నిద్రకు మెలుకువకు మధ్య
నీవొస్తావు
రెప్పపాటు కలలా
అంతులేని దుఃఖములా
చుక్క తెగినప్పుడల్లా
నీ చింతనే
వాడ గుండెలోకి, గూడెం గుడిసెలోకి
మళ్ళోస్తావని
నడిరేయి బీభత్సం
పిడుగుల అలజడి, వరద ఉధృతి
ఒరిగిన మహావృక్షాలు, నిటారుగా గడ్డిపోసలు
లేలేతగా పొద్దుపొడుస్తుంది
గడ్డిపోసల్ని ముద్దాడుతున్న తొలిసంధ్య
ఒరిగిన మోదుగమాను మీదుగా ఎర్రకిరణాలు
ముద్ద దిగుతలేదు
నీ కవితా పఠనం
గుండెలో ఆత్మగౌరవం
పిడికిలి నిండా నీ ధిక్కారం
తలుపు తీయగానే
పెచ్చులూరుతున్న గోడ మీద
నీ ఎర్రరాత
ఫోన్ చూడగానే
నగరం నడిబొడ్డున నీ నినాదపు నోటిఫికేషన్
ఆశ వికసిస్తుంది
మోదుగు చిగురిస్తుందని
ఎప్పట్లాగే..
కొడవలి పట్టుకున్న కూలీతల్లి
తూర్పురేగడి దిక్కు పయనమైంది
- విను






కామెంట్‌లు (0)