సేవలను సులభతరం చేసే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానం కొత్తకొత్త ఆవిష్కరణలకు తెర తీస్తోంది. దీనిలో భాగంగా వచ్చిందే బయోమెట్రిక్ విధానం. ప్రపంచంలో ఏ ఒక్కరి వేలిముద్రలు మరొకరితో సరిపోకపోవడంతో మొదట్లో ఈ పరిజ్ఞానాన్ని నేరగాళ్లను పట్టుకునేందుకు వాడేవారు. ఆ తర్వాత ఇదే పరిజ్ఞానాన్ని అనేక రంగాలకు విస్తరించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగాక, ఆయా యాప్ల లాకింగ్ కోసం, ఏటీఎంలలో కూడా వేలిముద్రలు వాడడం మొదలు పెట్టారు. దీంతో సైబర్ నేరగాళ్ల చూపు ఇప్పుడు వీటిపై పడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేలిముద్రలు కొట్టేస్తూ వాటి ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క వేలి ముద్ర చాలు, లాక్ చేసిన ఫోన్ తెరవొచ్చు. ఇంటికి వేసిన తాళం తీయొచ్చు. బ్యాంకు ఖాతాలోకి చొరబడి నిలువు దోపిడీ చేసేయొచ్చు. అందుకే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త లక్ష్యం వేలి ముద్రలు. అవి దొంగలపాలు కాకుండా అప్రమత్తం కావాలని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు ఫొటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం మామూలైంది. వాటిని సోషల్ మీడియాలలో పెడుతుంటారు. ఇప్పుడు ఫోన్లలో వాడుతున్న కెమెరాలన్నీ హైరిజుల్యూషన్ ఉండటంతో ఫొటో కూడా చాలా స్పష్టంగా వస్తున్నాయి. వాటిలో అర చేతులు, చేతి వేళ్లు కనిపిస్తే నేరగాళ్లకు పండగే. వాటి నుంచి వేళ్లు, వాటిపై ఉన్న వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఏఐ ఉపయోగించి మరింత స్పష్టంగా తయారు చేస్తున్నారు.
ఫోన్లో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్)ని చొప్పిస్తున్నారు. నేరగాళ్లు ఏదైనా మెసేజ్ పంపుతారు. దీన్ని తెరవగానే ఫోన్లోకి ర్యాట్ వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఫోన్లో జరిగే ప్రతి లావాదేవీ నేరగాళ్లకు చేరిపోతుంది. ఫింగర్ ఫ్రింట్ కూడా డేటా రూపంలో ఫోన్లో నిక్షిప్తమై ఉంటుంది. దీనికి సంబంధించి డేటా కూడా నేరగాళ్లకు చేరిపోతుంది. దీన్ని సేకరించి తమ దగ్గర పెట్టుకుంటారు.
కొన్ని బ్యాంకులు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం పేరుతో ఖాతాదారులకు వేలిముద్రల ద్వారా ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
ఇటీవల పెద్ద సంఖ్యలో తమ ఖాతాదారుల వివరాలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారని ఎస్బీఐ స్వయంగా ప్రకటించింది. అలానే వాహన బీమా వ్యాపారంలో ఉన్న మరో సంస్థ నుంచి కూడా 4 కోట్ల మందికి పైగా ఖాతాదారుల వివరాలు కొట్టేశారు. ఇలా కొట్టేసిన వివరాల్లో బ్యాంకు ఖాతా నంబరే కాదు ఆధార్ వంటి వివరాలన్నీ ఉంటాయి. చోరీ చేసిన ముఠాలకు వేలిముద్రలు కూడా దొరికితే ఇక పండగే వారికి. కొట్టేసిన వేలిముద్రను ఉపయోగించి భౌతికంగా సిలికాన్ వేలిముద్రలు తయారు చేస్తారు. వీటిని ఉపయోగించి ఏటీఎంలలో డబ్బు డ్రా చేయవచ్చు. ఇలాంటి సంఘటను ఇటీవల కాలంలో తెలంగాణంలోనే జరిగాయి.
అందుకే ఫోన్లు, బ్యాంకు యాప్ల వంటి వాటికి వేలిముద్రలు కాకుండా పిన్ నంబర్లు పెట్టుకోవడం, వాటిని తరచూ మార్చుకోవడం ఉత్తమం. అలాగే తెలియని వారి నుంచి వచ్చిన సందేశాలు ఓపెన్ చేయకండి. నాసికరమైన యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దు. అదే విధంగా వేలిముద్రలు కనిపించేలా చేతుల ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టొద్దు.
మీ వేలి ముద్రలు దొరికితే అంతే..!
14 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)