ఒకప్పుడు ఇంట్లో టీవీ ఆన్ చేయాలంటే రిమోట్ కోసం వెతికేవాళ్లం. రిమోట్ దొరకకపోతే టీవీ దగ్గరకు వెళ్లి బటన్ నొక్కేవాళ్లం. ఇప్పుడు మొబైల్‌తోనే టీవీని నియంత్రించవచ్చు. ఒకే ఇంట్లో ఒకరికి వార్తలు, మరొకరికి సీరియల్, ఇంకొకరికి క్రికెట్, పిల్లలకు కార్టూన్ కావడంతో చివరికి ఒక్కో వ్యక్తి ఒక్కో స్క్రీన్ ముందు కూర్చునే పరిస్థితి వచ్చింది.
(నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ దినోత్సవ సందర్భంగా)
టీవీ మారింది. మనం టీవీని చూసే విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు ఇంటి సభ్యులందరినీ ఒకే తెర ముందు కూర్చోబెట్టిన టీవీ, ఇప్పుడు ఒక్కొక్కరినీ ఒక్కో తెర ముందు కూర్చోబెడుతోంది. ఈ మార్పు కేవలం టీవీ సాంకేతిక పరిణామం కాదు. మన జీవనశైలిలో వచ్చిన మార్పుకు కూడా అద్దం పడుతోంది. ఇప్పుడు టీవీ, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ అంటూ స్క్రీన్లు పెరిగాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది.. మనకు సమాచారం పెరిగిందా? లేక సమాచార శబ్దం మాత్రమే పెరిగిందా? ప్రతి ఏడాది నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సమాచారం, విద్య, వినోదాన్ని ప్రజలకు చేరవేయడంలో టెలివిజన్ పోషించిన పాత్రను గుర్తుచేసుకోవడం దీని ఉద్దేశం. అయితే నేటి పరిస్థితుల్లో టెలివిజన్ చరిత్రను గుర్తుచేసుకోవడం మాత్రమే సరిపోదు. టెలివిజన్ ఎలా మారింది? ఆ మార్పు వెనుక ఉన్న శాస్త్రం ఏమిటి? సాంకేతికత పెరిగిన కొద్దీ దాని బాధ్యత ఎలా మారాలి? అన్నది కూడా ఆలోచించాలి.
పెట్టె టీవీతో మొదలైన ప్రయాణం
మన చిన్ననాటి టీవీని గుర్తు చేసుకుంటే పెద్ద పెట్టెలా ఉండేది. దాన్ని CRT (Cathode Ray Tube) టెలివిజన్ అంటారు. CRT టీవీలో వెనుక భాగంలో ఉన్న ఎలక్ట్రాన్ గన్ ఎలక్ట్రాన్లను వేగంగా ముందుకు పంపుతుంది. అయస్కాంత క్షేత్రాల సహాయంతో ఆ ఎలక్ట్రాన్ కిరణాన్ని తెరపై అవసరమైన చోటుకు మళ్లిస్తారు. తెర లోపల ఉన్న ఫాస్ఫర్ పదార్థాన్ని ఎలక్ట్రాన్లు తాకినప్పుడు వెలుగు ఏర్పడుతుంది. ఈ చిన్న ప్రక్రియలోనే Physics లోని ఎలక్ట్రాన్ల కదలిక, అయస్కాంత క్షేత్రాలు, విద్యుత్, కాంతి వంటి భావనలు పనిచేస్తాయి. టీవీ తెరపై చిత్రం కూడా ఒక్కసారిగా ఏర్పడదు. చాలా వేగంగా మారే చిన్న చిన్న బిందువుల సమాహారాన్ని మన కళ్లూ, మెదడూ ఒక నిరంతర దృశ్యంగా అనుభవిస్తాయి. అందుకే మనకు కదిలే సినిమా లేదా వీడియో కనిపిస్తుంది. అంటే మనం చూసే మొదటి తరం టీవీ కూడా నిజానికి Physics ప్రయోగశాలే!
నలుపు.. తెలుపు నుంచి రంగుల ప్రపంచానికి
ప్రారంభ టీవీల్లో రంగులు ఉండేవి కావు. నలుపు, తెలుపు, బూడిద రంగు ఛాయల్లోనే చిత్రాలు కనిపించేవి. తర్వాత రంగుల టెలివిజన్ వచ్చింది. ఇక్కడ దృశాశాస్త్రం (Optics)లోని సూత్రాలు మనకు ఉపయోగపడ్డాయి. టీవీ తెరపై ఎరుపు, ఆకుపచ్చ, నీలం (RGB) కాంతులను వివిధ తీవ్రతలలో కలపడం ద్వారా అనేక రంగులను సృష్టిస్తారు. మనకు టీవీ తెరపై ఒక పచ్చని చెట్టు కనిపిస్తుంది. కానీ తెరను దగ్గరగా చూస్తే, అక్కడ అనేక చిన్న రంగుల బిందువులు పనిచేస్తుంటాయి. మన కళ్లకు అవి విడివిడిగా కనిపించకుండా ఒకే రంగుగా అనిపిస్తాయి. అంటే రంగుల టీవీ మనకు ఒక విషయాన్ని నేర్పింది. ఎరుపు, ఆకుపచ్చ, నీలం కాంతులను సరైన తీవ్రతల్లో కలిపితే మన కళ్లకు అనేక కొత్త రంగులు కనిపిస్తాయి.
ఇంటి గడప దాటిన టెలివిజన్
తర్వాత టెలివిజన్ ప్రసారంలో మరో పెద్ద మార్పు వచ్చింది. కేబుల్, శాటిలైట్ ప్రసారాలు విస్తరించడంతో ఒకే టీవీ ద్వారా మరిన్ని ఛానళ్లను చూడగలిగే అవకాశం వచ్చింది. ఇక్కడ టీవీ కేవలం ఒక తెరగా కాకుండా సమాచారాన్ని దూరం నుంచి స్వీకరించే పరికరంగా మారింది. ఒక కార్యక్రమం స్టూడియోలో తయారవుతుంది. అది ఎలక్ట్రానిక్ సంకేతంగా మారుతుంది. ప్రసార వ్యవస్థ ద్వారా దూర ప్రాంతాలకు చేరుతుంది. మన ఇంట్లోని టీవీ దాన్ని స్వీకరించి మళ్లీ చిత్రం, శబ్దంగా మనకు అందిస్తుంది. అంటే మన ఇంటి గదిలో కూర్చుని వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న సంఘటనను చూడగలిగే సామర్థ్యాన్ని సాంకేతికత మనకు ఇచ్చింది.
పెద్ద పెట్టె పలుచబడినప్పుడు
తర్వాత టెలివిజన్ రూపమే మారిపోయింది. CRT స్థానాన్ని LCD (Liquid Crystal Display) టీవీలు ఆక్రమించడం ప్రారంభించాయి. LCDలో వెనుక నుంచి వచ్చే కాంతిని liquid crystal పొర నియంత్రిస్తుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే కిటికీ తెరను ఊహించుకోవచ్చు. తెరను ఎక్కువగా తెరిస్తే ఎక్కువ వెలుగు వస్తుంది. మూసేస్తే తక్కువ వెలుగు వస్తుంది. అదేవిధంగా LCDలో విద్యుత్ సంకేతాల ఆధారంగా liquid crystal కాంతి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. దాంతో తెరపై అనేక రంగులు, వాటి వివిధ ఛాయలు ఏర్పడి, మనకు సహజమైన రంగుల్లో చిత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ కాంతి, ధ్రువణం, విద్యుత్ క్షేత్రం వంటి భౌతికశాస్త్ర సూత్రాలు పనిచేస్తాయి. పాత CRTతో పోలిస్తే LCD టీవీలు పలుచగా, తేలికగా మారాయి. టీవీ ఇంట్లో ఒక పెద్ద పెట్టెగా ఉండాల్సిన అవసరం తగ్గింది.
కాంతి మూలంలో మరో మార్పు
తర్వాత LED TV వచ్చింది. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. సాధారణంగా మనం LED TV అని పిలిచే వాటిలో LCD displayకి వెనుక భాగంలో LED backlight ఉపయోగిస్తారు. LEDలు చిన్న అర్ధవాహక పరికరాలు. అవి విద్యుత్ శక్తిని కాంతిగా మార్చగలవు. దీంతో టీవీ మరింత పలుచగా, ప్రకాశవంతంగా, విద్యుత్ వినియోగ పరంగా సమర్థవంతంగా మారే అవకాశం వచ్చింది. ఇక్కడ అర్ధవాహక భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, దృశా శాస్త్రం కలిసి పనిచేస్తాయి. అంటే టీవీ రూపం మారడమే కాదు, దాని వెనుక ఉన్న పదార్థాల శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది.
ప్రతి పిక్సెల్కు తన వెలుగు
తర్వాత OLED వంటి సాంకేతికతలు వచ్చాయి. LCDలో వెనుక నుంచి backlight అవసరం. OLEDలో ప్రతి దృశ్య బిందువు (pixel) స్వయంగా కాంతిని ఉత్పత్తి చేయగలదు. ఒక పెద్ద గదిని ఒకే బల్బుతో వెలిగించడం LCD విధానమైతే, గదిలోని ప్రతి చిన్న ప్రాంతానికి ప్రత్యేకమైన దీపం ఉన్నట్లుగా ఊహించుకోవచ్చు. దీంతో లోతైన నలుపు, మంచి contrast, పలుచని తెర వంటి ప్రయోజనాలు సాధ్యమయ్యాయి. ఇక్కడ అర్ధవాహక భౌతికశాస్త్రం, విద్యుత్దీప్తి (Electroluminescence - విద్యుత్ శక్తి కారణంగా పదార్థం నుంచి కాంతి వెలువడే ప్రక్రియ) వంటి భావనలు పనిచేస్తాయి. ఇలా చూస్తే CRT నుంచి LCD, LED, OLED వరకు టెలివిజన్ ప్రయాణం నిజానికి ఎలక్ట్రాన్ల నుంచి కాంతి నియంత్రణ వరకు సాగిన Physics ప్రయాణం కూడా.
సమాచారాన్ని కూడా మార్చింది
తర్వాత టెలివిజన్ డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించింది. Analog సంకేతాల స్థానంలో డిజిటల్ డేటా వినియోగం పెరిగింది. చిత్రం, శబ్దం సంఖ్యల రూపంలో ప్రాసెస్ చేయబడి ప్రసారం కావడం ప్రారంభమైంది. దీంతో నాణ్యమైన చిత్రం, మెరుగైన శబ్దం, మరింత సమర్థవంతమైన డేటా ప్రసారం వంటి అవకాశాలు పెరిగాయి. ఇక్కడ నుంచి టెలివిజన్ క్రమంగా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి డిజిటల్ సమాచార పరికరంగా మారడం ప్రారంభించింది.
టీవీకి ఇంటర్నెట్ వచ్చినప్పుడు
స్మార్ట్ టీవీ వచ్చిన తర్వాత టెలివిజన్ స్వరూపం మరింతగా మారింది. ఒకప్పుడు టీవీ ప్రసార కేంద్రం పంపిన కార్యక్రమాన్ని స్వీకరించి చూపించేది. ఇప్పుడు టీవీలో processor, memory, operating system, Wi-Fi, Bluetooth, internet connectivity వంటి సదుపాయాలు ఉన్నాయి. అంటే స్మార్ట్ టీవీ ఒక రకంగా టీవీ + కంప్యూటర్ + Internet పరికరంగా మారింది. ఇప్పుడు మనం YouTube, OTT వంటి వేదికల ద్వారా మనకు కావాల్సిన కార్యక్రమాన్ని, మనకు నచ్చిన సమయంలో చూడగలుగుతున్నాం. ఇది టెలివిజన్ చరిత్రలో ఒక కీలక మలుపు. ఎందుకంటే ప్రేక్షకుడు ఇక కేవలం ప్రసారాన్ని స్వీకరించే వ్యక్తి కాదు, తనకు కావాల్సిన సమాచారాన్ని ఎంచుకునే వ్యక్తిగా మారాడు.
రిమోట్ నుంచి వైఫై వరకు...
టీవీ మారుతున్న కొద్దీ దాన్ని నియంత్రించే విధానమూ మారింది. సాధారణ రిమోట్లు పరారుణ (infrared) కాంతిని ఉపయోగించి టీవీకి సంకేతాలు పంపుతాయి. మన కంటికి కనిపించని ఈ కాంతిని టీవీలోని sensor గుర్తించి మన ఆదేశాన్ని అమలు చేస్తుంది. స్మార్ట్ టీవీలో వైఫై ద్వారా డేటా వైర్లు లేకుండా ప్రయాణిస్తుంది. వైఫైలో ఉపయోగించే రేడియో తరంగాలు కూడా విద్యుదయస్కాంత తరంగాల (electromagnetic waves) కుటుంబానికి చెందినవే. అంటే రిమోట్‌తో ఛానల్ మార్చడం నుంచి ఇంటర్నెట్ ద్వారా సినిమా చూడటం వరకు మనకు తెలియకుండానే Physics మన దైనందిన జీవితంలో పనిచేస్తోంది.
ఒక వీడియో మన తెరపైకి ఎలా వస్తుంది?
యూట్యూబ్‌లో ఒక వీడియోను ఎంచుకున్నప్పుడు మనకు అది వెంటనే తెరపై కనిపిస్తుంది. కానీ వెనుక చాలా పెద్ద ప్రక్రియ జరుగుతుంది. వీడియో డిజిటల్ డేటాగా నిల్వ ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా ఆ డేటా మన టీవీకి చేరుతుంది. Processor ఆ డేటాను అర్థం చేసుకుని చిత్రం, శబ్దంగా మార్చుతుంది. Display system ఆ సమాచారాన్ని pixelsకు అందిస్తుంది. Pixels తమ కాంతి తీవ్రతను, రంగును మార్చుకుంటాయి. చివరకు మన కళ్లకు ఒక పూర్తి చిత్రం కనిపిస్తుంది. అంటే ఒక వీడియో ప్రయాణాన్ని సులభంగా ఇలా ఊహించుకోవచ్చు.
డిజిటల్ డేటా → ప్రసారం → ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ → pixels → కాంతి → కళ్ళు → మెదడు. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరుగుతుంది.
“తెలివైన” స్క్రీన్‌గా మార్చుతున్న కొత్త దశ
ఇప్పుడు టెలివిజన్ మరో కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. అదే Artificial Intelligence. AI ఆధారిత వ్యవస్థలు మనం చూసే కంటెంట్‌ను విశ్లేషించి మనకు నచ్చే కార్యక్రమాలను సూచించగలవు. భాషను మార్చడం, subtitles రూపొందించడం, కంటెంట్‌ను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అందించడం వంటి పనులు కూడా సులభమవుతున్నాయి. భవిష్యత్తులో మనం టీవీని కేవలం చూడకుండా దానితో మాట్లాడే పరిస్థితి మరింత సాధారణం కావచ్చు. ఈ వార్తను నాకు తెలుగులో వివరించు. ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పు. ఈ వీడియోకు ఆధారం ఏమిటి? అని స్క్రీన్‌ను ప్రశ్నించవచ్చు. ఇక్కడ AI సమాచారాన్ని విశ్లేషించి మనకు అర్థమయ్యే విధంగా అందిస్తుంది. అయితే AI ఎంత తెలివైనదైనా, ఆ సమాచారాన్ని మన కళ్లకు చూపించడానికి display technology, pixels, అర్ధవాహకాలు, ఎలక్ట్రానిక్స్ వంటి భౌతిక వ్యవస్థలే అవసరం. అందుకే AI టీవీ అనేది Physics ముగింపు కాదు. Physics, Electronics, Computing, Communication కలిసి చేరిన కొత్త దశ.
కొత్త టెక్నాలజీతో కొత్త ప్రమాదం
ఇక్కడే టెలివిజన్ కథ మరో ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఒకప్పుడు టీవీలో కనిపించిన వార్తను చూసి అది నిజమని నమ్మే పరిస్థితి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు YouTube, సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, AI-generated content వంటి అనేక మార్గాల ద్వారా సమాచారం మనకు చేరుతోంది. వేగంగా సమాచారం చేరడం మంచి పరిణామమే. కానీ అదే వేగంతో తప్పుడు సమాచారం కూడా వ్యాపించవచ్చు. AI సహాయంతో నిజంలా కనిపించే తప్పుడు వీడియోలు, నకిలీ స్వరాలు, కల్పిత దృశ్యాలు తయారు చేయడం సాధ్యమవుతోంది. దీంతో ఇప్పుడు ప్రశ్న కూడా మారుతోంది. “తెరపై కనిపిస్తున్నది నిజమా?” దానికి సమాధానం టెక్నాలజీ ఒక్కటే ఇవ్వదు. మనకు Media Literacy, సమాచారాన్ని ప్రశ్నించే అలవాటు, వాస్తవాలను ధృవీకరించే సామర్థ్యం అవసరం. ఒక వార్తను చూసిన వెంటనే నమ్మకుండా “దీనికి ఆధారం ఏమిటి? “ఇది నిజమైన వీడియోనా? ఇది పాత వీడియోను కొత్త సంఘటనగా చూపిస్తున్నారా? ఇది AI ద్వారా రూపొందించబడిందా? అని ప్రశ్నించడం అవసరం.
గ్రామీణ భారతానికి ఎందుకు అవసరం?
డిజిటల్ వేదికలు విస్తరించినప్పటికీ టెలివిజన్ ప్రాధాన్యతను పూర్తిగా విస్మరించలేం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వాతావరణ సమాచారం, పంటల సూచనలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు, ప్రకృతి విపత్తుల హెచ్చరికలు వంటి సమాచారం సరైన సమయంలో అందించడం ఎంతో విలువైనది. స్థానిక భాషలో, స్థానిక సమస్యలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరవేయగల సామర్థ్యం టెలివిజన్‌కు ఇప్పటికీ ఉంది.
విద్యలో టెలివిజన్‌కు కొత్త అవకాశం
టెలివిజన్, విద్యకు కూడా ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడవచ్చు. శాస్త్ర విజ్ఞానం, పాఠశాల విద్య, పోటీ పరీక్షలు, పర్యావరణం, సాంకేతికత వంటి అంశాలను సులభమైన భాషలో అందిస్తే విస్తృత ప్రజానీకానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్మార్ట్ టీవీ, ఇంటర్నెట్, యూట్యూబ్, ఓటీటీ వంటి వేదికలు కలవడంతో టెలివిజన్ ఒక ఏకదిశా ప్రసార పరికరం నుంచి ఇంటరాక్టివ్ లెర్నింగ్ స్క్రీన్‌గా మారే అవకాశం ఉంది.
టీఆర్పీనా? ప్రజా ప్రయోజనమా?
టెక్నాలజీ ఎంత మారినా టెలివిజన్ ముందున్న ప్రాథమిక ప్రశ్న మాత్రం మారదు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం అవసరం. కానీ సంచలనాత్మక చర్చలు, నిరంతర బ్రేకింగ్ న్యూస్, అతిశయోక్తి, భయాన్ని కలిగించే ప్రదర్శనలు మాత్రమే మీడియా విజయానికి ప్రమాణాలు కాకూడదు. ‘‘ఎంత మంది చూస్తున్నారు?” అనే ప్రశ్నతో పాటు, ఎంత విశ్వసనీయమైన సమాచారం అందిస్తోంది? ఎంత శాస్త్రీయ అవగాహన పెంచుతోంది? ప్రజలను ఎంతగా ఆలోచింపజేస్తోంది? అనే ప్రశ్నలూ ఉండాలి.
ఆలోచింపజేసే తెర కావాలి
ఒకప్పుడు టీవీ కుటుంబ సభ్యులను ఒకచోటికి చేర్చేది. ఇప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కో స్క్రీన్ ముందు కూర్చునే పరిస్థితి వచ్చింది. దీనికి సాంకేతికతను మాత్రమే నిందించలేం. సమస్య సాంకేతికతలో లేదు; దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. కుటుంబ సంభాషణకు దోహదపడే కార్యక్రమాలు, పిల్లలకు ఉపయోగపడే విద్యా కంటెంట్, విజ్ఞాన కార్యక్రమాలు, సామాజిక సమస్యలపై సమతుల్య చర్చలు ఉంటే టెలివిజన్ మళ్లీ కుటుంబ చర్చకు వేదిక కావచ్చు.
చూసే తెర నుంచి ఆలోచించే తెరకు
భవిష్యత్తులో టెలివిజన్ మరింత ఇంటరాక్టివ్‌గా మారవచ్చు. ప్రేక్షకుడు ఒక వార్తను చూస్తూ దాని ఆధారాలను అడగవచ్చు. తనకు అర్థమయ్యే భాషలో వివరణ కోరవచ్చు. ఒక శాస్త్రీయ విషయాన్ని మరింత సరళంగా చెప్పమని అడగవచ్చు. ఏఐ తక్షణ అనువాదం, వివరణ, వాస్తవ నిర్ధారణ వంటి సేవలను అందించవచ్చు.
అంటే భవిష్యత్తు టెలివిజన్ “చూసే తెర” నుంచి “ఆలోచించే తెర”గా మారే అవకాశం ఉంది. అయితే సాంకేతికత ఎంత తెలివైనదిగా మారితే, ప్రేక్షకుడి బాధ్యత కూడా అంతగా పెరుగుతుంది.
తెర మారినా నిజం మారకూడదు
AI యుగంలో చూడడం, వినడం మాత్రమే సరిపోదు. చూసినదాన్ని విశ్లేషించడం, విన్నదాన్ని ప్రశ్నించడం, నమ్మే ముందు ధృవీకరించడం కూడా అవసరం.
మారేది తెర.. మారకూడనిది బాధ్యత. టెలివిజన్ ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి చూస్తే.. పెద్ద CRT పెట్టె నుంచి పలుచని LCD వరకు, LCD నుంచి LED వరకు, LED నుంచి OLED వరకు, Analog నుంచి Digital వరకు, ప్రసార టీవీ నుంచి Smart TV వరకు, Smart TV నుంచి Internet, OTT వరకు, అక్కడి నుంచి AI ఆధారిత స్క్రీన్ వరకు.. ప్రతి దశలో సాంకేతికత మన సమాచార ప్రపంచాన్ని మార్చింది. ఈ ప్రయాణంలో Physics మనకు కాంతిని, ఎలక్ట్రాన్లను, విద్యుత్‌ను, అయస్కాంత క్షేత్రాలను, అర్ధవాహకాలను అర్థం చేసుకునే శక్తిని ఇచ్చింది. ఎలక్ట్రానిక్ వాటిని పరికరాలుగా మార్చింది. Communication technology సమాచారాన్ని దూర ప్రాంతాలకు చేర్చింది. Computing దానిని డిజిటల్ ప్రపంచంగా మార్చింది.
ఏఐ ఇప్పుడు ఆ సమాచారాన్ని అర్థం చేసుకుని మనకు అనుగుణంగా అందించే దిశగా తీసుకెళ్తోంది. కానీ ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం మాత్రం మారకూడదు. నిజాన్ని చెప్పే బాధ్యత. టెలివిజన్ ప్రజలకు కేవలం “ఏం జరుగుతోంది?” అని చెప్పే మాధ్యమంగా ఉండకూడదు. “ఎందుకు జరుగుతోంది? దాని ప్రభావం ఏమిటి? దానిని ఎలా అర్థం చేసుకోవాలి?” అనే ప్రశ్నలను కూడా ప్రజల్లో రేకెత్తించాలి. అప్పుడే టెలివిజన్ ఒక వినోద సాధనం నుంచి జ్ఞాన వేదికగా, ఒక ప్రసార మాధ్యమం నుంచి బాధ్యతాయుతమైన ప్రజా వేదికగా ఎదుగుతుంది. తెర ఎంత స్మార్ట్‌గా మారినా... దానిపై కనిపించే సమాచారం నిజాయితీగా లేకపోతే దాని విలువ శూన్యం. టెలివిజన్ భవిష్యత్తు కేవలం Smart Screenలో లేదు. అది Smart, Responsible and Informed Society నిర్మించడంలో ఉంది. తెర మారడం సహజం.. కానీ ఆ తెరపై కనిపించే నిజం మారకూడదు.
డాక్టర్. పల్లె. సూర్యనాగి రెడ్డి 9491155894






కామెంట్లు (0)