Magazines

నాగరికత నిర్మాణకర్తల చరిత్ర వెలికితీయాలి

13 నిమిషాల క్రితం

The history of the builders of civilization must be brought to light.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రజాస్వామ్య నవభారత నిర్మాణానికి చరిత్ర అధ్యయనమే పునాది

ఎంజీయూలో 45వ దక్షిణ భారత 
చరిత్ర కాంగ్రెస్‌ మహాసభలో వక్తలు

చరిత్ర గ్రంథాల ఆవిష్కరణ..
 పరిశోధనా పత్రాల సమర్పణ

​నవ తెలంగాణ -నల్లగొండ, ప్రాంతీయ ప్రతినిధి

​​నాగరికత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, చేతివృత్తిదారుల చరిత్రను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత చరిత్రకారులపై ఉందని బెంగళూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఎస్‌కే మస్తాన్‌వలి అన్నారు. నల్లగొండ జిల్లా ​మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్‌ మహాసభను శుక్రవారం ఉపకులపతి ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మస్తాన్‌‌వలి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పునాదులపై నవభారత నిర్మాణానికి చరిత్ర అధ్యయనం దోహదపడాలన్నారు. సమాజాన్ని హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి, సమ్మిళిత అభివృద్ధికి చారిత్రక అవగాహన అవసరమని చెప్పారు. చరిత్ర రచన గత సంఘటనల నమోదుకే పరిమితం కాకుండా సమానత్వం, ప్రగతికి మార్గనిర్దేశం చేయాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్‌ నూతన అధ్యక్షులు ప్రొఫెసర్‌ విక్టర్‌బాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఉత్తర, దక్షిణ భారత మత, సాంస్కృతిక సంప్రదాయాల ప్రాంతీయ ప్రత్యేకతలు, పరస్పర ప్రభావాలను అధ్యయనం చేయాలని సూచించారు. వలసపాలన కాలం నాటి చరిత్రలోని పక్షపాతాలను పరిశీలిస్తూ సామాన్య ప్రజల జీవన అనుభవాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు.​ మహాసభలో తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్‌ అండ్‌ కల్చర్‌ శాఖ సంచాలకులు, మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కె.అర్జునరావు, కాంగ్రెస్‌ కార్యదర్శి ప్రొఫెసర్‌ సదాశివన్‌ పాల్గొన్నారు. యువ చరిత్రకారుల స్మారక పురస్కారాలతోపాటు ఉత్తమ పరిశోధన పత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఐదుగురు పరిశోధకులు, అధ్యాపకులు రచించిన చరిత్ర గ్రంథాలను ఆవిష్కరించారు.​ రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సముద్ర వాణిజ్య, అణగారిన వర్గాల చరిత్ర తదితర అంశాలపై పరిశోధకులు పత్రాలు సమర్పించారు. స్మారకోపన్యాసాలు నిర్వహించారు. నూతన ఆంఫిథియేటర్‌లో విద్యార్థుల శాస్త్రీయ నృత్యాలు, తెలంగాణ జానపద ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అంజిరెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అరుణప్రియ, ప్రొఫెసర్‌ విజయబాబు, స్థానిక కార్యదర్శి డాక్టర్‌ పనస రామకృష్ణ, ప్రొఫెసర్‌ ఆకుల రవి, డాక్టర్‌ షరీఫ్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, వివిధ రాష్ట్రాల పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్