1960 నవంబర్ 25న డొమినికన్ రిపబ్లిక్లో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో మిరాబల్ సోదరీమణులు పాట్రియా, మినెర్వా, మరియా తెరెసా ముగ్గురూ దారుణంగా హత్యకు గురయ్యారు. మహిళలపై రాజకీయ అణచివేత, హింసకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటానికి గుర్తుగా నవంబర్ 25ను అంతర్జాతీయ మహిళా ఉద్యమం, మహిళలపై హింస నిర్మూలన రోజుగా పాటించడం ప్రారంభించింది. 1999లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఈ రోజును అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్బంగా కొన్ని విషయాలను కలబోసుకుందాం!
ఈ సందర్భాన్ని మనదేశానికి అన్వయించుకుని పరిశీలిస్తే.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచ వేదికపై తన ప్రగతిని చాటుకుంటున్నప్పటికీ, మహిళలు, బాలికల రక్షణ, భద్రత, గౌరవం విషయంలో మాత్రం మానవ హక్కుల సూచిలో ఎక్కడో అట్టడుగున ఉంది. 2026 లింగ సమానత్వం, స్వేచ్ఛ సూచిలో 145 దేశాలకు గాను ఐస్ లాండ్, ఫిన్లాండ్, నార్వే మొదటి మూడు స్థానాల్లో ఉండగా భారతదేశం 131 వ స్థానంలో ఉంది. అలాగే మహిళల శ్రేయస్సు, భద్రత, న్యాయానికి సంబంధించిన సూచిలో కూడా 181 దేశాలలో డెన్మార్క్, ఐస్లాండ్, నార్వే మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతుంటే భారత్ మాత్రం 131 స్థానంలో ఉంది.
మహిళల కనీస హక్కులు...
ఒక మహిళ రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించగలగాలి. ఒక బాలిక ఎలాంటి భయం లేకుండా పాఠశాలకు వెళ్లగలగాలి. ఒక యువతి తనకు నచ్చిన విద్యను అభ్యసించగలగాలి. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోగలగాలి. నచ్చని ప్రేమను స్వేచ్ఛగా తిరస్కరించగలగాలి. ఒక ఉద్యోగిని పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండగలగాలి. ఒక వివాహిత మహిళ భర్త, కుటుంబ సభ్యుల హింసకు గురికాకుండా గౌరవంగా జీవించగలగాలి. ఇవన్నీ ఒక ప్రజాస్వామిక సమాజంలో మహిళలకు ఉండాల్సిన కనీస హక్కులు. కానీ నేడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 2026 సంవత్సరానికి గాను జాతీయ నేర గణాంకాల సంస్థ విడుదల చేసిన నివేదిక కూడా ఈ విషయాన్నే ప్రతిబింబిస్తోంది.
గణాంకాలను పరిశీలిస్తే...
NCRB 2026 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 4,45,256 కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు సగటున 51 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మంది మహిళలకు నేరాల రేటు సగటున 66.4. గత సంవత్సరంతో పోలిస్తే 4 శాతం పెరుగుదల ఉంది. భర్త లేదా అతని బంధువుల వేధింపులకు సంబంధించి 1,33,000 కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం నేరాల్లో 31%. అయితే కంటికి రెప్పలాగా కాపాడవలసిన తండ్రి, అన్నదమ్ముల నుండి కూడా బాలికలకు రక్షణ లేకపోవటం అత్యంత విషాదకరమైన విషయం. ఇదీ ఈరోజు దేశంలో మహిళలు, బాలికల పరిస్థితి! ఈ గణాంకాలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను మాత్రమే తెలియజేస్తాయి. కుటుంబ పరువు, సామాజిక ఒత్తిడి, ఆర్థికంగా ఆధారపడటం, నిందితుల బెదిరింపులు, న్యాయం దొరకదనే నిరాశ వంటి కారణాలతో అనేక మంది మహిళలు ఫిర్యాదు చేయడం లేదు. కాబట్టి నమోదైన కేసులను బట్టి దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను పూర్తిగా అంచనా వేయలేము.
మరింత ఆందోళనకరం...
మహిళలపై హింస అనేక రూపాల్లో కొనసాగుతోంది. గృహహింస, వరకట్న వేధింపులు, హత్యలు, లైంగిక దాడులు, వేధింపులు, యాసిడ్ దాడులు, బాల్యవివాహాలు, కులదురహంకార హత్యలు, అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు వంటి ఘటనలు మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వీటికి తోడు ఈ సాంకేతిక యుగంలో సోషల్ మీడియా కుడా మహిళలపైన వేధింపులకు, హింసకు వేదికగా మారటం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అధికశాతం మహిళలు ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆన్లైన్ డీప్ ఫేక్ లో 90 నుండి 95 శాతం మహిళలే బాధితులు అన్నది మరో అంచనా. వెబ్సైట్లలో స్త్రీలే లక్ష్యంగా ఉండే కంటెంట్ మరింతగా విస్తరిస్తోంది. ఆన్లైన్ వేధింపులు, ద్వేష పూరిత ప్రసంగాలతో ఆన్లైన్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాగే పోలీసులు కూడా పోకిరిలను మించిపోతున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఆందోళనల్లో పాల్గొంటున్న యువతులు, మహిళలను బహిరంగంగానే లైంగికంగా వేధించటం, అసభ్యపదజాలంతో దూషించటం, బెదిరించటం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం.
అమానవీయ ఘటనలు...
తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో గత అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికపై హేమంత్ అనే యువకుడు రంపంతో అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. 2025లో కర్ణాటకలోని ధర్మస్థల ప్రాంతంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, హత్యలు జరిగాయంటూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. జూన్ 27న రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఒళ్ళు గగుర్పొడిచే అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది. 13 ఏండ్ల బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి హోటల్ యజమానికి అమ్మేశాడు. ఐదు రోజుల పాటు 30 మందికి పైగా కామాంధులు ఆమెపైన పదేపదే సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. 2025 జూలైలో ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో 25 ఏండ్ల టెన్నిస్ క్రీడాకారిణి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానన్నందుకు ఆమె తండ్రి కాల్చి చంపిన ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక యువతి తన జీవితాన్ని, భవిష్యత్తును స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కు, కుటుంబంలో మహిళల స్వేచ్ఛ, గౌరవం వంటి అంశాలపై చర్చను ఈ ఘటన ముందుకు తెచ్చింది.
ఒకే నెలలో వరుసగా...
2026 సెప్టెంబర్ నెలలో జరిగిన వరుస సంఘటనలు మనం దేశంలో మహిళలు, బాలికల పైన హింసకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి.
బీహార్‌లోని జముయి జిల్లాలో ఒక అమ్మాయి, అబ్బాయి ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా కొందరు వ్యక్తులు అడ్డగించి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటం, అడ్డుకున్న బాలుడిపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
సెప్టెంబర్ 21న కల్కాజీ సమీపంలోని ఆస్తా కుంజ్ పార్కులో పోలీసులమని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తులు 17 ఏండ్ల బాలికను బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
సెప్టెంబర్ 13న ఉత్తర ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో 16 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి చేసి, కత్తితో గాయపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
సెప్టెంబర్ నెలలోనే పశ్చిమ ఢిల్లీలో పాఠశాల క్యాబ్ డ్రైవర్ చేతిలో నాలుగేండ్ల బాలిక లైంగిక వేధింపులకు గురైంది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అలాగే మరో చోట తొమ్మిదేండ్ల బాలికను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అపహరించి లైంగిక దాడికి పాల్పడినట్లు మరో కేసు నమోదైంది.
14 సెప్టెంబర్న గురుగ్రామ్‌లో స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న మహిళా యూట్యూబర్‌ను కొందరు వ్యక్తులు కారుతో వెంబడించి ఢీ కొట్టిన సంఘటనను పరిశీలిస్తే మహిళలపైన సమాజంలో పాదుకుపోయిన పురుషాదిక్యత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది.
మూఢనమ్మకాల పేరుతో...
2012 ఢిల్లీ నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత దేశంలో నిరసనలు, ఉద్యమాలు ఉధృతమయ్యాయి. చట్టాల్లో మార్పులు వచ్చాయి. కానీ మహిళలపై హింస ఆగలేదు సరికదా మరింతగా పెరిగింది. మరోపక్క మూఢ నమ్మకాల పేరుతో కూడా మహిళలు దాడులకు, కొన్నిసార్లు హత్యలకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 23న చేతబడి చేస్తోందన్న అనుమానంతో ఒక మహిళను ఇంటి నుంచి బయటకు లాగి, చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో దెయ్యం పట్టిందనే నెపంతో షేక్ షకీనాబీ అనే వృద్ధురాలిని పొలాల్లోకి తీసుకెళ్లి, చెట్టు ఎక్కించి కొరడాలతో కొట్టిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు ఆదేశించింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో చేతబడి చేస్తోందన్న అనుమానంతో ఒక యువకుడు తన కన్నతల్లిని డీజిల్ పోసి సజీవదహనం చేసిన దారుణ ఘటన అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చింది. మతమార్పిడులకు పాల్పడుతున్నారనే పేరుతో ఇద్దరు క్రైస్తవ యువతులను హిందూ ధర్మ సంస్కర్తల మంటూ కొందరు మగవారు నడిరోడ్డు మీద కొడుతుంటే దానిని ప్రోత్సాహిస్తూ వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే స్థితికి సమాజం చేరుకోవటం చూస్తున్నాము.
తిలా పాపం తలా పిడికెడు
బాధితుల, వారి కుటుంబ సభ్యుల మానసిక, శారీరక పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తు ఎంత నరకం? కులం, మతం, ప్రాంతం, భాష, సామాజిక స్థితితో సంబంధం లేకుండా అన్ని తరగతుల మహిళలు హింసకు గురవుతూనే ఉన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఆర్ధిక, రాజకీయ, సామాజిక , సాంస్కృతిక అంశాలు దీనికి మరింతగా తోడవుతున్నాయి. మహిళల్ని మరబొమ్మలుగా, ఆస్తిత్వం లేనివారుగా, పురుషునికి లొంగి ఉండటమే సంప్రదాయంగా చూపిస్తున్న అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలను ప్రజలు, ముఖ్యంగా యువత ప్రోత్సాహస్తున్నారంటే పితృస్వామ్య భావజాలం ఎంతగా విస్తరిస్తోందో అనిపించక మానదు. స్త్రీలు కూడా ఈ ప్రభావంలో పడిపోవటం తమ హక్కులను విస్మరించటానికి వీలులేనిది.
ప్రతి ఒక్కరి బాధ్యత
మహిళ పైజమా బొందు లాగి వివస్త్రను చేయటాన్ని లైంగిక దాడి ప్రయత్నంగా భావించలేమని తీర్పులిచ్చే న్యాయమూర్తులు, లైంగిక దాడిని ఆపలేని పక్షంలో దానిని ఆనందించటమే మార్గమని సెలవిచ్చే పార్లమెంట్ సభ్యులు తయారవుతున్న దేశంలో మహిళలకు రక్షణ లభిస్తుందని భావించగలమా? మహిళల భద్రత, గౌరవం, సమానత్వం అనేవి కేవలం ఒక కుటుంబానికి లేదా మహిళలకు మాత్రమే సంబంధించిన అంశాలు కావు. అవి సమాజ ప్రజాస్వామిక విలువలకు, మానవ హక్కులకు, నాగరికతకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలు. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం, మహిళలకు సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం, భద్రత కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళలపై హింస అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదు. అది సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలతో ముడిపడిన తీవ్రమైన సమస్య. అందుకే ఈ సమస్యకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా చైతన్యం కల్పించేందుకు ప్రతి సంవత్సరం నవంబర్ 25న మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది ‘మహిళలు, బాలికలపై హింసను అంతం చేయడానికి ఐక్యమవ్వండి: న్యాయం చేకూర్చండి, బాధితులను రక్షించండి, చట్టాన్ని తప్పించుకునే వారిని అంతం చేయండి’ అనే థీమ్‌తో నిర్వహించబోతున్నారు.
హింసకు మూలం
మహిళలను పురుషులతో సమానమైన మనుషులుగా కాకుండా తక్కువ స్థాయి వారిగా చూసే పితృస్వామ్య భావజాలం మహిళలపై వివక్షకు, హింసకు ప్రధాన కారణంగా ఉంది. కుటుంబం నుంచి సమాజం వరకు మహిళలపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఆలోచనలు అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నాయి. మహిళలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, విద్యను అభ్యసించడం, ఉద్యోగం చేయడం, ఆస్తి కలిగి ఉండడం, రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయడం వంటి ప్రాథమిక హక్కులను కూడా కొన్ని సందర్భాల్లో నిరాకరిస్తున్నారు. మహిళల వస్త్రధారణ, ఆహారం, సంచారం, జీవన విధానాలపై ఆంక్షలు విధించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే.
మన రాష్ట్రంలోనూ...
తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలపైన హింస, వేధింపుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిందితులలో మైనర్లు కూడా ఉండటం ఆందోళనకరం. పండుగల రద్దీ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లోని బస్టాపులు, మెట్రో స్టేషన్లు, దేవాలయాల వద్ద మహిళలను వేధిస్తున్న 3,068 మందిని (వీరిలో 113 మంది మైనర్లు) హైదరాబాద్ షీ టీమ్స్ పట్టుకున్నాయి. అలాగే మల్కాజ్గిరి షీ టీమ్స్ పరిధిలో అందిన 215 ఫిర్యాదుల మేరకు 198 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. తెలంగాణలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో విద్య, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు, ఒంటరిగా నివసించే మహిళలు, రాత్రి వేళల్లో పనిచేసే మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు అవసరం. మహిళలపై హింసను అరికట్టడం అంటే కేవలం నేరాలను తగ్గించడం కాదు. మహిళలను సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించడం, వారి స్వేచ్ఛను గౌరవించడం, వారి నిర్ణయాలను అంగీకరించడం, వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. అందుకే ‘మహిళలు, బాలికలపై హింసకు ముగింపు పలకడానికి ఐక్యంగా పోరాడుదాం.. బాధితులకు అండగా నిలబడదాం!’.
పద్మశ్రీ, 9490098687






కామెంట్లు (0)