Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీసు విధులకు క్రీడలే ప్రాణాధారం

పోలీసు విధులకు క్రీడలే ప్రాణాధారం

- Advertisement -

– అవి వారిని మానసికంగా చురుగ్గా ఉంచుతాయి : గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా
– 74వ బి.ఎన్‌ మల్లిక్‌ అఖిల భారత పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఒక పోలీసు అధికారికి క్రీడలు కేవలం హాబీ మాత్రమే కాదని, అవి వారిని మానసికంగా చురుగ్గా ఉంచుతూ విధి నిర్వహణలోని కఠినమైన అవసరాలకు శారీరకంగా సిద్ధం చేస్తాయని తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా అన్నారు. క్రీడలు.. కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, పోలీసు విధులకు ప్రాణాధారమని చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం నాడు ’74వ బి.ఎన్‌. మల్లిక్‌ అఖిల భారత పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 2025-26′ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ….తనకు క్రీడలంటే అపారమైన ప్రేమని, గతంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో క్రీడలశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది తమ యూనిఫాం పక్కన పెట్టి, క్రీడా జెర్సీల్లో స్నేహాన్ని, ఆరోగ్యకరమైన పోటీని జరుపుకోవడానికి ఒకచోట చేరడం అసాధారణమైన విషయమని కొనియాడారు. భవిష్యత్తులో ఈ పోటీల్లో మహిళా పోలీసుల భాగస్వామ్యం ఇంకా ఎక్కువగా ఉండాలని, వారి భాగస్వామ్యం మన బలగాలను మరింత బలోపేతం చేస్తూ అందరినీ కలుపుకొని పోయేలా చేస్తుందని ఆకాంక్షించారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచస్థాయి అథ్లెట్లకు కేంద్రంగా ఎదుగుతోందని ప్రశంసించిన గవర్నర్‌.. క్రీడాకారులందరూ పూర్తి ఉత్సాహంతో, నిష్పక్షపాతంగా ఆడుతూ క్రీడాస్ఫూర్తిని నిలబెట్టాలని హితవు పలికారు. అందమైన భాగ్యనగరంలో క్రీడాకారులందరూ పోటీలను ఆస్వాదించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ డీజీపీ బి. శివధర్‌ రెడ్డి మాట్లాడుతూ… ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ వేదిక కావడం తమకు అత్యంత ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. గవర్నర్‌ రాక ఈ కార్యక్రమ వైభవాన్ని పెంచడమే కాకుండా యువ ప్రతిభకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని తెలిపారు. పోలీస్‌ సేవలో క్రీడలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రతిబింబించే జట్టుకృషి, వ్యూహం, ఓర్పు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, సహచరులపై నమ్మకం వంటి లక్షణాలు ప్రతి పోలీసు అధికారికి అవసరమని వివరించారు. ఇన్స్పెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ (స్పోర్ట్స్‌) గజరావు భూపాల్‌ స్వాగతోపన్యాసం చేస్తూ… తెలంగాణలో గతంలో ఫుట్‌బాల్‌ క్రీడకు చాలా ఆదరణ ఉండేదని తెలిపారు. పోలీస్‌ శాఖకు చెందిన పలువురు క్రీడాకారులు ఫుట్‌బాల్లో ప్రపంచవ్యాప్తంగా రాణించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని ఐదు గ్రౌండ్లలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ లు కొనసాగుతాయని చెప్పారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.రమేశ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్‌, డీజీపీ, తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ మ్యాచ్‌ను గవర్నర్‌, డీజీపీ తదితరులు కొద్దిసేపు వీక్షించారు. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, అడిషనల్‌ డీజీపీలు సంజరు కుమార్‌ జైన్‌, అనిల్‌ కుమార్‌, డీఐజీ అభిషేక్‌ మహంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -