ఆ రోజు నా ఫోన్ చూడాలని అడిగింది ఆమె. మామూలుగా నా ఫోన్ జోలికి కూడా రాని ఆమె అలా అడగడం నాకు వింతగా అనిపించింది.
‘నీ ఫోన్ ఇవ్వు.’
‘ఎందుకు?’
‘చూడాలి.’
‘ఏముంది అందులో?’
‘చూస్తే తెలుస్తుంది!’ అంటూ ఫోన్ లాక్కుని నా పక్కనే కూర్చుని ఫోన్ అన్‌లాక్ చేసింది.
“పాస్‌వర్డ్ ఏంటి?”
“నీ పేరే.”
“అబద్ధం!”
“చూసుకో.”
ఫోన్ తెరుచుకుంది. ఆమె ముఖంలో చిన్న విజయగర్వం.
“నిజంగానే నా పేరా?”
“కాదు, పక్కింటావిడది.”
“సరే సరే! ఎక్కువ బిల్డప్ ఇవ్వకు.”
నా బుగ్గ గిల్లి నవ్వింది. నేను ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాను. ఆమె ఫోన్ చూస్తోంది. తెరిచి ఉన్న చాట్ స్క్రీన్ మీద నా క్లాస్‌మేట్ పేరు కనిపించింది. దాని కింద నా మెసేజ్.
“ఏం చేస్తున్నావ్ బంగారం?”
ఆమె చూపు ఆ నాలుగు అక్షరాల దగ్గరే ఆగిపోయింది. ఏమీ మాట్లాడకుండా ఫోన్ నా వైపు తిప్పి స్క్రీన్ చూపించింది.
“ఈ బంగారం ఎవరు?”
“నా క్లాస్‌మేట్.”
ఫోన్ నా చేతిలో పెట్టేసింది.
“ఏమైంది?”
“ఏం కాలేదు.”
సోఫాలో కొంచెం దూరంగా జరిగి కూర్చుంది.
“ఏంటి బుజ్జీ, ఏమైంది నీకు?”
“ఏమీ కాలేదు రామ్.”
ఆ గొంతులో ఏదో ఉంది. కానీ నాకు అర్థం కాలేదు. ఏం చేయాలో తోచక అలాగే కూర్చుండిపోయాను. కొన్ని నిమిషాల తర్వాత ఆమె అడిగింది.
“నువ్వు నన్ను బంగారం అని పిలుస్తావు కదా?”
“అవును. అయితే?”
“తనను కూడా అలాగే పిలుస్తావా?”
“అదొక సరదా పిలుపు. మా క్లాస్‌మేట్స్ మధ్య అలాంటివి మామూలే.”
“అవునా?”
“అవును. దానికి అంత ఫీల్ అవ్వాలా?”
“నీకు ఏ ఫీలింగ్ లేకపోవచ్చు రామ్. నాకు ఉంది.”
నాకు చిరాకు మొదలైంది.
“అంటే?”
“నువ్వు నన్ను బంగారం అని పిలిచినప్పుడల్లా నాకు చాలా ప్రత్యేకంగా అనిపించేది.”
“నువ్వు నాకు ప్రత్యేకమే కదా!”
“అయితే ఇంకొకరిని ఆ పేరుతో ఎందుకు పిలుస్తున్నావ్?”
“ఒక్క మాటతోనే ప్రేమను కొలుస్తావా?”
ఆమె ఒక్కసారిగా నా వైపు చూసింది.
“నేను ప్రేమను కొలవడం లేదు రామ్. నా ప్రేమలో నేను ఎంత ప్రత్యేకమో తెలుసుకోవాలనుకుంటున్నాను.”
నేను సమాధానం చెప్పబోయాను. ఆమె నన్ను ఆపింది.
“నువ్వు తనతో స్నేహంగా ఉండొద్దని నేను చెప్పడం లేదు. కానీ నన్ను పిలిచినట్టే ఇంకొకరిని కూడా పిలిచినప్పుడు.. నాకేదో పోయినట్టుగా అనిపిస్తోంది రామ్!”
నేను మౌనంగా ఉండిపోయాను. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
“నువ్వు మరొకరితో అంత చనువుగా ఉన్నా, నన్ను సంబోధించినట్టుగా మరొకరిని పిలిచినా తట్టుకునేంత బ్రాడ్ కాదు నేను.”
ఆమె గొంతు వణుకుతోంది. కళ్లల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఆమె ఏడవడం చూడలేకపోయాను.
“సరే, ఇక ఎవరినీ అలా పిలవను. సంతోషమేనా?”
“నువ్వు అలా అనాల్సిన అవసరం లేదు.”
“మరి నేనేం చేయాలి?”
“నన్ను అర్థం చేసుకోవాలి.”
ఆ మాట గదిలో కొద్దిసేపు అలా ఉండిపోయింది. ఆమె లేచి బ్యాగ్ తీసుకుంది.
“ఎక్కడికి?” అడిగాను.
“ఇంటికి.”
“ఇప్పుడా?”
“ఇక్కడే ఉంటే మళ్లీ ఏదో అంటాను. నీకు కోపం వస్తుంది. నాకు బాధ పెరుగుతుంది.”
ఆమె తలుపు వైపు నడిచింది.
“బుజ్జీ..” పిలిచాను. ఆగింది. వెనక్కి తిరగలేదు.
“నీకు నేనేంటో నాకు తెలుసు రామ్. కానీ నువ్వు నన్ను పిలిచే ప్రతి మాటలోనూ నాకంటూ ఒక ప్రత్యేకత ఉందనుకుంటాను. అదే మాట ఇంకొకరితో కూడా అనగలిగినప్పుడు.. ఇన్నాళ్లూ నేను ప్రత్యేకంగా అనుకున్నది నిజంగా ప్రత్యేకమేనా అనిపించింది. నువ్వు తప్పు చేశావని తీర్పు చెప్పడం లేదు. కానీ నీ మనసులో నాకున్న స్థానాన్ని గుర్తుచేసే ఆ చిన్న మాట ఇప్పుడు నన్ను బాధపెడుతోంది.”
ఆమె వెళ్లిపోతుంటే ఆపాలనిపించింది. కానీ ఏం చెప్పి ఆపాలో తెలియలేదు.
“ఒక్క నిమిషం” అన్నాను. ఆమె ఆగింది.
“నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైందో లేదో తెలియదు. కానీ నీ బాధను చిన్న విషయంగా తీసుకుని తప్పు చేశాను. సారీ.”
ఆమె నా వైపు తిరిగింది.
“నువ్వు తనతో మాట్లాడటం మానేయాలని నేను కోరుకోవడం లేదు రామ్.”
“తెలుసు.”
“తెలియదు. తెలిస్తే మొదట్లోనే నా బాధను చిన్న విషయంగా తీసుకునేవాడివి కాదు.”
ఆ మాటకు నా దగ్గర సమాధానం లేదు. నేను ఆమె దగ్గరకు వెళ్లి చేయి అందించాను. ఆమె కాసేపు నా వైపు చూసి తన చేతిని నా చేతిలో పెట్టింది. తిరిగి సోఫాలో నా పక్కన కూర్చోబెట్టుకుంటూ...
“నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను” అన్నాను.
“నాకు తెలుసు.”
“అయినా బాధపడ్డావు.”
ఆమె తల ఊపింది.
“కొన్ని విషయాలు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా బాధ కలిగిస్తాయి రామ్.”
నేను ఆమెను దగ్గరకు తీసుకున్నాను. ఆమె మొదట బిగుసుకుంది. కాసేపటికి నా భుజం మీద తల పెట్టింది.
“బంగారం..” అని పిలిచాను.
ఆమె వెంటనే తలెత్తింది.
“ఇప్పుడు ఆ పిలుపు వద్దు”
నేను ఆగిపోయాను.
“ఆ మాట వింటే మళ్లీ ఆ చాట్ గుర్తొస్తోంది, కొంచెం సమయం కావాలి.” అంది. ఆమె తల మీద చేయి వేసి నిమిరాను. ఆమె నా చేతిని గట్టిగా పట్టుకుంది.
“రామ్..”
“ఊ?”
“నన్ను మళ్లీ ఎప్పుడు బంగారం అని పిలుస్తావు?”
“నువ్వు వినాలనుకున్నప్పుడు.”
“నేను ఎప్పుడూ వినాలనే అనుకుంటాను. కానీ ఆ మాట విన్నప్పుడు మళ్లీ నొచ్చుకోకూడదనుకుంటున్నాను.”
“అయితే తొందరేం లేదు.”
ఆమె నా భుజం మీద తల వాల్చింది. నేను ఆమెను దగ్గరకు లాక్కున్నాను. కొద్ది సేపటి తర్వాత అడిగింది.
“రామ్..”
“ఊ?”
“నేను నీకు ప్రత్యేకమే కదా?”
నేనేమీ మాట్లాడలేదు. ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.
“మాట్లాడవేం?’’
‘‘ఆలోచిస్తున్నా’’
‘‘దేనిగురించి?”
“నీ గురించే.”
ఆమె నా వైపు చూసి చిన్నగా నవ్వింది. నేను ఆమె నుదిటిపై ముద్దు పెట్టాను.
“ఇది చాలు రామ్.. ప్రస్తుతానికి.”
ఆ రోజు నా ఫోన్ చూడకముందు ఆమె ముఖంలో ఉన్న అల్లరి నవ్వు, చివరికి మళ్లీ కనిపించింది.
- రామ్







కామెంట్‌లు (0)