శాంతమ్మ ఇంటి పనులుచకచకా చేస్తూపోతున్నది. తెల్లారేసరికి వాకిలిని ముగ్గులతో అలంకరించి స్నానం చేసింది. ఒకపొయ్యి మీద చాయ, ఇంకో పొయ్యిమీద పప్పు ఉడక బెడుతున్నది.
ఎడ్లు మేపుకొచ్చి మొగురంకు ఒరిగి కూర్చున్న భర్త ధర్మన్నకు చాయ ఇచ్చింది శాంతమ్మ. తండ్రితో హరిత కూడా తోషులు చాయతో తింటున్నది. శాంతమ్మ పనులన్ని అవుతున్న కొద్దీ హరితకు ఆందోళన ఎక్కువైంది. నిన్న ధర్మన్నకు చెప్పి పంపించిన ఆ పని కాలేదు. అందుకే ఈ రోజన్నా అవుతుందా కాదా అని హరిత గుండె మరింత వేగంగా కొట్టుకుంటున్నది. తల్లి చేనుకు తయారవుతున్న కొద్దీ ఇయ్యాల సర్పంచ్ మామతో ఎట్లన్నా అడిగించాలా అనుకున్నది హరిత.
“అవ్వా నువ్వన్నా కొంచెం సర్పంచు మామకు చెప్పవే” అని దీనంగా అడిగింది తల్లితో హరిత.
“ఏం జెప్పాల! మీ బాపుకే ఇనడైతే నాకింటడా” నిర్లక్ష్యంగా జవాబిచ్చింది శాంతమ్మ.
‘‘లేదే! అట్ల జెయ్యకే నువ్వు చెప్తే ఇంటడేమోనే’’ అని తల్లి కొంగును మెలేసూ బతిమిలాడుతున్నది హరిత.
‘‘ఆ మనిషి ఇనే రకం కాదు! అండ్ల ఎన్నో చెట్లుపోతున్నయి. మన చెట్టు ఒక లెక్కనా. అది గాక సడకు పెద్దగ చేస్తున్నలట. సడకు కింద పోయే చెట్లే నరికేస్తున్నలు, మనది సుక గట్లనే పోతున్నది. ఊల్లె ఎన్నో చెట్లుపోతున్నయి మన చెట్టు వద్దంటె ఇంటరా! మన చెట్టు ఒక లెక్కనా” అంది శాంతమ్మ.
తన ఆశలన్నీ అడియాశలవుతున్నాయని బాధ పడసాగింది హరిత. చిన్నప్పటి నుంచి ప్రేమతో కష్టపడి పెంచుకున్న వేపచెట్టు ఈ రోజు నుంచి కనబడకుండా పోతున్నదని ఏడుస్తూ మాటిమాటికి ఆ చెట్టునే తిరిగి చూస్తూ పుస్తకాలు తీసుకొని బడికి వెల్తున్నపుడు
“అవ్వా నువ్వైతే ఆ సర్పంచ్ మామని అడిగి చూడే” అని ఆశగా అడిగింది హరిత.
“నిన్ననే మస్తు బతిమిలాడిన. మా బుజ్జికీ చెట్లంటే ఎంతో ఇష్టం మస్త కష్టపడి పెంచుకున్నదని బతిమిలాడినా గాని ‘‘తప్పదు ధర్మన్న బావా! అంత కచ్చితంగా చెట్టు కావాలంటే ఎదులాపురం నుంచి మరల మంచి మొక్కలు తెప్పిస్తా అన్నాడని” తండ్రి ఓదార్చే ప్రయత్నం చేశాడు.
చేసేదేమిలేక తోటిపిల్లలు ఎల్తూండటంతో భారంగా బడికెళ్లింది.
హరిత 6వ తరగతి ఊరు బడిలో చదువుతున్నది. చదువంటే హరితకు చెప్పలేనంత యిష్టం.
ఆవులు, మేకలు, చెట్లు, పిట్టలన్నా ప్రాణం. అందుకే శాంతమ్మ ఇల్లు రకరకాల చెట్లతో పూలమొక్కలతో ఇంద్రధనస్సులా మెరిసిపోతుంది.
పూలమొక్కలకు, చెట్లకు చుట్టూ కంచె వేయడం, రోజూ నీళ్లు పోయడం, మేక పిల్లలకు, లేగదూడలకు లేతగడ్డి తెచ్చి తినిపించడం, అప్పుడే పుట్టిన లేగలకు పాలు పట్టించడం, కాళ్లగిట్టలను శుభ్రం చేయడం తండ్రితో ఎడ్లబండిపై చేనుకెల్లి ఆరెకొమ్మలు పిల్లలకు తేవడం ఎంతో ప్రాణంగా చేసేది. బడి నుంచి రాగానే వాటి ఆలనాపాలనా చూసి కొంచెం సేపు మేకపిల్లలతో, లేగలతో ఆడుకోవడం హరితకు చెప్పలేనంత సరదా! ఉదయం పూట కూడా కండ్లు నలుపుకుంటూ కొట్టంలోకి వెళ్లి వాటిని చూడందే ఏ పనీ ముట్టుకోదు. వాటికి నొప్పి లేచినా, రోగం వచ్చినా తగ్గేదాకా తల్లడిల్లేది. ధర్మన్న, శాంతమ్మలు కూడా బిడ్డను ఒక్క మాట అనకుండా ప్రాణంగా చూసుకుంటారు. ఆమె సంతోషమే వాళ్ల సంతోషం అన్నట్లు హరితను పెంచారు. కూతురు సరదాను చూసి మురిసి పోతుంటారు.
ధర్మన్న శాంతమ్మలది అన్యోన్యమైన దాంపత్యం. పెళ్ళయిన చాలా సంవత్సరాలకి హరిత పుట్టింది. అందుకే హరిత అంటే అంత గారాబం. ధర్మన్నకి ఉన్న ఐదు ఎకరాలను ఇద్దరు కష్టపడి సాగు చేస్తారు. ఎవరిదగ్గరా చేయి చాచకుండా ప్రశాంతగా జీవనం సాగిస్తున్నారు.
కొత్త సర్పంచ్ వచ్చిన తరువాత పనులన్నీ ఒక్కొక్కటి మొదలవుతున్నాయి.
గ్రామంలో సిసి రోడ్లు, బంజరుదొడ్డి, బోరింగులు అన్నీ మంజూరు చేయిస్తూ గ్రామాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్నాడు కొత్త సర్పంచ్. ఊరంతా రోడ్లు వెడల్పు కార్యక్రమం ఊపందుకున్నది. జెసిబి, తొండం మిషను రోడ్లకు అడ్డంగా ఉన్నపెద్ద పెద్దబండలను చెట్లను, అమాంతం తీసేస్తున్నది. మహావృక్షాలు సైతం మహాపురుషుల్లా నేలకొరుగుతున్నాయి. చేతులులేని మిషన్లు చేసే పనిని ఊరంతా వింతగా చూస్తున్నారు.
పదిహేను రోజులకు రోడ్ల వెడల్పు కార్యక్రమం ఈ రోజు ధర్మన్న ఇంటి దగ్గరికి వచ్చింది. తన ఇంటిముందర వేపచెట్టు చావడాని ముందు చూసినట్లు చూస్తున్నది. తన బిడ్డ హరిత ప్రాణంగా పెంచుకున్నది ఈ చెట్టును. ఏ జంతువులు మనుషులు ముట్టకుంటా చూపులనే రక్షకులను చేసి కాపాడుకున్నది.
“చెట్టు కోసం పొల్లతండ్లాడి తండ్లాడి ఏడ్చుకుంటా బడికి వాయె. మనమేంజేస్తం మన చేతులేమున్నది. పాపం ఇప్పుడు ఇది బూమిల కెళ్లిపోతే పొజమట్టుశాల్ల కెల్లి అచ్చినంక ఎంత ఏడుస్తదో ఏమో!” అని బాధపడుతూ ధర్మన్న, బీడీ ముట్టిచ్చుకుంటు అన్నడు .
“అమ్మా! అమ్మా! ఈరోజు మనముండే చెట్టును నరికేస్తున్నారటా. మనముండడమెట్లా’’ చెట్టు మీది పక్షిపిల్ల తల్లితో భయపడుతూ అన్నది.
‘‘నిజంగానా! ఐతే మన ఇల్లు కూడా కూలిపోతుంది మరి” బాధగా అన్నది మరో పక్షిపిల్ల.
“ఊర్లో పెద్ద పెద్ద చెట్లనే కూల్చేస్తున్నారు. ఏంచేద్దాం.
మనలాగా ఎన్నో పక్షులు విలవిల
కొట్టుకుంటున్నాయి” అన్నది తల్లిపక్షి.
“మనం కూడా అలాగే అయిపోతామా’’ అంది పక్షి పిల్ల.
“లేదమ్మా! నేనున్నానుగదా! అందులో ఎవరు ఏమి చేసినా ఎన్ని కష్టాలొచ్చినా మనల్ని మాత్రం హరితక్క తప్పకుండా కాపాడుతుంది”
“ఓహో! అలాగైతే మనకేం భయంలేదన్నట్లు” సంతోషంగా అన్నది పక్షి పిల్ల.
“హరితక్కకు పక్షులంటే చాలా యిష్టం. మనకు కూడా ప్రతిరోజు మట్టి గిన్నెలో నీళ్లు పెడుతుంది. అన్నం మెతుకులు, ధాన్యం గింజలు సిద్ధంగా ఉంచుతుంది. కొంచెం గాలి దుమారం వచ్చినా విలవిల్లాడి పోతుంది. ఒకసారి మేము చిన్నగా ఉన్నప్పుడు గాలిదుమారంతో చెట్టు నేలకొరిగేట్టు కిందికి వంగింది. హరితక్క ఏడుస్తూ మేము చెట్టుకింద జారిపడకుండా చెట్టు కొమ్మలకు దుప్పటి కట్టి కాపాడింది” అని ధైర్యంగా చెప్పింది తన పిల్లలకు పక్షి తల్లి.
“ఏమోనమ్మా! నాకైతే చాలా భయంగా ఉంది. ఆ తొండం మిషనుని చూడు ఆకలితో ఉన్న మొసలిలాగా మనవైపే వస్తున్నట్లనిపిస్తున్నది” అన్నది చిన్న పక్షిపిల్ల.
ఆపద కాలంలో కీడు జరుగుతుందో మేలు జరుగుతుందో తెలియనప్పుడు అనవసరంగా భయపడొద్దు. హాయిగా పడుకోండి నేనునున్నాగా” అంటూ ఓదార్చింది తల్లి. రెక్కల కింద పిల్లలని ఒత్తుకుంటూ.
హరిత క్లాసురూములో పాఠాలు వింటున్నది నిజమే కానీ మనసంతా తన చెట్టుపై, పిల్లలపైనే ఉన్నది.
టీచర్వైపు, బోర్డువైపు చూస్తున్నది. కానీ ఆ చూపుల్లో సారం లేదు. ముందర ఏమీ కడబడడం లేదు. తరగతిగది నిండా వేప చెట్టు, పక్షిపిల్లలే కనబడుతున్నాయి. టీచర్ తన వైపు చూసినపుడు బలవంతంగా నవ్వుతూ ముఖాన్ని దాచేస్తున్నది. తల్లిదండ్రులు కూడా ఆరోజు చేనులోకి వెళ్లకుండా చెట్టు గురించే ఆలోచిస్తున్నారు.
‘‘అది కూలిపోయిన చెట్టును చూసి ఎంత ఏడుస్తదో ఏమో!” భర్త పక్కన కూర్చొని ఆందోళనగా అంటున్నది శాంతమ్మ.
చేసేదేమీలేక ధర్మన్న తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ
సాయంత్రం బడి నుంచి హరిత పరుగెత్తుకుంటూ. వస్తూ పడిపోయిన వేపను చూసి బోరున ఏడ్చింది. తల్లిదండ్రులు ఎంత ఆపినా ఏడుపు మానలేదు.
‘‘ధర్మన్నకూతురు హరిత రోడ్డు వెడల్పులో పోయిన చెట్టుకోసం అన్నం మానేసి ఏడ్చుకుంటూ పండుకొని ఉండడం ఆనోటా ఈనోటా ఊరంతా పాకిపోయింది. ఈ విషయం చివరికి ఉపాధ్యాయులందరికీ తెలిసింది.
అది మొక్కగా ఉన్నపుడు ఇంటికి తెచ్చి ప్రాణంగా నాటి రోజూ నీళ్లు పోయడం, గొడ్డూగోదా ముట్టకుంటా కంప నాటడం ఈ జ్ఞాపకాలన్నీ హరిత మనసును మరింత దుఃఖంపొంగేట్టు చేస్తున్నాయి. చెట్టులేనిదే మనిషి బ్రతకలేడు.
కానీ అదే చెట్టును రోడ్ల వెడల్పు పేరుతో, భవనాల పేరుతో నిర్దయగా నరికేస్తున్నారు. అదే రోడ్డుపై ధనవంతుల మేడలు, మిద్దెలు ఉంటే కూల్చేస్తారా! హరిత మనసు చెప్పలేని ఆందోళనకు గురవుతున్నది.
హోటల్ ముందు ఊరి జనం గుంపులు గుంపులుగా చాయలు తాగుతూ దినపత్రికలు చదువుతూ ముచ్చట్లాడుతున్నారు. అంతలో రోడ్డుపై పెద్దగుట్ట పరుగెత్తుకుంటూ వస్తున్నట్లు ట్రాక్టర్‌లోని పెద్ద చెట్టు కనబడుతున్నది. ఆ చెట్టును వేర్లతో సహా పెకిలించి పీక్కొని ఎవరో తెస్తున్నారు.
వెనుక ఒక జీబులో కొందరు, మరో జీబులో కొందరు దుమ్మురేపుకుంటూ వచ్చి హోటల్‌ముందు ఆగారు. ముందు జీబు నుంచి ఖాకీ డ్రెస్‌లో ఉన్న యువ లేడీ ఆఫీసర్ దిగింది.
“ధర్మన్న ఇల్లు ఎక్కడ!” రెండు చేతులు నడుముకు పెట్టి జనాలను అడిగింది. అందులో ఒకరు లేచి దగ్గరికెల్లి ‘‘అగో! అక్కడ పూల చెట్టు కనవడుతున్నది సూడు గదే’’ చూయించాడు.
పెద్దమనిషి చెప్పేలోగా క్షణాల్లో అక్కడికి చెట్టుతో ఉన్న ట్రాక్టర్, మిగితా మనుషులు ప్రొకేన్లు వచ్చి దిగాయి.
“అమ్మా మీరూ.. మా యింటికీ.. రెండు చేతులు కట్టి నిల్చొని ఆశ్చర్యంగా అడిగాడు’’ ఆ లేడీ ఆఫీసర్‌ను ధర్మన్న.
‘‘అవును నేను ఫారెస్ట్ ఆఫీసర్ అనితను. మీ కూతురు హరిత మీ యింటి ముందుర చెట్టు పోయినందుకు అన్నం నీళ్లు మానేసిఏ డుస్తున్నదని తెలిసింది’’
ధర్మన్న అనిత మాట్లాడుకునే లోపు ఇంటి ముందు ట్రాక్టరులో తెచ్చిన చెట్టును పాతేశారు.
ఒక డ్రమ్ము నీళ్లు పోశారు. ఊరంతా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పోయారు.
ఇంటిముందర జరుగుతున్న హడావిడీ, అల్లరిని ఇంట్లో నుంచి హరిత చూసేసరికి పోయిన తన వేపలాగే అదే చెట్టు మాదిరిగానే మరో వేపచెట్టు ఉండడం చూసి చాలా సంతోషపడ్డది. హరిత ఆనందానికి అవదులు లేవు.
పీకేసిన చెట్టు ఎట్లా నాటుకుంటుందని వింతగా ఉందా. ఒకప్పుడు మొక్కని తెచ్చి నాటేవాళ్ళు. ఆ కాలం పోయింది. ఇప్పుడు చెట్టును కూడా నాటుతున్నారు.
“చూశారా... హరిత లాగే మీ అందరికీ చెట్లమీద ప్రాణముంటే అడవులు ఇంత తరిగిపోయేవా. ఈ భూమిపై ఉన్న జీవకోటికి ప్రాణాధారం చెట్టే. మనిషి తన స్వార్థం కోసం, సుఖం కోసం అమ్మలాంటి చెట్లను నిర్దాక్షణ్యంగా నరికేయడం ఎంత దారుణం’’ అంటూ అక్కడున్న ఊరిజ నాన్ని ఉద్దేశించి అన్నది అనిత.
ఆమె అన్న మాటలు అక్షరాల నిజమని ఒప్పుకున్నట్లు వాళ్ల ముఖాల్లో గోచరించింది.
‘‘మీ ఊరి సహకారం ఉంటే తీసేసిన చెట్ల పక్కన కొత్తవి నాటిస్తాం. ఇంటింటికి ఒక చెట్టు కొత్తది మేమే సప్లై చేస్తాం.
మీ ఊళ్లో రాబోయే రోజుల్లో ఆకుపచ్చని ఆకాశ కనబడుతుంది” అన్న ఫారెస్ట్ ఆఫీసర్ అనిత మాటలు విన్న ఊరి జనమంతా చప్పట్లు కొట్టారు.
మందిని దొబ్బుకుంటూ ఆసక్తిగా అనిత దగ్గరికి వస్తున్న హరితను చూసి “ఒహో నువ్వేనా హరితవు ’’అంటూ హరితను దగ్గరికి తీసుకొని తన నిమురుతూ నుదిటిపై ముద్దు పెట్టుకున్నది. ‘
‘థ్యాంకు మేడం” అంటూ హరిత షేక్‌హ్యాండ్ ఇచ్చింది.
“ఇకనుంచి నువ్వుఏ చెట్టు అడిగినా క్షణాల్లో పంపిస్తాను. డోంట్ వర్రీ’’ అంటూ హరిత భుజం మీద చెయ్యివేసి మాటిచ్చింది అనిత.
మరిమేడం “నా..అంటూ” హరిత కళ్లనిండా నీళ్లు పెట్టుకుంటే...
‘ఏమిటి చెప్పు.. ఎందుకేడుస్తావ్’’ అంటూ ఆప్యాయంగా తల నిమురుతూ అన్నది అనిత.
“చెట్టు మీదున్న నా పిల్లలు, దాని తల్లి ఏమైపోయెనో ఏమో’’ హరిత అనే సరికిఅ వన్నీ మా పెరటి గూళ్లల్లో భద్రంగా ఉన్నాయని” చంద్రయ్య చెప్పేలోపే హరిత పరుగెత్తుకుంటూ వెళ్లి పిల్లలను తల్లిని చూసి చాలా సంబరపడింది.
ఫారెస్ట్ ఆఫీసర్ అనిత హరితకు చెట్లమీద, పక్షుల మీదున్న ప్రేమను చూసి ముచ్చటపడింది. అంతలోనే ఆఫీసర్ జీబులు దుమ్ములేపుకుంటూ వెళ్లి పోయాయి.
డాక్టర్ ఉదారినారాయణ, 9441413666






కామెంట్లు (0)