Magazines

మోడీ పాలనలో రైతాంగానికి తీరని ద్రోహం

26 నిమిషాల క్రితం

A grave betrayal of the farming community under Modi’s rule
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

ఐదు లక్షలపైగా రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్య
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఎంఎస్‌పీ అమలు చేయాలి

విదేశీ వాణిజ్య ఒప్పందాలతో 
దేశీయ రైతాంగానికి నష్టం : ఏఐకేఎస్ 
జాతీయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్

​ నవ తెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తోందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అన్నారు. ఈ 12 ఏండ్లలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల ‌మందికి పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి 18వతేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో విజ్జూకృష్ణన్‌ ‌మాట్లాడారు. మహాసభ లక్ష్యాలు, రైతాంగ సమస్యలు, భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను వివరించారు. దేశవ్యాప్తంగా ఏఐకేఎస్‌కు ఉన్న 1.58 కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు, పరిశీలకులు, ఇతరులు కలిపి సుమారు రెండు వేల మంది మహాసభకు హాజరవుతారని తెలిపారు. ​

వ్యవసాయరంగ సంక్షోభం, రైతుల ఆత్మహత్య, కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, రైతులకు గిట్టుబాటు ధరలు, కార్పొరేట్ సంస్థల జోక్యం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్‌ ఉద్యమాలకు ‌మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ​తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశానికే కాకుండా ప్రపంచ రైతాంగ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందని, అలాంటి చారిత్రక పోరాటాల గడ్డపై జాతీయ మహాసభ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ​విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్ ధరలు పెరుగుతున్నా రైతులకు పంటలపై తగిన ఆదాయం రావడం లేదన్నారు. ​అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, బ్రిటన్ తదితర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ రైతాంగానికి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు.

పంటల బీమా కంపెనీలు 2017 నుంచి 2023 మధ్య రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని పూర్తిస్థాయిలో అందించకుండా రూ.60 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జించాయని అన్నారు. నవంబర్ 26న ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై నిరసనలు నిర్వహిస్తామని, డిసెంబర్ 1 నుంచి 3 వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. రైతుల రుణమాఫీ కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

​వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి: పోతినేని సుదర్శన్

​కార్పొరేట్ శక్తుల దాడి నుంచి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ​రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించినంత మాత్రాన ప్రభుత్వ బాధ్యత ముగియదని, నష్టపోయిన రైతులకు ఆహార పంటలకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

​ 22ఏ నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి: సాగర్

​22ఏ నిషేధిత జాబితాలో ఉన్న అర్హులైన రైతుల భూములను అందులో నుంచి తొలగించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల అటవీ భూములను పేదలు సాగు చేసుకుంటున్నారని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజన, గిరిజనేతర రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కరువు పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని కోరారు.

​ రైతు ఉద్యమాలకు నల్లగొండ కొత్త వేదిక కావాలి: జూలకంటి రంగారెడ్డి

​వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డగా నిలిచిన నల్లగొండ జిల్లా భవిష్యత్‌లో దేశవ్యాప్త రైతు ఉద్యమాలకు కేంద్రంగా మారాలని ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి ఆకాంక్షించారు. రైతులు, ప్రజల సహకారంతోనే మహాసభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మహాసభ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అగ్రి షోలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, నీటి వినియోగ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు 200 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ​ విలేకరుల సమావేశంలో రైతు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్