హెల్తీ ఫుడ్
ఆహారం పాడవకుండా నిరోధించడానికి మనం శతాబ్దాలుగా పులియబెట్టిన ఆహార పదార్థాలను ఆశ్రయిస్తున్నాం. ఇవి మన పేగు ఆరోగ్యాన్ని, మొత్తం శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలు పులియబెట్టే ప్రక్రియ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని అధ్యయనాల్లో తేలింది.
పులియబెట్టిన ఆహారం అంటే..?
ఆహారంలోని సహజ చక్కెరలు, పిండి పదార్థాలను తినే సూక్ష్మజీవుల (సాధారణంగా బ్యాక్టీరియా, ఈస్ట్‌లు లేదా బూజులు) చర్య ద్వారా పులియబెట్టిన ఆహారాలు తయారవుతాయి. ఈ ప్రక్రియలో అవి ఆహారాన్ని నిల్వ ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహించే సేంద్రీయ ఆమ్లాలు (లాక్టిక్ ఆమ్లం వంటివి), ఎంజైములు, పోషకాలను ఉత్పత్తి చేస్తాయి. చాలా పులియబెట్టిన ఆహారాలలో ‘ప్రోబయోటిక్స్’ కూడా ఉంటాయి. ఇవి మన పేగు ఆరోగ్యానికి తోడ్పడే ‘మంచి బ్యాక్టీరియా’.
పులియబెట్టిన ఆహార ప్రయోజనాలు
ఉదర ప్రయోజనాలు: పొట్టను ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అన్ని వ్యాధులకు మూలం పొట్ట. పులియబెట్టిన ఆహారంలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి అన్ని సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. పులియబెట్టిన ఆహారంలో ఉండే లాక్టిక్ యాసిడ్ పేగులకు ఎంతో మంచిది. ఇది పేగుల్లో ఉండే మురికిని, చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తికి: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతాడు. వైరల్, ఫ్లూ మొదలైన అంటువ్యాధులు వేగంగా చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితిలో మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియా అవసరం. అప్పుడు పులియబెట్టిన ఆహారం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
జీవక్రియలో మెరుగుదల: పులియబెట్టిన ఆహారాలు తేలికగా జీర్ణమవుతాయి. వీటిని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల అవసరాన్ని తీరుస్తుంది. దీని కారణంగా శరీరానికి విటమిన్ బి-12 చాలా లభిస్తుంది.
కిణ్వ ప్రక్రియ (Fermentation): దక్షిణ భారత ఆహారంలో కిణ్వ ప్రక్రియ ఉంటుంది. అందువల్ల దోశ, ఊతప్పం, ఇడ్లీ మొదలైనవి తినవచ్చు. వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకొని తినవచ్చు. ఇవే కాకుండా పెరుగు, ఊరగాయ మొదలైనవి కూడా పులియబెట్టిన ఆహార కేటగిరీలోకి వస్తాయి.
వాణీ అయోధ్య
క్లినికల్ డైట్ కన్సల్టంట్
99593 61180






కామెంట్లు (0)