9 మంది మృతి…
శ్రీకాకుళంలోని కాశీబుగ్గ
వేంకటేశ్వరస్వామి గుడిలో ఘటన
మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు
పలువురికి తీవ్ర గాయాలు
ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది మహిళలు, 12 ఏండ్ల బాలుడు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రెయిలింగ్ కూలడంతో ఘటన?
కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయం పూర్తిగా ప్రయివేటు వ్యక్తుల అధీనంలో ఉంది. ఏకాదశి సందర్భంగా ఆ ఆలయం ప్రాముఖ్యత గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. ఈ ఆలయంలో ఏర్పాట్లు రెండువేల మందికి మాత్రమే సరిపోతాయి. కానీ శనివారం దాదాపు 25వేల మందికి పైగా భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. మొదటి అంతస్తులో ఉన్న ఆలయానికి మెట్ల ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భక్తులు మెట్లు ఎక్కుతూ ముందుకు కదులుతుండగా అక్కడి రెయిలింగ్ కూలిపోయింది. దీంతో అప్పటికే మెట్లపై కిక్కిరిసి ఉన్న భక్తులు నియంత్రణ కోల్పోయి ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఏం జరుగుతుందోనని తెలుసుకొనే లోపే తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకున్నదని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలో పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించినట్టు స్థానిక అధికారులు చెప్పారు. ఏడుగురు భక్తులు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనలో సుమారు 25 మంది గాయపడినట్టు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతులు వీరే
తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు. టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మి (50), పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ (60), మందసకు చెందిన రాజేశ్వరి (60), బందావతి (62) నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ (56), సోంపేటకు చెందిన నిఖిల్ (13), పలాసకు చెందిన అమ్ముడమ్మగా గుర్తించారు. రూప అనే మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం
ప్రమాద ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారికి సంతాపం, వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తొక్కిసలాట ఘటన జరగడం విచారకరమని ప్రధాని మోడీ అన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రకటించింది.
ఘటన అత్యంత విషాదకరం : ఏపీ సీఎం చంద్రబాబు
కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రమాదం తనను కలచివేసిందని చెప్పారు. ఈ మేరకు ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినట్టు చెప్పారు. ఆలయ తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను ఆదేశించారు. మతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
సమగ్ర విచారణకు ఆదేశం : హోం మంత్రి అనిత
ప్రమాద ఘటన గురించి ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వివరించారు. ఈ ఆలయానికి ప్రతి వారం రెండు వేల మంది వరకు భక్తులు వస్తారని చెప్పారు. ఆలయం మొదటి అంతస్తులో ఉన్నదనీ, భక్తులు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ కూలిందన్నారు. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడడంతో తొక్కిసలాట ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు.
నాలుగేండ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్‌పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు.



