భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతదేశం అనేక అంశాల మేళవింపుతో సుసంపన్నం అవుతూ అనేక శతాబ్దాలుగా వర్ధిల్లుతుంది. ముఖ్యంగా భారత సాంస్కృతిక వారసత్వంలో పశ్చిమ బెంగాల్ సంగీత, సాహిత్య భాగస్వామ్యం అత్యంత విశిష్టమైనది. బెంగాల్ చరిత్ర, భౌగోళిక పరిస్థితిలు, సాంప్రదాయాలు, కవితా పరిమళం, విజయగాధలు ఎంతో గొప్పవి. గ్రామీణ ప్రాంతాల వారు తేలికగా పాడుకునే మధుర గీతాలు నుంచి ఆధునిక కాలంలో విరాజిల్లిన ప్రసిద్ధి కవులు కవిత్వంతో, పాటలతో, జానపద గీతాలతో బెంగాల్ సాంస్కృతిక వారసత్వం గుబాళింపులు వెదజల్లింది. తరతరాలుగా తన సంస్కృతి సంప్రదాయాలు నిలుపుకుంటూ నేటికీ సంగీత సాహిత్య సౌరభం వెదజల్లుతుంది.
‘బౌల్స్ ఆఫ్ బెంగాల్, పడవ ప్రయాణికుల పదనిసలు, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు, బిష్ణుపూర్ ఘరానా వంటి సంగీత సాహిత్య సమ్మేళనంతో పక్రృతి, సామాజిక చైతన్యం, సృజనాత్మతకతతో బెంగాల్ సంగీతం, భారతీయ సాంస్కృతిక వారసత్వ చరిత్రలో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. బెంగాల్ సంగీతం జానపద గీతాలతో, ఆధ్యాత్మిక ఉద్యమాలతో, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంతో, బెంగాల్ పునరుజ్జీవనంతో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కింది. మానవ సంబంధాలు, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, దేశభక్తి పెంచేందుకు అద్భుతమైన అంశాలను ఆలంబనగా చేసుకొని వర్ధిల్లుతుంది.
బౌల్ సంగీతంతో ...
బెంగాల్ సంగీతంలో విలక్షణమైనది బౌల్ సంగీత సాంప్రదాయం. మానవుల్ని దైవంతో, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో అనుసంధానం చేసే అంశాలను మేళవించి చక్కటి ఆధ్యాత్మిక పాటలతో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తిరుగుతూ, పాటలు పాడుతూ ప్రజల్లోకి విస్తృతంగా పర్యటిస్తూ ఉండేత వ్యక్తులు. ముఖ్యంగా మత చాందస భావాలను విడనాడి, మానవత్వాన్ని ప్రభోదించే వారు. స్వయంగా పాడుతూ, మూడు రకాలైన సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఒకటి ‘ఏక్తారా’ అనగా ఒక తీగతో కూడిన సంగీత వాయిద్యం, రెండోది ‘దోతారా’ అనగా తంత్రీ వాయుద్యం, మూడోది ‘దుగ్గి’ అనగా తబలా వంటి వాయిద్యం వాయుస్తూ ఊరూరా తిరుగుతూ ఉండేవారు. ముఖ్యంగా ప్రజల్లో తాత్విక చింతన పెంచుతూ అర్థమయ్యేలా చిన్న చిన్న పద ప్రయోగాలతో పాటలు వినిపిస్తూ ఉండే వారు. ఒకవైపు విష్ణువు విశిష్టత, మరోవైపు సూఫీ తత్వం ప్రజలకు తెలియజేస్తూ బెంగాల్ ప్రజల్లో తాత్విక చింతన ఆధ్యాత్మిక ధోరణి పెంచడం ద్వారా బౌల్ సంగీతం ప్రసిద్ధి చెందింది. ‘యునెస్కో’ వారిచే బౌల్ సాంప్రదాయ గుర్తింపు పొంది, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
జానపదులు..
బెంగాల్లో ఉన్న వివిధ వృత్తులు, భౌగోళిక పరిస్థితులు ప్రాంతాలు, వివిధ జనాలు మధ్య ఉన్న మానసిక పరిస్థితులు (ఎమోషనల్ ఫీలింగ్స్) దృష్టిలో ఉంచుకుని రకరకాల జానపద గీతాలు సంగీతం పరవళ్ళు తొక్కింది. ముఖ్యంగా ‘భటియాలి’ జానపద గీతాలు పడవ ప్రయాణికులతో అలరారింది. ఈ సాహిత్యం ముఖ్యంగా మానవ జీవన స్థితిగతులను, నదీ ప్రవాహంతో ముడిపడి ఉండేది. జీవిత సత్యాలను ప్రభోదించేది. ఉత్తర బెంగాల్లో ‘భావయ్య’ జానపదులు మానవుని జీవితంలోని ప్రేమ, ఎడబాటు, రోజూ వారీ ఎదురయ్యే సమస్యలుపై చక్కటి బోధన చేసేవి. వ్యవసాయ, రవాణా రంగంలో పనిచేసే గ్రామీణ ప్రజల జీవితాలను ఈ జానపదులు తాకేవి. పశ్చిమ బెంగాల్లో ‘ఝమర్’ జానపద నృత్యాలు ముఖ్యంగా పురులియా, బంకురా ప్రాంతాల్లో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. పాడటంతో పాటు నృత్యం చేస్తూ ఝమర్ జానపద కళారూపాలు పండుగ సమయాల్లో, వేడుకల్లో ప్రజల మన్ననలు పొందాయి. గ్రామీణ వాతావరణాన్ని, మానవ సంబంధాలను, ప్రకృతి అందాలను, స్థానిక సంసృతి సాంప్రదాయాలను కలబోసి పాటలతో అలరించే విధంగా ఝమర్ జానపద కళారూపాలు ఉండుట ప్రత్యేకత..
బిష్ణుపూర్ ఘరానా...
పశ్చిమ బెంగాల్ సంగీతంతో బిష్ణుపూర్ ఘరానా ప్రముఖ స్థానం పొందింది. హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంతో బిష్ణుపూర్ ఘరానా ప్రముఖమైనది. మల్లా పాలకులు సంగీతానికి, ఇతర కళలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో ప్రస్తుతం బంకురా జిల్లాలో ఉన్న బిష్ణుపూర్ సంగీతానికి నిలయంగా వర్ధిల్లింది. ఘరానా అనే అంశం రాగాన్ని చక్కగా పలకడానికి, చక్కటి మధురమైన నిర్మాణానికి, పల్లవిపై ప్రభావం చూపడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంతో ఒక విధమైన ప్రత్యేకత సంతరించుకుకోవడానికి, రాజకుటుంబీకుల ఆదరణ మన్ననలు పొందడానికి ఘరానా ఎంతగానో తోడ్పడింది. దీంతో బిష్ణపూర్లోనే సంగీత పాఠశాల ఏర్పాటు చేశారు. ఎంతోమంది కళాకారులు, కవులు, మ్యూజిషియన్లు బిష్ణుపూర్ వచ్చారు. ‘సేనియా సాంప్రదాయం’ అనగా తాన్ సేన్ సంగీత వారసత్వం. అభివృద్ధి పరిచారు. ‘బహుదుర్ ఖాన్’, ఆర్.భట్టాచార్య వంటి ఎందరో మహానుభావులు సంగీత సాహిత్య సౌరభం పెంపొందించారు. బెంగాల్ సంగీతంలో, జానపద గీతాలలో, ఆధ్యాత్మిక చింతనలో బిష్ణుపూర్ ఘరానా ప్రముఖమైనది. బెంగాల్ సంగీతంలో విలక్షణమైనది. సంగీతాన్ని సుసంపన్నం చేసింది. నేటికీ ఆ వారసత్వ గుబాళింపులు దేశవ్యాప్తంగా వెదజల్లుతుంది..
ప్రపంచ గుర్తింపు తెచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్
బెంగాల్ సాంస్కృతిక చరిత్రలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చిరస్మరణీయమైన గుర్తింపు పొందాయి. సుమారు 2000 రచనలతో ఠాగూర్ బెంగాల్ సంగీత, సాహిత్యంలో సవ్యసాచిగా నిలిచారు. బెంగాల్లో ఉన్న జానపద కళారూపాలు, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సాంస్కృతిక సాంప్రదాయ విషయాలు, ఇతర సంగీత సాహిత్య సమ్మేళనాలు రవీంద్రనాథ్ ఠాగూర్‌పై ప్రభావాన్ని చూపాయి. అందుచేతనే ఈయన రచనల్లో మానవత్వం, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి, మానవ సంబంధాలు, స్వేచ్ఛ వంటి పలు అంశాలు చోటుచేసుకున్నాయి. బెంగాల్ పునరుజ్జీవనంలో ఠాగూర్ రచనలు ప్రముఖ స్థానం పొందాయి. విశ్వవ్యాప్తంగా ఆదరించారు. అందుచేతనే యూరప్ ఖండం బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి మొట్టమొదటి సారిగా నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తిగా 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ చరిత్ర సృష్టించారు. సంగీతంలో కూడా ప్రముఖ స్థానం పొందారు. మన జాతీయ గీతం ‘జనగణమన’, బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా’ గేయాలు ఈయన కలం నుంచి జాలువారినవే. నేటికీ చిరస్మరణీయమైన గుర్తింపు పొందుతూ, మన అందరి నోళ్లలో నానూతూ దేశభక్తి, సేవాభావం కలిగి ఉంటున్నాము. ఆనంద్ మఠ్ రచన ద్వారా బకీంచంద్ర ఛటర్జీ పేరు ప్రఖ్యాతులు పొందారు. వందేమాతరం గేయం బెంగాల్ విభజన సమయంలో ప్రజలను ఐక్యంగా ఉంచడంలో, బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్మాణంలో కీలకపాత్ర పొషించింది..
ఖాజీ నజ్రూల్ ఇస్లాం.. నజ్రూల్ గీతాలు..
నజ్రూల్ గీతీ.. ఖాజీ నజ్రూల్ ఇస్లాం రాసిన, పాడిన పాటలు బెంగాల్ సంగీతంలో సాహిత్యంలో నూతన అధ్యాయం సృష్టించాయి. ఈయన రచనలు బెంగాల్ ప్రజల్లో చైతన్యం కలిగించాయి. అందుచేతనే ఈయనను ‘విప్లవికవ’గా బెంగాల్ సాహిత్యంలో పేర్కోన్నారు. మంచి రచనతో పాటు ఉద్రేకం కలిగించేవిగా ఈయన రచనలు సాగించారు. అర్బిక్, పెర్షియన్ ప్రభావంతో బెంగాలీలో జానపద గీతాలు రచించారు. బెంగాల్ సంగీతంలో ‘ఘజల్’ ఒరవడి ప్రవేశపెట్టారు. హిందూ, ముస్లిం సాహిత్య సాంప్రదాయ బద్దంగా, రెండు మతాల అంశాలు కలగలిపి రచనలు చేశారు. అప్పటి బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా రచనలు చేశారు. అన్యాయాలపై గొంతెత్తారు, తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన రచనలతో ఉర్రూతలూగించిన కవి నజ్రూల్. మత చాందస భావాలకు వ్యతిరేకంగా రచనలు చేశారు. మత ఆధారంగా విభజనపై గళం విప్పారు. మానవత్వమే తన మతం అని చాటిచెప్పారు. అందుచేతనే సమ సమాజ నిర్మాణానికి ఈయన రచనలు రాచబాట వేసాయి. అందుచేతనే మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1960లో ఈయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఇలా బెంగాల్ సంగీతంలో సాహిత్యంలో నజ్రూల్ గీతీ ప్రముఖ స్థానం పొందారు..
ఈ విధంగా భారత సాంస్కృతిక వారసత్వంలో బెంగాల్ సంగీతం, సాహిత్య పరంగా తన చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. దేశ ప్రజలను బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి చేయడానికి, ఆనాటి సంఘంలో ఉన్న దురాచారాలు పారద్రోలడానికి, సమాజంలో ప్రేమ, దైవ భక్తి, దేశభక్తి సేవాభావం పెంపొందించడానికి, మానవత్వమే దైవత్వం అని చాటిచెప్పిన ఈ బెంగాల్ సాంస్కృతిక సంగీత సాహిత్యం పాత్ర అమోఘమైనవి. రాజా రామ్ మోహన్ రాయ్ కాలం నుండి, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, బకీంచంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఖాజీ నజ్రూల్ ఇస్లాం వరకూ తమ తమ రచనలు కవిత్వం పాటలు, కార్యక్రమాలు ద్వారా సమాజాన్ని తీర్చిదిద్దారు. బౌల్స్ ఆఫ్ బెంగాల్, భటియాలి జానపద కళారూపాలు, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, బిష్ణుపూర్ ఘరానా, ఝమర్ జానపద నృత్యాలు, శ్యాం సంగీత్ వంటి పలు సంగీత సాహిత్య సమ్మేళనం బెంగాల్ సాంస్కృతిక వారసత్వంలోనే కాకుండా, భారత సాంస్కృతిక వారసత్వంలో కూడా ప్రముఖ స్థానం ఆక్రమించింది. మన దేశ సాహిత్య సౌరభం గుబాళింపు చేయడంతో పాటు దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించింది. నేటికీ మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటానికి కారణం మన పూర్వీకులు వివిధ రూపాల్లో మనకు అందించిన సాంస్కృతిక సాహిత్య వారసత్వమే. ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం.
ఐ.ప్రసాదరావు, 9390509791






కామెంట్లు (0)