Magazines

జారుడుమెట్లపై నరహంతకులు

14 నవంబర్, 2026

Murderers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

కేతిగాడు : అరె జుట్టుపోలుగా... నరహంతకులంటే ఎవర్రా?

జుట్టుపోలుగాడు : మనుషులను చంపేవారు.

కేతిగాడు : అది మామూలు అర్థం. ఒకడ్ని చంపినా, వందమందిని చంపినా హంతకుడే. కానీ జాతి పేరుతోనో మతం పేరుతోనో వేలు, లక్షలమందిని మూకుమ్మడిగా పథకం ప్రకారం కక్షగట్టి చంపేవారిని నరహంతకులు అంటారు.

జుట్టుపోలుగాడు : అవునవును నాజీ నరహంతకుడు హిట్లర్‌ అలాంటివాడే.

కేతిగాడు : అది గత శతాబ్దంలో ఇప్పుడెవరో తెలుసా?

జుట్టుపోలుగాడు : నువ్వే చెప్పు?

కేతిగాడు : మొటివాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రెండోవాడు ఇజ్రాయిల్‌ ‌ప్రధాని నెతహ్యాహు, ఇప్పుడా ఇద్దరు ప్రజాగ్రహం తట్టుకోలేక జారుడుమెట్లపై వున్నారు.

జుట్టుపోలుగాడు : అంటే...

కేతిగాడు : ఇటీవల ఆ రెండు దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌ ‌దారుణంగా ఓడాడు. ప్రతిపక్ష డెమోక్రాట్ల పార్టీ సునామీకి అధికార పక్ష రిపబ్లికన్‌ ‌పార్టీ కొట్టుకుపోయింది. సెనెట్‌‌లోనూ, ప్రతినిధుల సభల్లోనూ డెమోక్రాట్లదే పై చేయి. అయినా చింతచచ్చినా పులుపు చావనట్టు ట్రంప్‌ ఇంకా బీరాలు పలుకుతున్నాడు. బ్యాలట్‌ ‌పేపర్‌‌పై తన పేరు లేదు కనుకనే తన పార్టీ అభ్యర్థులు ఓడారనీ, నేనే గనుక బరిలో వుంటే భారీ మెజార్టీ వచ్చేదని వదరుబోతు మాటలు మాట్లాడుతున్నాడు. ‘ఏం మునిగిపోలేదు - తనకున్న స్పెషల్‌ ‌వీటో పవర్‌‌తో చట్టసభల నిర్ణయాలను తోసిపారేస్తాన’ని బెదిరిస్తున్నాడు.

జుట్టుపోలుగాడు : మరిప్పుడెలా?

కేతిగాడు : అందుకే నియంతల పట్ల, వారి పాలనా వ్యవహారాల పట్ల జనానికి నిత్య జాగరూకత అవసరమని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అధికారంలో వారున్నంత కాలం ప్రజల మెడపై కత్తి వేలాడుతూనే వుంటుంది. నిలకడలేని మాటలు, పొంతన లేని చేతలతో ట్రంప్‌ ‌సొంత అమెరికాకే కాక యావత్‌ ‌ప్రపంచానికి ప్రమాదంగా మారాడు. ముఖ్యంగా గ్యాస్‌, చమురు ధరలతో సహా నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం, ఇజ్రాయిల్‌‌తో కలిసి ఇరాన్‌‌పై యుద్ధానికి దిగడం, అలాగే చట్టప్రకారం జీవిస్తున్న విదేశస్థులు మైనార్టీలపై విషం చిమ్ముతూ విద్వేషం కక్కడం అక్కడి పౌరులు తట్టుకోలేకపోయారు. అందుకే ఘోరంగా ఓడించారు. జాతి, మతం, జెండర్‌‌కు అతీతంగా నల్లజాతివారు, ముస్లింలు, లాటిన్‌ అమెరికన్లు, కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవడం చూసి, అమెరికా పౌరుల చైతన్యం పట్ల ప్రపంచమే విస్తుపోతుంది. మరో ముఖ్యవిషయం మన భారతీయ మూలాలు వున్నవారు కూడా పెద్ద ఎత్తున విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు యుద్ధాలు వద్దని, శాంతియుత సహజీవనం కోరుకుంటున్నారని, అందుకు ఈ ఎన్నికల మార్పే ఓ తార్కాణమని భావిస్తున్నారు.

జుట్టుపోలుగాడు : మరైతే యుద్ధాలు ఆగుతాయా?

కేతిగాడు : ఎందుకాగుతాయి? సామ్రాజ్యవాద దోపిడీ నియంతలు యుద్ధోన్మాదులు ఉన్నంత వరకు ప్రజలకు యుద్ధప్రమాదం తప్పదని కామ్రేడ్‌ ‌లెనిన్‌ ఏనాడో చెప్పాడు. నాటో దేశాల ద్వారా ఐరోపాపై పెత్తనం చేద్దామని అమెరికా ఉక్రెయిన్‌‌ను రష్యాపై ఉసి గొల్పితే రష్యా ఎదురు తిరిగింది. అలాగే ఇజ్రాయిల్‌‌తో కలిసి ఇరాన్‌‌పై యుద్ధదాడికి దిగి లొంగదీసుకోవాలనుకుంటే ఇరాన్‌ ‌కూడా ఎదురుతిరిగింది. రావణ కాష్టంలా ఆ యుద్ధ జ్వాలలుఇప్పటికీ ఆరడం లేదు. లక్షలు , వేల సంఖ్యలో ప్రజలు సైనికులు మరణిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్‌ ఒక్కటే పాలస్తీనా గాజాపై దాడి చేస్తూ డెబ్బై వేలమందికి పైగా పొట్టన పెట్టుకుంది. వారిలో పిల్లలు, స్త్రీలే అధికం. అందుకే ఇజ్రాయిల్‌ ‌ప్రధాని నెతన్యాహును కూడా అక్కడి ప్రజలు అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు.

జుట్టుపోలుగాడు : ఆ వివరాలు కూడా చెప్పు?

కేతిగాడు : 120 సీట్లు వున్న ఇజ్రాయిల్‌ ‌పార్లమెంటుకు గాను, నెతన్యాహు పార్టీకి నలభై ఎనిమిదే వచ్చాయి. విపక్షానికి 53 సీట్లు. ఎవర్నైతే బద్ద శత్రువులుగా వ్యతిరేకిస్తారో ఆ అరబ్బుల పార్టీ కూటమికి 19 సీట్లు వచ్చాయి. హంగ్‌ ‌వచ్చింది. ఆ అరబ్పుల పార్టీ కింగ్‌ ‌మేకర్‌ అయింది. మధ్య ప్రాచ్యాన్ని గ్రేటర్‌ ఇజ్రాయిల్‌‌గా మార్చి అక్కడి చమురుపై గుత్తాధిపత్యం సాధించాలనుకున్న నెతన్యాహుకు ఇది పెద్ద ఎదురు దెబ్బ.

బంగారక్క : ఈ పరిణామాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఎప్పటికప్పుడు యుద్దోన్మాదులు నియంతల పట్ల వారి చర్యల పట్ల నిత్యం జాగరూకతతో మెలగాలి. వారి చర్యలు వారి దేశాలకే కాదు యావత్‌ ‌ప్రపంచానికే ప్రమాదం. ఆ నరహంతకులకు ప్రజల ప్రాణాల పట్ల ఎలాంటి దయ, సానుభూతి వుండదు. గడ్డిపోచ కన్నా హీనంగా పెరికి పారేస్తారు. వారు చేసేది నరమేథం. వందల, వేల లక్షల సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలను బలికొనడానికి వెనుకాడరు. కరడు గట్టిన అధికారమదంతో విషపూరిత విద్వేషాలను నిత్యం రగిలిస్తూనే వుంటారు. మనదేశంలో కూడా గుజరాత్‌‌లో 2002 నరమేథం జరిగిన విషయం మనం మరువరాదు. వేలాదిమంది చనిపోయారు. ఆ మూడో నరహంతకుడు ఎవరో తెలుసుగా...



కె.శాంతారావు, 99597 45723

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్