సూర్యుడనేవాడు ఒక్కచోటనే కదలకుండా వుంటాడు. కానీ మన భూగోళమే ఒక చోట కుదురుగ్గా వుండక పోవడం వల్ల కదా చీకటి పడుతున్నది అనుకుంటూ ఊళ్లోకి వచ్చిన గిరీశం వరుసగా వున్న ఇళ్లవైపు చూస్తూ నడవసాగాడు. ఓ గేటు ముందున్న లైటుకింద తాటికాయంత అక్షరాలతో ‘మోహనరావు’ అన్న పేరు, దానికింద ‘ఓటర్’ అని రాసి వుండడం చూసి ఆశ్చర్యపడక తప్పదని పడ్డాడు కింద కాదు. ఇదేమిటిది ఇది నేనెన్నడూ చూళ్లేదే అనుకుంటూ మరో గేటు దగ్గర ‘నేమ్బోర్డ్’ చదివాడు.. ‘సాంబశివుడు’ అన్న పేరు దానికింద ‘ఓటర్’ అని రాసి వుంది. ఇదేమి వింత, ఇదేమి చోద్యం అనుకుంటూ నేమ్ బోర్డులన్నీ చదువుతూ వెళ్లాడు. ఫలానా వ్యక్తి డాక్టర్ అనో, ఇంజనీర్ అనో, ప్రొఫెసర్ అనో వుండటం సబబు కాని ప్రతి ఇంటి ముందూ ఇంటి యజమాని పేరు, దానికింద ‘ఓటర్’ అన్న అక్షరాలు వుండటంతో ఇది తన ఊరేనా అన్న డవుటు రావాల్సిందే కనక వచ్చేసింది.
కానీ ‘కామేశ్వరరావు ఓటర్’ అని గేటు ముందు రాసి వున్న ఇంట్లో నుండి కామేశ్వరరావు బయటకు వచ్చి గిరీశాన్ని చూసి ‘హలో గిరీ హౌ ఆర్ యూ’ అనడంతో ఆ డవుటు అవుటులా పేలిపోయింది.
‘నేను బానే వున్నాను. ఆర్నెల్ల తర్వాత ఊళ్లోకి వస్తున్నాను. అన్ని ఇళ్ల మీద ‘ఓటర్’ అన్న అక్షరాలు కనిపించి కన్ఫ్యూజ్ అవుతున్నాను’ అన్నాడు గిరీశం.
‘ఓర్నీ ఊళ్లో లేవా? అందుకే కనిపించడం లేదు’ అన్నాడు కామేశ్వరరావు, తానేదో వాస్కోడిగామా లాగా.
వీడేంటి నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా యూట్యూబర్లా ఊకదంపుడు దంచుతున్నాడు అనుకుని తన ప్రశ్నను మళ్లీ రిపీట్ చేశాడు ‘సిట్’ ఎంక్వైరీ ఆఫీసర్లా.
‘ఓ అదా! అదే కద! నా పేరు పక్కన ఇదివరకు కామేశ్వరరావు ఎం.ఎ. అని వుండేది. ఇప్పుడు ఆ ఎం.ఎ.ని గిల్లేసి ‘ఓటర్’ అని నేనూ పెట్టాను. ఇప్పుడు మన ఊళ్లో ఓటు వున్న, ఓటు దక్కిన అదృష్టవంతులు అందరూ తమతమ ఉద్యోగపు హోదాలను, డిగ్రీలను పీకేసి ‘ఓటర్’ అని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓటు వున్నవాడే పరువూ ప్రతిష్టా వున్నోడు. ధనవంతుడూ, గుణవంతుడు కూడా. ఓటు లేని వాడూ ఓ మనిషేనా అంటున్నారు మరి. నీ ఓటు పదిలంగా వుందో లేదో, బతికే వుందో, సచ్చి సమాదైపోయిందో తెల్సుకో! కమ్యూటినీ హాలుకు వెళ్లు. ఓటు లేకపోతే నువ్వు ఈ ఊరి మనిషివే కాదు, ఈ రాష్ర్టం మనిషివి కూడా కాదు. ఏదో ఓ దేశం నుంచి కంచె దాటి అక్రమంగా జొరబడిన చొరబాటు దారుడివి అవుతావు. ఆ తర్వాత పడరాని పాట్లు పడతావు’ అంటూ కామేశ్వరరావు ‘ఓటర్’ అన్న అక్షరాల్ని ప్రేమగా ఆప్యాయంగా గౌరవంగా భక్తిగా వినమ్రంగా అరచేత్తో రాసి గేటు లోపలికి వెళ్లిపోయాడు.
గిరీశం గుండెల్లో వందేభారత్ రైళ్లు పరుగెత్తడం మొదలెట్టాయి. ఇండిగో విమానాలు లాండవటానికి ఓటు కనిపించక గాలిలో గిరికీలు కొట్టసాగినయి. కొంపకు వెళ్లి కుక్కి మంచంలో పడుకున్న గిరీశానికి దోమలు కరవకపోయినా నిద్రపట్టలేదు. తన ఓటు ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి, ఇంటి ముందు అందరిలాగే ‘గిరీశం - ఓటరు’ అన్న తాటికాయలు అతికించుకోవాలి. లేకపోతే ఓటు లేనివాడివి నీ దిక్కున్న చోటికి పో అంటే ఎక్కడికి పోగలను అని తెగ ‘పెయిన్’ ఫీలయ్యాడు.
మర్నాడు పదిగంటలకే కమ్యూనిటీ హాలుకు పరుగెత్తాడు తొంభై కేజీలు మోసుకుంటూ. నా ఓటు.. నా ఓటు.. అంటూ అరుస్తూ నిలబడ్డాడు
ఓ కాగితాల కట్ట వున్న టేబుల్ ముందు. కుర్చీలో కూర్చుని పుల్లతో నోటిపళ్ల సందుల్లో దూరిన పదార్థాలను కెలుకుతున్న వాణ్ణి తన ఓటు ఎక్కదుందో అని బతిమాలాడు. తన పర్సనల్ పనికి భంగం వాటిల్లిందని ఆ శాల్తీ విసుక్కుంటూ ఓ కట్ట ముఖాన కొట్టాడు. ‘ఏరుకో, కోరుకో, ఏం కావాలో చూసుకో’ అన్నాడు. గిరీశం నేలమీద కూలబడి ఒక్కో కాగితం వెంట పరుగెత్తాడు. ఒక్కో అక్షరాన్ని వెంటాడాడు. చివరికి భారంగా నిట్టూర్చాడు. గిరీశం అన్న పేరు అంతమంది ఓటర్ల పేర్లల్లో ఎక్కడా కనిపించలేదు. మరో కట్ట, ఇంటో కట్ట, ఎన్ని కాగితాల గుట్టలు.. ఆయాస పడుతూ ఎక్కి దిగినా తన పేరున్న ఓటు కనపడనే లేదు. బతికిన వాళ్లలోనూ లేదు, చచ్చినవాళ్లల్లోనూ కనపడలేదు. తను ఉన్నట్టా మరి లేనట్టా’ అర్థం అవలేదు. ‘నా ఓటు.. నా ఓటు.. కనపడ్డం లేదు’ అని బిగ్గరగా అరిచాడు.
టేబుల్ వెనకున్నవాడు ఆ అరుపుకి బెదిరిపోయాడు. ఏదయినా కనపడకపోతే ఏం చేస్తారోయ్. పోలీసు కంప్లైంట్ ఇవ్వు. నీ ఫొటో అచ్చేసి దాని కింద ఈ ఫొటోలో వున్న మనిషి ‘ఓటు కనపడుట లేదు’ అని కరపత్రాలు ప్రింటు చేయించి గోడలకు అతికించు అన్నాడు.
పాపం.. గిరీశం అమాయకంగా వెళ్లి పోలీస్ స్టేషన్లో నా ఓటు కనపడడం లేదని కంప్లైంట్ రాసిచ్చాడు. గిరిశం ఓటును వెతికి పట్టుకు రావడానికి, నాలుగో ఐదో పదో పోలీసు బృందాలు బయలుదేరుతాయి అన్నాడు ఇన్స్పెక్టర్. తిండీ నిద్రా మానేసి ‘ఓటేరా అన్నిటికీ మూలం’ అని పాడుకుంటూ ఓటు కోసం ఎదురుచూడసాగాడు గిరీశం.
చింతపట్ల సుదర్శన్, 9299809212







కామెంట్లు (0)