Magazines

మీ పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్

4 రోజుల క్రితం

Vision Statement
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 3 నిమిషాల చదవడం

మీరు ఒక కొత్త ఉద్యోగంలోకి మారాలన్నా, ఒక కొత్త జీవితాన్ని ఏర్పరచుకోవాలన్నా, కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలనుకున్నా మీ లక్ష్య సాధనకు విజన్ స్టేట్‌మెంట్ తోడ్పాటు ఎంతో అవసరం. ఇది మీరు ఎక్కడ వున్నారో స్పష్టంగా తెలియచేస్తుంది. ఇక్కడనుంచి ఎటువెళితే మీ లక్ష్యానికి చేరువకాగలరో వివరిస్తుంది.


పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్ భావనను సిసిలి పీటర్ కిన్ ఆవిష్కరింపచేసింది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో పేరెన్నిక గన్న కెరీర్ కౌన్సెలర్‌గా వుంది. ఎంతోమంది కెరీర్ అనుభవాలకు తగిన సలహాలనిస్తూ, విశేషమైన అనుభవం పొందిన సిసిలీ కెరీర్ సక్సెస్‌కు విజన్ స్టేట్‌మెంట్ ఎంతగానో దోహదపడుతుందని అంటుంది. ప్రతివ్యక్తి తనదైన ఒక విజన్‌ను ఏర్పరచుకోవడమెలాగో వివరించిన సిసిలీ, వ్యక్తిగత వైయుక్తిక విజన్‌ను, ఆ వ్యక్తి తన దైనందిన చర్యల్లో స్పష్టంగా ప్రతిబింబించే విధంగా చేయడమెలాగో పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్ ద్వారా బహిర్గతమవుతుందని అంటుంది. కాగా పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్, మీ పర్సనల్ విజన్‌ను సాధించడాన్ని మీ నిత్యచర్యగా మలుస్తుంది.

మీ పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్ ఎంత నిడివి అయినా వుండవచ్చు. అది కేవలం కొన్ని పదాలు మాత్రమే కల్గినదై వుండవచ్చు లేదా కొన్ని పేజీల వరకు వుండవచ్చు. అయితే పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్ అన్నది మీరు చేయవల్సిన పనులను తెలిపే జాబితా లాంటిది కాదు. ఇది మీ అపూర్వతను చాటి చెప్పేది. మిగిలిన వ్యక్తులందరికీ మీకు గల తేడాను స్పష్టంగా తెలిపేది. మీరు ఎంత శక్తిమంతమైన మూర్తిమత్వాన్ని కలిగివున్నారో వివరిస్తుంది. మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ భవిష్యత్తు రూపమేమిటో తెలియపరిచే స్టేట్ మెంట్ ఇది.

ప్రస్తుతపు ‘మీరు’: మీ వర్తమాన స్వరూపం పట్ల మీకు సంపూర్ణమైన అంగీకార భావన వుండాలి, ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఎట్లాంటిది అంటే.. ఉదాహరణకు మీరు ఫలానా చోటుకి వెళ్ళదలిచారు లేదా ఫలానా ఊరుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఆ ఫలానా ఊరుకి ఎట్లా వెళ్ళాలో తెలియాలంటే ప్రస్తుతం మీరు ఎక్కడ వున్నారో స్పష్టంగా మీకు తెలియాలి. అపుడే మీకు కావల్సిన ప్రదేశానికి ఎటువెళ్ళాలో తెలుసుకో గల్గుతారు. గోల్కొండ కోట వంటి చారిత్రాత్మక ప్రదేశాలను, వైశాల్యంలో చాలా విస్తృతమైన ప్రదేశాలను మీరు పర్యటించే వుంటారు. ఆయా ప్రదేశాలలో మీరు గమనించే వుంటారు. అక్కడ కూడా మీకు కొన్ని మ్యాపులను తెలిపే బోర్డులు కన్పిస్తాయి. ఆ మ్యాపులు ప్రదేశం వివరాలను తెలియచేస్తాయి. ఎటు వెళితే ఏ ప్రదేశం వస్తుందో స్పష్టంగా చూపబడి వుంటుంది. అదే మ్యాపులో ప్రస్తుతం మీరు ఆ మ్యాపును చూస్తూ నిలబడి వున్న ప్రదేశాన్ని కూడా సూచిస్తూ ఎర్రగా ఒక వలయాన్ని గీస్తారు. ఆ వలయం లోపల ‘ప్రస్తుతం మీరిక్కడ వున్నారు’ అని తెలియజేస్తారు. ఎందుకంటే అంత సువిశాలమైన ప్రదేశంలో ప్రస్తుతం మీరెక్కడ వున్నారో మీకు తెలియకపోతే, మీకు కావల్సిన (చూద్దామని మీరు ఆశపడుతున్న) ప్రదేశానికి ఎటు వెళ్ళాలో తేల్చుకోలేరు. ఎందుకంటే ప్రస్తుతం మీరున్న ప్రదేశం నుండే మీ ప్రయాణం మొదలవుతుంది.

మీ పర్సనల్ విజన్ని అనుసరించడం అంటే ఒక్కసారిగా మార్పును ఎదురు చూడడం కాదు. ఏ వ్యక్తిలోనూ హఠాత్తుగా ఏ మార్పూరాదు. ఏ ‘మార్పు’చోటు చేసుకోవాలన్నా కాలక్రమేణా, దశలవారీగా జరగాల్సిందే. మీ పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్, మీకు కావల్సిన ప్రదేశానికి మీరు చేరుకోవటానికి అనుసరించవల్సిన దశలను మార్గాలను అందిస్తుంది.

మీ పర్సనల్ విజన్ స్టేట్మెంట్ ప్రధానంగా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్ప గలిగేదిగా వుండాలి.

1. నా జీవన ప్రయోజనం ఏమిటి?

2. నేను దేనికి కట్టుబడి ఉన్నాను?

3. నా పరమార్ధాన్ని నా విలువలను రంగరింపచేసి, నేను చేయవల్సినదేమిటి?

అట్లా సమాధానాలను అందివ్వగల విజన్ స్టేట్మెంటును మీరు రూపొందించు కోవాలి. రూపకల్పన చేసుకోండి. అది మీ జీవితమార్గాన్ని నిర్దేశిస్తుంది. మీ జీవితాన్ని నడిపించే సామర్థ్యపు బాధ్యతలను తీసుకుని, శక్తిమంతమైన నాయకునిలా మిమ్మల్ని మీరు నడిపించుకోవటానికి పర్సనల్ విజన్ స్టేట్‌మెంట్ బాగా ఉపయోగపడుతుంది. నిస్సందేహంగా ఇది మీరు అధిగమించ వల్సిన దశలను వివరిస్తుంది. మీ రేపటి కలను ఎట్లా నిజం చేసుకోవాలో విదితపరుస్తుంది. అంతేకాదు విజన్ స్టేట్‌‌మెంట్ మీకు ప్రతిరోజూ స్ఫూర్తిని అందిస్తూ వుంటుంది.

Vision Statement


డా.హిప్నో పద్మా కమలాకర్‌ 9390044031 కౌన్సెలింగ్‌ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్