Magazines

మగబుద్ధి ప్రళయాంతక:!

14 నవంబర్, 2026

catastrophic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

ఏటిగట్టు, గట్టుమీద వేపచెట్టు. చెట్టుకింద అమ్మోరి శిల. ఆమె నుదుట కాసంత పెద్ద బొట్టు. ఒంటినిండా పసుపు. మునిమాపు వేళ ముసురుతున్నవి చీకట్లు. బండలోపల అమ్మ, బయటకు కనిపించని తల్లి. ఎక్కడ్నించో వినవచ్చింది ఆ ధ్వని. ఏడుపు వినిపిస్తే ఏ తల్లి మనసు కలత చెందదు. కనిపించని బండలో నుంచి అమ్మ కళ్లు తెరిచింది. ఏడుస్తున్నది ముద్దుముద్దుగా వున్న చిన్నది. ముక్కుపచ్చలారని చిన్నది. చిదిమి దీపం పెట్టవచ్చుననిపించే చిన్నది. పన్నెండేళ్లు నిండినయో లేదో చక్రాల్లాంటి కళ్లు, నిగనిగలాడే బుగ్గలు ఇంకా పాలబుగ్గలే. బండరూపంలో వున్న అమ్మ కరిగింది. కరిగి నీరయింది. నీరు మనిషయ్యి నిలువెత్తున నిలబడింది. అమ్మాయి భుజం మీద చేయి వేసింది. పాలబుగ్గ మీద కాలువకట్టిన కన్నీటిని ఆరా తీసింది. అప్పుడు తెలిసింది. ఈ లోకంలో ఆడవాళ్లకి మనుగడ లేదు. మగ చూపుల నుంచి రక్షణ లేదు. మగబుద్ధికి తిరుగులేదు. ఎదురులేదు. ఆడ వాళ్లకి రక్షణ అవసరం. రక్షణ అంటే పెళ్లి. పెళ్లిలేకపోతే ఆడజీవితం గాలి గట్టిగా వీస్తే చిరిగే అరిటాకు. అందుకే తనకు పెళ్లి, పన్నెండవ ఏటే పెళ్లి అంటూ వణికింది చిగురుటాకులా అమ్మాయి.

ఆడపిల్లగా పుట్టటమే శాపమా అని బొటబొటా కన్నీరు కార్చింది. పూర్ణమ్మ! పుత్తడిబొమ్మ! అమ్మకు కోపం వచ్చింది. నుదుటి కుంకుమ కళ్లల్లోకి పాకింది. మగజాతి మీద కోపంతో ఆమె ఒళ్లు పొగలూ, సెగలూ అయ్యింది. భయం లేదు చిట్టితల్లీ! నేనున్నాను. ధైర్యంగా ఎదిరించాలి. ఆడదంటే సబల అని నిరూపించాలి అన్నది. ఏం చెప్పమంటావు తల్లీ! అన్యాయం జరిగిపోతున్నా ఎవరికీ సానుభూతి లేదమ్మా. గిరిగీసుకోమంటున్నారు. ఆచితూసి అడుగెయ్యమంటున్నారు. ఆంక్షలు పెడుతున్నారు. మగవాడు రాక్షసుడు కావడానికి ఆడదే కారణమట. ఆమెకు పన్నెండేళ్ల లోపునే పెళ్లి చేసెయ్యాలని, ఆమె మగవాడికి కనపడకుండా దాక్కోవాలని, వాళ్లతో పెదవి విప్పి మాట్లాడకూడదని, అప్పుడే మగాళ్లందరూ ఉత్తమ పురుషులవుతారని, శ్రీరామచంద్రులవుతారని అంటున్నారు. మగ చూపులకు కాలిపోకుండా నన్ను నేను కాపాడుకోవాలట. నేను కనపడితే వాడిలోని జంతువు నిద్ర లేస్తుందట. వాడి కళ్లు కత్తులవుతాయట. అందుకే ఏడుస్తున్నా. చెరువులో పడి చద్దామని వచ్చా. ఈ లోకం మగవాళ్లకు మాత్రమే సొంతమా? అన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ! అమ్మకు కోపం వచ్చింది. నుదుటి కుంకుమ కళ్లల్లోకి పాకింది. మగజాతి మీద కోపంతో ఆమె ఒళ్లు పొగలూ సెగలూ అయ్యింది.

ఇప్పుడు

పాడుబడ్డ దిగుడుబావి గట్టు. గట్టుమీద వేప చెట్టు. చెట్టుకింద పై కప్పు లేకుండా నిలబడ్డ పసుపు రాయి. రాయి గుండెలో కనిపించని అమ్మ. బావి వైపు వెళ్తున్న ఆడమనిషి. ఆడమనిషిని చూసి ఉలిక్కిపడ్డ అమ్మ. ఉలిక్కిపడి ముందుకురికిన అమ్మ. అమ్మాయికి ఎదురుపడి నిలిచిన అమ్మ. ఆకాశంలో విసిరేసిన కిరణాల్లో మిగిలిన ఒకటీ అరా కిరణాల్ని సంచిలో సర్దుకుంటున్నాడు సూర్యుడు. ఎవరు తల్లీ నువ్వు? అడిగింది అమ్మలగన్న అమ్మ. అమ్మాయి ఆగకుండా నడుస్తున్నది. అప్పుడు చూసింది అమ్మ, ఆమె అరచేతి వెంట కారుతున్న రక్తం. ఆమె వేసుకున్న తెల్లటి డ్రస్సుమీద ఎర్రగులాబీ అంతకంతకూ వెడల్పు అవుతున్నది. ఏమైందమ్మా నీ చెయ్యి కరిగి రక్తమై ప్రవహిస్తున్నది అన్నది అమ్మ. అమ్మాయి చేతిని చేత్తో పట్టుకుని కెవ్వుమని ఇదేమిటి చేతి వేళ్లు ఏమైనవి అన్నది అమ్మ. కనపడడంలేదూ! వేళ్లు నరికేశాడు ఓ మగాడు అన్నదా అమ్మాయి తెగిన చేతివేళ్లని మరో చేత్తో అదిమి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, నొప్పిని బాధను పళ్ల బిగువున భరిస్తూ. ఎందుకు నరికేశాడు? అన్నది అమ్మ గుండె చెరువై. సెల్‌‌ఫోన్‌‌లో మాట్లాడినందుకు. మగవాళ్లు పశువులు కావడానికి ఆడవాళ్లు సెల్‌‌ఫోన్‌ ‌పట్టుకోవడమే కారణమని. ఆడవాళ్లు సెల్‌ఫోన్‌ ‌ముట్టుకోకపోతే మగబుద్ధి వక్రమార్గం పట్టదని అన్నది మగజాతి మేలుకోసం రక్తం ధారపోస్తున్న ఆ చిన్నది. అమ్మకు కోపం వచ్చింది. నుదుటి మీద కుంకుమ కళ్లకు పాకింది. మగజాతి మీద కోపంతో ఒమె ఒళ్లు సెగలు పొగలు అయ్యింది.

ఎప్పుడూనా?

పాఠశాల తరగతి గదిలో టీచర్‌ ‌నల్లబల్లమీద గణితంలో ఒక సమస్య పరిష్కరిస్తున్నది బల్లమీది నోటు పుస్తకంలో ఇంకుకు బదులు కళ్లు తిరిగే ఎరుపు కనపడ్డంతో ఉలిక్కిపడ్డది, పరహారో ఏడు రాని పదవ తరగతి అమ్మాయి. సర్రుమంటూ రంపం ఒకటి ఒంట్లో దొరికిన చోటుని కోసేస్తున్నది. అరవడానికి నోరు పెగల్లేదు. తరగతి గదిలో గాలి భయంతో పారిపోయింది. ఊపిరాడక గదిలో ఉన్నవాళ్లు రాళ్లయిపోయారు. స్కూల్‌ ‌వెనుక గంగరావి చెట్టుకింద బొమ్మలా నిలబడి వున్న అమ్మ కదలలేక చూస్తూ నిలబడిపోయింది. కదిలే బస్సులో అత్యాచారం, బ్రిడ్జి కింద ఆడపిల్ల సజీవ దహనం...

ఇంకా ఇంకానా..? ఎప్పుడూనా?

ఏటిగట్టుమీద దుర్గమ్మ, చెరువుగట్టుమీద కాళికామాత, దిగుడుబావి మీద ఎల్లమ్మ, గంగరావి చెట్ట కింద అమ్మోరు ఎవరూ ఆడవాళ్లను మా నుంచి కాపాడలేరని మగవాళ్లు ఫక్కున నవ్వారు. ‘అమ్మలగన్న అమ్మవి, బండరాయివి నువ్వేం చేస్తావమ్మా? నువ్వూ ఆడదానివే!’ అన్నారు అమ్మలగన్న అమ్మలూ...

‘మిమ్మల్ని అవసరానికి వాడుకున్న మగదేవుళ్లు మగాళ్ల బుద్ధికి చెదలు పట్టించారు. మగాళ్లు ఉత్తమ పురుషులూ, శ్రీరామచంద్రులూ అవడానికి ఆడవాళ్లు అనేక వందల ఏళ్లు వెనక్కి పోవసిందే’ అన్నారు.



చింతపట్ల సుదర్శన్‌, 9299809212

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్