ఆపై ఇదే దారిలో మరింత ఆలోచనా, అర్థసారాలతో నియో తాంత్రిక్‌ ‌కళను భారతీయ కళాకారులు ఆహ్వానించారు. ఒక విధంగా చూస్తే అమెరికా అబ్‌‌స్ర్టాక్ట్‌, లేదా వారి నిరూప కళలకు ధీటుగా ఈ నియోతాంత్రిక్‌ ‌కళ నిలుచుందని చెప్పవచ్చు. ఇందులోనూ రూపాలు కాక గుర్తులు, రంగులు, కోణాలు, యంత్రం వంటి ఆకారాలలో అందులోని ఆధ్యాత్మిక అర్థాలను, భావాలనూ బయటకు తీశారు కళాకారులు.

హరిదాసన్‌ : 1937లో జన్మించాడు. కేరళకు చెందినవాడు. చోళ మండంలో కె.సి.యన్‌. పణికర్‌ ‌వద్ద చిత్రం అభ్యసించాడు. నేర్చిన విద్యకంటే మరో అడుగు ముందుకువేసి నియో తాంత్రిక్‌ ‌కళ వైపు నడిచాడు. ముందు చిత్రాలే వేశాడు. ఆపై కేరళ ఆచార పద్ధతుల ముగ్గు వంటి చిత్రం, రంగు పొడులతో వేశాడు. దానిని వారు ‘ధూళి చిత్ర’ అంటారు. ఈ చిత్రం త్రికోణాలు, చతురస్రాకారాలలో రేఖా గణితం ఆకారంలో వుంటుంది. నియో తాంత్రిక కళలకు ఈ రేఖా గణిత రూపాలు, ఆకారాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వీటికి అర్థాలు, ఆదికాలపు అర్థాలైన ప్రకృతి పురుష సమాగమ అర్థాలు ఇస్తూ ఈ చిత్రాలు వేశారు ఈ నియో తంత్ర కళాకారులు. ఈయన తరువాత కేరళ ఫైన్‌ ఆర్ట్ కాలేజీకి ప్రిన్సిపాల్‌‌గా కూడా చేశాడు. ఈయన వేసిన ఒక ముఖ్య చిత్రాల శీర్షిక - బ్రహ్మసూత్రం. 2014లో కన్ను మూశాడు.

బీరేన్‌‌డే : 1926లో ఫరీద్‌‌పూర్‌, బెంగాల్‌ ‌ప్రెసిడెన్సీలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌‌లో ఉంది. వీరు కుటుంబంతో సహా 1944లో కలకత్తా వలస వచ్చి కలకత్తా కాలేజీ ఆఫ్‌ ఆర్ట్‌ & ‌క్రాఫ్ట్‌‌లో చేరి కళాభ్యాసం చేశాడు. కానీ ఆ రోజుల్లో అక్కడ జరుగుతున్న గొడవల్లో ప్రిన్సిపాల్‌‌తో భేదాభిప్రాయం వచ్చి తన పట్టా తీసుకోలేదు. 1949లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒక మ్యూరల్‌ ‌చేయడానికి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్‌‌లో 1952 లో అధ్యాపకుడిగా చేరి 1963 వరకూ పని చేశాడు. న్యూయార్క్‌‌లో ఫుల్‌ ‌బ్రైట్‌ ‌స్కాలర్‌‌షిప్‌‌పై వెళ్లి వచ్చాడు. అక్కడి కళా వాతావరణం, మార్పులూ చూసిన తరువాత ఈయన దృష్టి కళలూ నియోతాంత్రిక్‌ ‌కళల వైపు మళ్లింది. ఈ పద్ధతి కళలు చేసే కళాకారుడిగా ఈయన పేరు పొందాడు. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతను ఒక సమతల గుర్తులను రేఖా గణిత పద్ధతిలోనే చిత్రిస్తూ, మండలాకారంలో ప్రకృతి పురుష సంగమ అర్థాలతోనే చిత్రం వేశాడు. 1992లో పద్మశ్రీ గౌరవం, 2006లో లలితకళా వారి గౌరవ పురస్కారం పొందాడు. 2011లో కన్నుమూశాడు.

గులామ్‌ ‌రసూల్‌ ‌సంతోష్‌ : 1929లో శ్రీనగర్‌‌లో జన్మించాడు. ఇతను కశ్మీరీ కవి, చిత్రకారుడు. కశ్మీరీ శైవభక్తికి సంబంధిచిన నియోతాంత్రిక్‌ ‌చిత్రాలు వేశాడు. తండ్రి చిన్నతనాన మరణించటంతో చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం గడిపాడు. 1954లో బరోడా ఫైన్‌ ఆర్ట్స్‌‌లో ఎన్‌.ఎస్‌.బింద్రే అనే అక్కడి అద్యాపకుడి వద్ద చిత్రకళ అభ్యాసానికి అవకాశం రాగా బరోడాలో చిత్రం నేర్చాడు. 1964 నుండి చక్కటి గీతలతో, రంగులతో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉట్టిపడే నియో తాంత్రిక్‌ ‌చిత్రాలు వేశాడు. ఈ సిద్ధాంతంలో యోగా, తూర్పు దేశాల ఆధ్యాత్మికత అర్థాలతో ఈ చిత్రకళ విధానం కనిపిస్తుంది.

దేశంలో పటుచోట్ల పలు రకాల ఆలోచనలతో కళాకారుల ఆలోచనలూ, వివాదాలు మొదలైనవి. 1950లో బరోడా (గుజరాత్‌)‌లో ఫాకల్టీ ఆఫ్‌ ‌ఫైన్‌ ఆర్ట్స్‌ అనే విభాగం బరోడా విశ్వవిద్యాలయంలో ఒక పురోగమన ఆలోచనలతో, దేశంలో ప్రతిభగల కళాకారులందరినీ ఆహ్వానించి అధ్యాపకులను చేసింది హన్సామెహతా, అప్పటి వైస్‌ ‌చాన్స్‌‌లర్‌. ఈ కళాశాల అదే ఉద్దేశ్యంలో ముందుకు సాగింది. దేశ విదేశాల కళాపద్ధతులు అవగాహన చేసుకుంటూ ముందుకు సాగింది. ఇక్కడ చదువుకున్న యువ కళాకారులు ఎంతోమంది గుజరాత్‌ ‌విద్యార్థులు. 1962 భావనగర్‌ (‌గుజరాత్‌)‌లో జయంత్‌, జ్యోతిపండ్యా అనే కళాకారుల ఇంట్లో కొందరు ఈ కళాకారులు సమావేశమయ్యారు. ఆలోచనలు, సంభాషణలు ముందుకు సాగి ఒక సమూహంగా పని చేయాలని ఆ సమూహం పేరు ‘గ్రూప్‌ 1890’ అని పేరు పెట్టారు. ఎందుకంటే వారు కూర్చుని వున్న ఇంటి నంబరు 1890. ఈ సంస్థలో 12 మంది కళాకారులు వున్నారు. జె.స్వామినాథన్‌ ‌ముందడుగు వేయగా అందు జ్యోతిభట్‌, జేరామ్‌ ‌పటేల్, గులామ్‌‌షేక్‌, హిమ్మత్‌‌షా, అంబాదాస్‌ ‌వంటి వారు ముఖ్యులు. వీరు ముందరి రవివర్మ పద్ధతి కాదు, బ్రిటిష్‌ ‌పద్ధతీ కాదు, బెంగాల్‌ ‌పద్ధతి కాదు అని ఆలోచనలు మార్చి ముందడుగు వేయాలని 1963లో ఢిల్లీలో చిత్ర ప్రదర్శన చేశారు. ఈ గ్రూప్‌ ‌కొద్దికాలమే నిలిచింది. ఆపై ఈ బరోడా కళా విభాగంలో చేరిన అధ్యాపకులు, విద్యార్థులు, మరో ఆలోచనలతో పురోగమన పద్ధతిలో కళలు ముందుంచి ఈ బరోడా ఆర్ట్స్‌ ‌కాలేజీనే కాదు వీరు అంతర్జాతీయ వేదికలపై నిలిచారు. ఎన్నో కొత్త పరిశోధనలూ, విధానాలలో పని చేసి భారతీయ సమకాలీన కళలకు ఎర్ర తివాచీ పరిచారు.

డా.యం. బాలామణి, 8106713356

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్