Magazines

వాణి గణపతి రెండు మూడు చిత్రాలతోనే వెనక్కి

4 రోజుల క్రితం

Vani Ganapathy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 4 నిమిషాల చదవడం

వైజయంతి మాల, బి. సరోజా దేవి, తిరువాన్కూరు సోదరీమణులలో ఒకరైన పద్మిని, డ్రీమ్ గర్ల్‌గా పేరు పొందిన హేమామాలిని వంటి చాలామంది దక్షిణ భారత నృత్యకారిణులు సినిమా రంగంలోకి ప్రవేశించారు. అలాగే వాణి గణపతి కూడా సినిమాలలో ప్రవేశించి కేవలం రెండు మూడు చిత్రాల్లోనే నటించి తిరిగి వెనక్కి వచ్చింది. తర్వాత తన నృత్య కళా సేవలో మునిగిపోయింది. నృత్యంతోపాటు ఇంటీరియర్ డిజైనర్‌గా ఆమె తన ప్రత్యేకతను నిలుపుకున్నది.


వాణి గణపతి 1950 జూన్ 6న జన్మించింది. కమల్ హాసన్ జీవిత సహచరిగా నేటికీ ఆమెకు సినీ వర్గాలలో గుర్తింపు ఉంది. ఆమె మనదేశంలోనే గాక దేశ దేశాలలో భరతనాట్యం ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు గడించిన కళాకారిణి. వాణి గణపతి కేవలం కమల్ హాసన్‌తో ముడిపడిన పేరు మాత్రమే కాదు. నాలుగేండ్లకే భరతనాట్యంలో శిక్షణ పొంది ఏడేళ్లకే అరంగేట్రం చేసింది. కలకత్తాలో రాజలక్ష్మి గురువుగా ఉన్నపుడు వాణి గణపతి అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత బొంబాయిలో గురువులు గోవిందరాజ్ పిళ్ళై, మహాలింగం పిళ్ళై, కల్యాణసుందరం పిళ్ళై గార్ల వద్ద శిక్షణ పొందింది. నృత్యం గురించి ఆమెను ఓ ఇంటర్వ్యూలో అడిగినపుడు ‘ఇది నా సొంత నిర్ణయం కాదు, మా అమ్మే నా కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నదామె. అదే ఇంటర్వ్యూలో ‘నృత్యాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు?’ అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నన్ను ప్రేరేపించిన వ్యక్తిని ప్రత్యేకంగా ఎవరినీ చెప్పలేను, బహుశా నటరాజ స్వామియే నా కోసం ఈ వృత్తిని నిర్ణయించి ఉంటారని నా నమ్మకం’ అన్నది.

​వాణి గణపతి 1970లో ఆమె ‘టీన్-మిస్ ఇండియా’ కిరీటం అందుకున్నది.1972లో బాలీవుడ్ సినిమాలలో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆమె 1973లో హిందీ చిత్రం ‘ప్యాసి నది’లో తొలుత నటించింది. తర్వాత 1975లో ‘అంధేరా’ హిందీ చిత్రంలో నటించి 1975లో తమిళం చిత్రం ‘మేల్నాట్టు మరుమగల్’లో ఒక ప్రత్యేక నృత్య గీతంలో కమలహాసన్ సరసన నర్తించింది. ఆ చిత్రంలో హీరోయిన్ జయసుధ. తమిళ చిత్రంలో తొలిసారి కలుసుకున్న సందర్భంలోనే వారిద్దరూ మనసుపడి ప్రేమలో పడ్డారు. కమల్ హాసన్‌తో వాణీ గణపతి వివాహం 1978లో జరిగింది. దక్షిణ భారత ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలో కమల్ హాసన్, వాణి గణపతి మెడలో పూలదండలతో ప్రత్యక్షమయ్యారు. నిజానికి చాలా ఏండ్లుగా ప్రేమలో వున్న వారు అప్పటికే వివాహం చేసుకుని, నేరుగా అక్కడికి వచ్చారు. ఫిల్మ్‌ఫేర్ వేడుకలో వారు కనిపించే వరకు వారి వివాహం గురించి ఎవరికీ తెలియదు. వివాహం తర్వాత వాణి సినిమాల్లో నటించకుండా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. నాట్య ప్రదర్శనలతో పాటు కమలహాసన్ నటించిన కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేసింది.

​Vani Ganapathy10 ఏండ్ల దాంపత్య జీవితం గడిపిన తర్వాత 1988లో ఆమె కమలహాసన్‌‌తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న ఆమె తన ‘సంచారి’ నృత్య సంస్థ, రంగస్థల ప్రదర్శనల ద్వారా భరతనాట్యాన్ని ప్రోత్సహిస్తున్నది. అయితే కమల్ హాసన్, వాణి గణపతి విడాకులు, భరణం చెల్లింపుల వ్యవహారంపై ఒక సంచలన చర్చ ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయింది. 2015లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మాట్లాడుతూ వాణి గణపతితో విడిపోయాక ఆమెకు భారీగా భరణం చెల్లించడం వల్ల తాను ఆర్థికంగా పూర్తిగా చితికిపోయానని, దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. సుమారు 28 ఏండ్ల పాటు కమల్ ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు. అయితే తన కుమార్తె శ్రుతి హాసన్‌తో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విడాకుల సెటిల్‌మెంట్ తనను ఆర్థికంగా ఎంతగా కుంగ దీసిందో చెప్పుకొచ్చాడు. భరణం ఇవ్వడం వల్లే తాను అప్పట్లో అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నాడు.

​కమల్ హాసన్ చేసిన ఈ ఆరోపణలపై దాదాపు 28 ఏండ్ల పాటు మౌనంగా ఉన్న వాణి గణపతి ఆ తర్వాత దక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించింది. ‘ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఏ కోర్టు అయినా ఒక వ్యక్తి దివాళా తీసేలా భరణం ఇవ్వాలని తీర్పునిస్తుందా? ఆయన వ్యాఖ్యలు విని నేను షాక్ అయ్యాను. నేనే ఆ పెళ్లి బంధం నుండి బయటకు వచ్చాను. బహుశా ఆ కారణం చేతనే ఆయన అహం దెబ్బ తిని ఉంటుంది. అందుకే ఇలాంటి కల్పిత కథలు చెబుతున్నారు. తాము కలిసి ఉన్నప్పుడు ఫ్లాట్‌లోని పాత వస్తువులను కూడా నాకు ఇవ్వడానికి కమల్ నిరాకరించాడు. అలాంటి వ్యక్తి నుండి భారీ భరణం ఆశించగలమా? ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఆస్తులన్నీ నా కష్టార్జితం, కమల్ ఇచ్చిన భరణంతో వచ్చినవి కావు. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను తప్పులు ఉంటే మన్నించగలరు’ అని చాలా హుందాగా జరిగిన విషయాలను బహిర్పరిచింది.

​వీరిద్దరూ విడిపోవడానికి ప్రధానంగా మూడు అంశాలు చర్చకు వచ్చాయి. మొదటిది వైవాహిక జీవితంలో సమస్యలు. కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదని, తమ మధ్య సంబంధాలు కఠినంగా మారాయని చెప్పాడు. రెండోది సారికతో సంబంధం. నటి సారికతో కమల్ హాసన్‌కు సాన్నిహిత్యం పెరగడం కూడా వీరి విడాకులకు కారణమై ఉండవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పూర్తి స్పష్టత లేదు. మూడవది వాణి గణపతి 2015లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తానే ఆ వివాహం నుంచి బయటకు వచ్చానని తెలిపింది. వాణితో విడాకుల తర్వాత 1988లో కమల్ హాసన్, సారికను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్. 2004లో కమల్, సారిక విడిపోయారు.

Vani Ganapathyసినిమా రంగం నుండి దూరమైన తర్వాత, ఇంకా చెప్పాలంటే కమలహాసన్‌తో విడిపోయిన తర్వాత వాణి గణపతి ఇంటీరియర్ డిజైనింగ్‌ను తన ప్రధాన వృత్తిగా తీసుకున్నది. దీని కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ పొందకపోయినా అందులో రాణించింది. ‘ఇంటీరియర్ డిజైనింగ్ రంగానికి సహజమైన అభిరుచి, ఆసక్తి, మొగ్గు ఉండటం చాలా ముఖ్యం అని నేను భావిస్తాను. దానికి తగిన ‘కళాదృష్టి’ ఉండాలి. డిగ్రీ అనేది కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే అదనంగా అందించగలదు. నాకు ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎటువంటి డిగ్రీ లేదు’ అని స్వయంగా చెప్పుకున్నది.. సప్నా రంగస్వామి, బరోడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. నృత్యం, డిజైనింగ్ రెండు రంగాలలో రాణించిన వాణి గణపతి ‘నేను నిర్వహించిన ప్రతి పాత్రను ఆస్వాదించాను. కాబట్టి వీటిలో ఏ ఒక్కదానికో ప్రాధాన్యం ఇవ్వలేను. అవకాశాలు లభించడం వల్ల నృత్యం, ఇంటీరియర్ డిజైనింగ్ నా జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని పొందాయి. నృత్యం నా ప్రాణం. ఇంటీరియర్ డిజైనింగ్ నా అభిరుచి’ అని అంటుంది. ఏడేండ్ల వయసులో కలకత్తాలో జరిగిన తన అరంగేట్రం సమయంలో తనకు మొదటిసారిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు (చప్పట్లు) లభించిన సందర్భమే నా జీవితంలో అత్యంత విలువైన ప్రశంసగా భావిస్తానని నిరాడంబరంగా చెప్పుకుంటుంది వాణి గణపతి.

హెచ్‌.రమేష్‌‌బాబు, 93916 34727

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్